మామిడి చెట్టు!

మామిడి చెట్టు!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: ఎం.వి.చంద్రశేఖర్రావు

మామిడి చెట్టు ఇంట్లో వుందంటే చాలు, ఆ శోభే వేరు. ఇంటిలో అడుగు పెట్టంగానే పచ్చని ఆకులతో, తలవూపే కొమ్మలతో నవ్వుతూ పలకరిస్తుంది, చూతవృక్షము. గుత్తులుగుత్తులుగా, దోర దోరగా మామిడి కాయలు, చెట్టుకొమ్మలకు, వూగుతూ, చూసే వాళ్ళకి, నయనానందకరంగా ఉంటాయి.
ఇహ ఉగాది వచ్చిందంటే కవుల కళ్ళన్నీ మామిడిచెట్టు మీదే. మామిడిచెట్టుపై వాలి, లేత మావిచిగురు తింటూ గండుకోయిలలు కుహు కుహు అంటూ తియ్యని రాగాల నాలపిస్తాయంటారు కవులు.
కొంతమంది కవులయితే,
“ఓ కోయిలా, నువ్వు ఎన్ని
తియ్యని పాటలు పాడినా,
నిన్నుపట్టించుకొనే తీరికా,
ఓపికా, మాకులేవు,
కరోనా వంటివ్యాధుల నుంచి అన్నీ మాకు సమస్యలే,” అని పెదవి విరుస్తారు. ఇంక భావకవులు అయితే, “ఓ కోయిలా, నువ్వు తియ్యని రాగాలనాలపించకు, మదిలో మధురవూహలు వస్తున్నాయి అంటారు.
విప్లవ కవులయితే,
“ఓ కోయిలా,
నువ్వు ఎన్ని పాటలు పాడినా,
పేదవాడి ఆకలి తీరేనా,కర్షక,
కార్మిక సమస్యలు తీరేనా? అనిప్రశ్నిస్తారు.
ఇలా కవి సమ్మేళనాలతో, పంచాంగ శ్రవణంతో, మామిడిపూతతో ఉగాది పండగ వస్తుంది. వస్తూ, వస్తూ, తనతో ఉగాది పచ్చడిని తెస్తుంది. జీవితంలో తీపి, చేదు, వగరు, పులుపు సహజమని మనకు ప్రభోధిస్తుంది. వేపపువ్వు, అరటిపండు, మామిడి ఇలా రకరకాల రుచులతో, జీవనవైవిధ్యాన్ని మనకు తెలియజేస్తుంది.
ఏది ఏమైనా ఇంట్లో మామిడి చెట్టుంటే ఆ ఇల్లు పచ్చపచ్చగా, రకరకాల పక్షులతో, ఆకులతో, పువ్వులతో, కాయలతో సందడి, సందడిగా అలరారుతుంటుంది. ప్రతి పండగకీ, శుభకార్యాలకీ ఇంటి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టడం మన తెలుగువాళ్ళ సంప్రదాయం.
ఆవకాయ, మాగాయ, మామిడిపండ్ల గురించి వేరే చెప్పనఖ్ఖరలేదు. ఎండా కాలం వచ్చిందంటే ఊరగాయల సందడి మొదలవుతుంది. తియ్యని మామిడిపళ్ళు, చిన్నరసాలు, పెద్దరసాలు, బంగినపల్లీ, లాంటి రకరకాల మామిడిపళ్ళను తిని,50డిగ్రీల ఎండలను సైతం ఎదుర్కుంటాం. ఇన్ని మాటలెందుకు, మామిడి చెట్టు ఇంట్లోవుంటే, కల్పవృక్షం ఇంట్లో వున్నట్లే. ఇదంతా తెలుగువాళ్ళ సొంతం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!