అవాంతరాలు

అవాంతరాలు

రచన: సావిత్రి కోవూరు 

లక్ష్మణరావు తన విశాల మైన వాకిట్లో టెన్స్ట్ వేసి కూతురి ఎంగేజ్ మెంట్ పార్టీని చాలా ఘనంగా చేస్తున్నాడు. అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ చేసింది. అబ్బాయి ఎం.టెక్ చేసి, బెంగళూర్ లో జాబ్ చేస్తున్నాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా కుదిరిన సంబంధం.

జాతకాలు బాగా కుదిరాయని అందరు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎంగేజ్మెంట్ అయినా చాలా ఆడంబరంగా జరిపించాడు లక్ష్మణ్ రావు. ఫంక్షన్ అంత అయ్యి వెళ్ళిపోయే ముందర లక్ష్మణ్ రావు అబ్బాయి హర్షవర్ధన్ తో, వాళ్ళ అమ్మ నాన్నలతో  “వచ్చే నెలలో 15వ తారీఖున మా అమ్మాయి పుట్టినరోజు ఉంది మీకు వీలైతే, అందరూ రండి” అన్నాడు.

“తప్పకుండా వస్తాము” అని చెప్పారు వాళ్ళు.

మార్చి నెలలో 12వ తారీకు హర్షవర్ధన్ హైదరాబాద్ వచ్చి మాధుర్యకి ఫోన్ చేసి, “నేను మూడు గంటలకు కోఠికి వస్తున్నాను. నీవు కూడా అక్కడికి  రాగలవా” అని అడిగాడు.

“మా నాన్నని అడుగుతాను” అని తండ్రి పర్మిషన్ తీసుకొని, మూడు గంటలకి కోఠికి వెళ్ళింది.గంట సేపు అక్కడంతా షాపింగ్ చేస్తూ గడిపింది. అప్పటికీ హర్షవర్ధన్ రాకపోయేసరికి ఫోన్ చేసింది.

ఫోన్ హర్షవర్ధన్ కాకుండా వాళ్ళ అమ్మ ఎత్తి “మాధుర్య హర్ష కు కొంచెం దెబ్బలు తగిలాయి. వాడు రాలేడు. నువ్వు ఇంటికి వెళ్ళు” అని చెప్పింది.

“ఆంటీ అసలేమైంది, ఎలా తగిలాయి.” అని అడుగుతుంటే

“నేను అమ్మ వాళ్లకు అంత చెప్పాను. నీవు కంగారు పడాల్సిందేమీ లేదు ఆటోలో ఇంటికెళ్లి వీలైతే నాన్నతో కలిసి హాస్పిటల్ కి రా” అని ఫోన్ పెట్టేసింది.

మాధుర్యకి అంతా గందరగోళంగా అనిపించింది. చాలా భయమేసింది. హర్షకు దెబ్బలు తగిలాయి అంటున్నారు. ఎక్కడ, ఎప్పుడు తగిలాయి అని ఆలోచిస్తూ ఆటోలో ఇంటికి వచ్చేసింది.
అప్పటికి తల్లి సుధా, లక్ష్మణరావు తన కొరకే ఎదురు చూస్తున్నారు.

“ఏమైందట నాన్న” అన్నది మాధుర్య.

“మోటార్ సైకిల్ పైన వస్తుంటే కింద పడ్డాడటమ్మా. కంగారు పడాల్సిందేమీ లేదట. పోదాం పద.” అని తల్లిదండ్రులు, తమ్ముడు తరుణ్, తాను అపోలో కి వెళ్లారు. అక్కడ హర్ష కు ఆపరేషన్ జరుగుతోందని హర్ష తల్లిదండ్రులు బయటనే ఉన్నారు.

“బావగారు అసలు ఎలా జరిగిందట” అన్నాడు లక్ష్మణ్ రావు.

