కరోనాతో కల్లోలం

కరోనాతో కల్లోలం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: కందర్ప(వెంకట సత్యనారాయణ)మూర్తి

కొన్ని సంఘటనలు యాధృచ్చికంగా జరిగినా జీవితంలో గుర్తుండిపోతాయి. అటువంటి జ్ఞాపకమే ఇక్కడ రాస్తున్నాను.
2020 మార్చి నెలలో నేను ఒక శుభకార్యం కోసం హైదరాబాదు నుంచి విశాఖపట్నం జిల్లా అగ్రహారం గ్రామానికి మా భావమరిది ఇంటికి రావల్సి వచ్చింది.
చైనా దేశంలో పుట్టి అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించి ఆర్థిక వ్యాపార వాణిజ్య విద్య వినోద పర్యాటక సమాచార వ్యవస్థలను కుదిపేసి లక్షల్లో ప్రాణులను కబళించిన మహమ్మారి కరోనా (కోవిడ్-19)వైరస్ భారతదేశాన్ని కూడా వదల లేదు. మొదటగా కేరళ రాష్ట్రంలో అడుగు పెట్టి మత ధార్మిక సమ్మేళనాల ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలకు అత్యంత వేగంగా విస్తరించి ప్రాణ నష్టమే కాకుండా దేశ ఆర్థిక వర్తక వాణిజ్య విద్య వినోద పారిశ్రామిక రంగాలపై ప్రభావం చూపింది. కరోనా మహమ్మారి ఉధృతిని ముందే పసికట్టిన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కొవ్వత్తి దీపాలు వాయిద్యాల సవ్వడి చర్యలతో తన ప్రసంగాలతో ప్రజలను జాగరుకపరిచారు. కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా దేశంలో దశల వారిగా లాక్ డౌన్ అమలు చేసి వ్యవధి పొడిగిస్తు పరిస్థితుల్ని కట్టడి చేస్తు వచ్చారు.
నేను అగ్రహారం వచ్చిన మర్నాడే కరోనా వైరస్ ఉధృతి కారణంగా దేశం అంతటా లాక్ డౌన్ పెట్టి అనేక ఆంక్షలతో ప్రయాణ సదుపాయాలు లేక ఎక్కడి వాళ్లు అక్కడే ఇంటి ఖైదీలుగా మారేరు. కరోనా వైరస్ గాలితో, చేతులు కలిపినా, మూడు అడుగుల దూరంలో తుమ్మినా దగ్గినా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని కనక అందరూ నోటికి గుడ్డ మాస్కులు పెట్టుకుని సామాజిక దూరం పాటించాలని వైద్య సూచనలు జరిగేవి. రోజంతా మూతికి మాస్కులు , అడుగడుకీ సానిటైజర్లతో చెయ్యి కడుగుళ్లు, పరిసరాలు ఫ్లోర్ డెట్టాల్ క్లీనింగుతో ఇల్లంతా హాస్పిటల్ వాతావరణం కనబడేది. గ్రామాల మద్య రాకపోకలు బంద్. సరిహద్దుల్లో బారికేడ్లు పోలీసుల పహరా. కొన్ని చోట్ల ముళ్ల తుప్పలతో దారికి అడ్డు పెట్టి కొత్త వారికి ఊళ్లో ప్రవేశం నిషేధం బోర్డులు కనబడేవి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు బేంకులు పాఠశాలలు దేవాలయాలు గుడులు వ్యాపారాలు కార్ఖానాలు హోటళ్లు బందయి ప్రజావసరాలకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వమే ప్రజలకు ఆర్థిక ఆహార సరుకులు మందులు అందిస్తూ ఆదుకుంది. కరోనా నిబంధనల కారణంగా ప్రజలకు ఉధ్యోగస్తులకు వ్యాపారులకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
పాఠశాలలు మూసినందున విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయారు. కులవృత్తుల వారు అర్చకులు పురోహితులు వ్యాపారస్తులు పండిన పంటలు పళ్లు పువ్వులు మార్కెట్లు లేక రైతులు నష్టపోయారు. క్షురకులు రాక మగవాళ్లు జుత్తు గెడ్డాలు పెరిగి సాధువుల్లా తయారయారు. పనిమనుషులు రాక గృహిణులకు పనిభారం పెరిగింది. పిల్లలు, పెద్దలు పనీపాటా చదువులు లేక ఇంటి వద్దే ఉంటూ తింటూ ఒళ్లు పెంచేరు. టీ.వీ లకు మొబైల్ ఫోన్లకు రెస్టు లేకుండా పోయింది.