“మాకు కూడా సరిగ్గా తెలియదు బావ గారు, మాతో మాధుర్యకు గిఫ్ట్ కొనడానికి వెళుతున్నాను. తనను కోఠికి రమ్మన్నాను. తనను వాళ్ళింట్లో దింపేసి వస్తాను. లేట్ అవుతుంది. నా కొరకు ఎదురు చూడకండి” అని చెప్పి వెళ్ళాడు.

వెళ్ళిన పావు గంటకే ఫోన్ చేస్తే ఇప్పుడే వెళ్ళాడు ఇంత తొందరగా ఫోన్ ఎందుకు చేస్తున్నాడా అనుకుని చూస్తే, హర్ష ఫోన్ తో ఎవరో “ఇక్కడ బోయిన్ పల్లి లో యాక్సిడెంట్ అయింది. అతని జేబులో ఫోన్ తీసుకుని చేస్తున్నాను. మీరు తొందరగా రండి, అతను మాట్లాడే స్థితిలో లేడు.” అని ఫోన్ పెట్టేసాడు.

వెంటనే వెళ్ళాము. ఎలా జరిగిందని అక్కడి వాళ్ళని అడిగితే, ‘రాంగ్ రూట్ లో వస్తున్న ఓ ట్రాక్టర్ సైకిల్ మోటార్ కు డాష్ ఇవ్వడమే కాకుండా, పది గజాల దూరం రోడ్డుపై ఈడ్చుకుంటు వెళ్లింది. లక్కీగా బాడీ మొత్తం ట్రాక్టర్ మధ్యలోకి వెళ్లినందుకు పెద్ద ప్రమాదం తప్పింది.’ అని చెప్పారు.

కానీ కాలు మాత్రం ఫ్యాక్చర్ అయినట్టుంది. చాలా రక్తం పోవడం వల్ల స్పృహ కోల్పోయాడు. కాళ్లకు ఆపరేషన్ జరుగుతుంది” అని చెప్పారు.

నెలరోజుల్లో పెళ్లి పెట్టుకుని ఈ ప్రమాదం ఏంటి? అసలు గాయాలు ఏ స్థాయిలో జరిగాయి. ఆ అబ్బాయి తల్లిదండ్రులు మా అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే ప్రమాదం జరిగిందని ఏమన్నా ఆలోచిస్తారా? వాళ్ళ  ప్రవర్తన ఎలా ఉంటుంది. అని చాలా భయపడ్డారు లక్ష్మణ్ రావు దంపతులు.

ఆపరేషన్ మూడు గంటలు జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక్కొక్కరు వెళ్లి చూడండని అన్నారు డాక్టర్. ఒక్కరొక్కరు వెళ్లి చూసి బయటకు వచ్చారు. హర్ష వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లో ఏమైనా తేడా ఉంటుందేమోనని అనుకున్నది మాధుర్య కూడా. కానీ వాళ్ళు యాక్సిడెంట్ అయినందుకు బాధ పడుతున్నారు కాని, వాళ్ళ మాటల లో ఎక్కడ తేడా కనిపించలేదు ఎవరికి. అందరూ ఇంటి ముఖం పట్టారు నెక్స్ట్ డే లక్ష్మణరావు మాధుర్యని  పిలిచి,

“భయపడుతున్నావా అమ్మా. ఏం కాదు  బాధపడకూడదు.” అన్నాడు

“నాన్న పెళ్లయిన తర్వాత జరిగి ఉంటే మనం ఏం చేసే వాళ్ళం కాదు కదా. హాస్పిటల్ కి వెళ్దాము తొందరగా రెడీ అవ్వండి. నేను సాయంత్రం వరకు అక్కడే ఉంటాను.” అన్నాది మాధుర్య.

మాధుర్య ధైర్యానికి సంతోష పడ్డాడు లక్ష్మణరావు. హాస్పిటల్ కి వెళ్లడానికి రెడీ అవసాగారు. నలుగురు కలిసి హాస్పిటల్కి వెళ్లారు. అప్పటికే తల్లిదండ్రులు రమణ లలితమ్మ గారు వచ్చి ఉన్నారు.
మధ్యలో లక్ష్మణరావు “బావగారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా జరిగిందని మీరు ఏమైన అనుకుంటున్నారా? మీ నిర్ణయం లో ఏమైనా మార్పు ఉంటే చెప్పండి. తర్వాత మా అమ్మాయి కానీ, మనమెవ్వరం కూడా బాధ పడకూడదు” అన్నాడు.