ఆయుర్వేద వైద్యులకు తీరిక లేకుండా పోయింది. వైద్యులు డైరెక్టుగా పేషెంట్లతో సంపర్కం లేకుండా వీడియోల ద్వారా వైద్యం జరిగేది. చాల ప్రైవేటు హాస్పిటల్సు తాత్కాలికంగా మూత పడ్డాయి. ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా పేషెంట్ల వత్తిడితో డాక్టర్లు నర్సులు పారిశుద్ధ్య కార్మికులకు పని భారం పెరిగింది.
ఎందరో వైద్య పోలీసు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. ఇదే సమయమని సిద్ధాంతులు జ్యోతీషులు ప్రజల్లో పాపభీతి నశించిందని దైవకార్యాలు సక్రమంగా జరగనందునే ఇటువంటి కలికాల భయంకర రోగాలు ఘోరాలు దుర్ఘటనలు జరుగుతున్నాయని తమ ఆధిక్యత కనబరిచే వారు. శుభకార్యాలు ఆగిపోయాయి. బంధువుల రాకపోకలు లేవు. తెలిసిన వారైనా ఎదురు పడితే పలకరించ వల్సి వస్తుందని మొహం చాటు చేసుకుని దూరంగా పోయేవారు. అత్యవసరంగా ఎవరైన బంధువులు వచ్చినా గుమ్మం బయటే కూర్చోబెట్టి ఫలహారం కాని మంచినీళ్లు ఇచ్చి వాళ్లు వెళ్లిన తర్వాత ఆ ప్రదేశాన్ని ఫినాయిల్ లేక డెట్టాల్తో
శుభ్రం చేసేవారు. కరోనా వైరస్ వయసు మళ్లిన వారికి , కిడ్నీ జబ్బులు, ఊపిరి సంబంధ ఆస్తమా, గుండె జబ్బులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికీ పిల్లలకు తొందరగా సోకుతోందని చావులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని ప్రసార మాధ్యమాల్లో చూసి బంధువుల్లో స్నేహితుల్లో అటువంటి వారి గురించి మొబైల్ ఫోన్లలో వాకబులు , కరోనా వైరస్ తో హాస్పిటల్లో చనిపోయిన ఆప్తుల కర్మకాండల్లో పాల్గొన లేక పోయామన్న బాధ ఇలా మొబైల్లో ఏం అశుభ సమాచారం వినవల్సి వస్తుందేమోననే భయంతో రోజులు గడిచేవి. నేను కూడా డెబ్బై సంవత్సరాల వయసు పైబడి నందున వైద్య సౌకర్యం లేని గ్రామంలో ఉన్నందున ఆంధోళనతో మా వాళ్ల నుంచి ఒకటే ఫోన్లు. కరోనా వైరస్ జాగ్రత్తలు తీసుకోమని ఫలానా మందులు వాడమని సూచనలు వచ్చేవి.
మొబైల్ ఫోన్ టీ.వి. రిమోట్ ఇలా ప్రతి వస్తువు రోజంతా శుభ్రతే. దేవుడి గదిలో కూడా సానిటైజర్ స్ప్రే జరుగుతుండేది. టీ.వీ ల్లో యు ట్యూబ్ చానళ్లలో వచ్చే ఆయుర్వేద ఆకుల మూలికల కషాయాల సేవన. అసలే వేసంగి వేడి అటు పైన కషాయాల వేడి. ఎవరేది చెబితే అది వైద్యంగా అమలు చెయ్యడమే. టీ. వీ ల్లో వచ్చే వార్తలతో మరింత కంగారు. ఇంట్లో కాని పరిసరాల్లో ఎవరు తుమ్మినా దగ్గినా ఒకటే ఆందోళన. బంధువులు సన్నిహితులు స్నేహితులతో వీడియోలు సమాచారం అంతా మొబైల్ ఫోన్లోనే.అందరితో అనుసంధానం మొబైల్ ఫోన్ ఒక్కటే. కరోనా చావుల్తో ఒకటే బాధ. ప్రయాణ సాధనాలు లేవు. రాకపోకలు బంద్. ప్రతి చోటా పోలీసు జీపుల్లో పహరా.
ఇంగ్లీష్ మందులకు గిరాకీ పెరిగింది. పేరాసిటామోల్ (డోలో650) జింకోవిట్ సానిజైజర్లు యాంటీబయోటిక్స్ మందులు డెట్టాల్ వంటి కీటక నాశిని రసాయనాలు మెడికల్షాపుల్లో ఇష్టం వచ్చిన ధరలకు అమ్మేవారు. మాస్కులు కూడా బ్లాక్ మార్కెట్టే. కరోనా సృష్టించిన కల్లోలం ఇంతా అంతా కాదు. తమవారి ప్రాణాలను కాపాడుకోవాలనే తాపత్రయంతో ఎన్నో మద్య తరగతి కుటుంబాల వారు ఆస్థులను అమ్ముకుని కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించారు. ఇదే అదునుగా అంబులెన్సులు శ్మసాన వాటికల నిర్వాహకులు బంధువుల నుంచి అందినంత దోచుకున్నారు. ప్రయాణ రవాణా సౌకర్యాలు స్థంభించి పరాయి రాష్ట్రాల్లో చిక్కకు పోయిన ఎందరో వలస కార్మిక కుటుంబాలను సినీ నటుడు సోనీసూద్ వంటి దాతలు కళాకారులు స్వచ్ఛంద సంస్థలు ఆదుకున్నాయి. కరోనా వైరస్ ఫస్టు ఫేజ్ లో కట్టడికి వైద్య రంగంలో సరైన మందులు అందుబాటులో లేక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కోవిడ్ ఆంక్షలతో ప్రయాణ సౌకర్యాలు లేక భక్తులు రాక ప్రసిద్ధ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ధార్మిక సంస్థలకు ఆదాయ వనరులు కరువై వెలవెల పోయాయి. దైవకార్యాలు స్థంభించాయి. ఎందరో చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయారు. కరోనా క్లిష్ట సమయంలో అత్యవసర సేవలైన పోలీసు వైద్య ఆరోగ్య పారిశుద్ధ్య విధ్యుత్మం చినీటి వ్యవస్థలు రాత్రింబవళ్లు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించ వల్సివచ్చింది. విధుల నిర్వహణలో కరోనా వైరస్ సోకి ఎందరో ఉధ్యోగులు ప్రాణాలు వదిలారు. ఒక వారం రోజల కోసం వచ్చిన నా ప్రయాణం కోవిడ్ ఫస్టు ఫేజ్ ఉధృతి కారణంగా అంచలంచల లాక్ డౌన్ పొడిగింపుతో రవాణా ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో లేక ఎనిమిది నెలల తర్వాత హైదరాబాదు చేరి కొద్ది రోజులు హోమ్క్వారంటైన్లో ఉండవల్సి వచ్చింది.
ఇప్పటి నవతరం యువతకు అప్పుడెప్పుడో ప్లేగు మహమ్మారి
ప్రపంచ యుద్ధాల మాదిరి చరిత్రలో ఇప్పటి కోవిడ్ మహమ్మారి
కూడా గుర్తుండి పోతుంది.

* * * * *

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!