“మాకు ఎలాంటి నమ్మకాలు లేవు.కాని మాకు ఎవరో ఫోన్ చేసి ‘ఆపరేషన్ తర్వాత  మీ అబ్బాయి కాలు ఎలా ఉంటుందో తెలియదు. అమ్మాయి వాళ్ళు ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోవాలను కుంటున్నా’రని  చెప్పారు. నిన్నంత కలసే ఉన్నాము మేము. వాళ్ళేమి మాతో అనలేదు. మరి మీతో ఎప్పుడన్నారో తెలియదు. పెళ్ళి విషయాలన్ని. మేము మేము మాట్లాడుకుంటాము. మళ్ళెప్పుడు మాకు ఇలాంటి కాల్స్ చేయకండి. అని గట్టిగా చెప్పాను.” అన్నాడు రమణ.

“పెళ్లయిన తర్వాత అయి ఉంటే ఏం చేసేవాళ్లం ఒకవేళ మీకు మీ అమ్మాయికి అభ్యంతరాలు ఉన్నాయా అలా ఉంటే ఆలోచిద్దాం. మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాధుర్యనే మా కోడలు అని నిర్ణయించుకున్నాము.”అన్నది అబ్బాయి తల్లి.

“అయ్యో మాకు కూడ రాత్రి అలాంటి ఫోనే వచ్చింది. ‘మీ అమ్మాయితో ఎంగేజ్మెంటు అయిన వెంటనే ఇలా అయ్యిందని, అబ్బాయి వాళ్ళు మీ సంబంధం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు.’ అన్నాడెవరో.

“మీరెవరో చెప్పండి మొదలు. నిన్నంత మేము కలసే ఉన్నాము మాతో చెప్పకుండ, మీకెందుకు చెప్పారో అడుగుతాను.’ అనగానే ఫోన్ పెట్టేసిండు. నాకు కూడా అలాంటి పిచ్చి నమ్మకాలు ఏమీ లేవు.” అని అన్నాడు లక్ష్మణ్ రావు.

“ఎవరో పనిలేని వాళ్ళు కావాలని పెళ్ళి చెడగొట్టడానికి ఇలాంటి కాల్స్ చేస్తుంటారు. మీరేమి నమ్మకండి. మేము కూడ నమ్మము” అన్నాడు రమణ.

“హర్ష ఎలా ఉన్నాడు బావగారు” అన్నాడు లక్ష్మణ్ రావు.

“ఇప్పుడే వెళ్లి చూసి వచ్చాము బాగానే ఉన్నాడు. కాలికి బ్యాండేజ్ మాత్రం ఉంది. రోడ్డుపై ట్రాక్టర్ ఈడ్చుకు పోవవడం వల్ల మీకు చేతులకు, కాళ్ళకు రోడ్డు గీసుకుపోయింది తప్ప, భయపడాల్సిందేమీ లేద”ని డాక్టర్ అన్నారని చెప్పాడు రమణ. విజిటింగ్ అవర్స్ లో ఒక్కొక్కరు లోపలికి వెళ్లి చూసి మాట్లాడి వచ్చారు.

మాధుర్య హర్ష వాళ్ళ అమ్మానాన్నలతో “అంటీ మీరు ఇంటికి వెళ్ళండి. నేను డాడీ ఇక్కడ ఉంటాము” అన్నది.

“రాత్రి పూట నీవెందుకమ్మ మీరంతా వెళ్ళండి. నేను మీ డాడీ ఇక్కడ ఉంటాము. రేపు ఉదయం నీవు రా”. అని పంపించేశాడు రమణ.

పది రోజులకు హర్షను డిస్చార్జ్ చేసారు. ఆ పది రోజులు కూడా మాధుర్య ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు  ఇంటికి వెళ్ళకుండా అక్కడే కూర్చుని లలితమ్మకు తోడుగా ఉన్నది. కాలు బ్యాండేజ్ మాత్రం ఇంకో నెల రోజులకి మారుస్తారని చెప్పి ఇంటికి పంపించారు. అందరు కలిసి బోయిన్పల్లి హర్ష వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు ఉండి, మాధుర్య వాళ్ళు ఇంటికి వెళ్లిపోయారు.

ఆరోజు సుధా లక్ష్మణ్ రావు తో “ఏమండీ మన వియ్యంకుడు మూఢనమ్మకాలతో  ఎంగేజ్మెంట్ కాగానే హర్షవర్ధన్ కు ఆక్సిడెంట్ అయిందని పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటారేమో అనుకున్నాను. అంతేకాకుండా పిల్లవాడి కాలికి ఏమన్నా తేడా వస్తుందేమో అని భయపడ్డాను భగవంతుడి దయవల్ల అలాంటివి ఏమీ లేవు. కానీ పెళ్లి వరకు ఇలాగే ఉంటే బాగుండదు కదా. ముహూర్తం ఏమన్నా ముందుకు జరిపి చేద్దామా”అన్నది

“అవన్నీ  వాళ్లతో మాట్లాడిన తర్వాత నిర్ణయిద్దాము తొందరపడకు” అన్నాడు.

అదే మాట వారం రోజుల తర్వాత రమణ దంపతులతో అంటే వాళ్ళు “వాళ్ళిద్దరి పేరుతో ఈ ముహూర్తమే బావుందని పెట్టాము. ఇప్పుడు ఇంకో ఇరవై రోజులు ఉంది కదా. బ్యాండేజ్ మూడు నెల్ల వరకు తీయరు. అన్ని రోజులు పెళ్ళిని ఆపలేము. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఇప్పుడు డేట్ మారిస్తే హాలు దొరకడం చాల కష్టమౌతుంది. అని వాళ్ళైతే  అవసరం లేదు అంటున్నారు.” అన్నాడు లక్ష్మణరావు.

లక్ష్మణ్ రావు కుటుంబానికి కూడా అదే మంచిదనిపించింది. యధావిధిగా పెళ్లి పనులు మొదలు పెట్టారు.

లక్షణరావు బంధువులు కొందరు “అబ్బాయి  కాలు పరిస్థితి ఎలా ఉందో తెలియదు. బంగారం లాంటి అమ్మాయిని అంత తొందర పడి ఎలా ఇస్తారు. కుర్చీలో కూర్చుని పెళ్ళేంటి.” అని రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. అయినా ఇరు వైపుల వాళ్ళు వినకుండ పెళ్ళి పనులు ముమ్మరం చేశారు.

అనుకున్న ప్రకారం పెళ్లి రోజు రానే వచ్చింది. కొట్నం, స్నాతకం, ఎదుర్కోళ్ళు అన్ని కార్యక్రమాలు కుర్చీలో కూర్చొనే సక్రమంగా చేశాడు అబ్బాయి.

అబ్బాయి తల్లిదండ్రులు బంధువులు అందరూ పెళ్లి తంతును మనస్పూర్తిగా ఆనందంగా జరిపించారు. ఆక్సిడెంట్ వల్ల ఎవరి ప్రవర్తనలోను అంటే అర్థం లేని నమ్మకాలతో అబ్బాయి తల్లిదండ్రులు వెనకకు తగ్గడముగాని, అమ్మాయి తల్లిదండ్రుల ప్రవర్తనలో గాని మార్పు లేకుండా సాఫీగా జరిగింది.

కాని కొంతమంది పని లేని బంధువులు మాత్రం అంత తొందర ఏమొచ్చింది పూర్తిగా బాగా అయిన తర్వాత చేయొచ్చు కదా. కుర్చీలో కూర్చుని తాళి కట్టడం ఏమిటి? అని అర్థంలేని కామెంట్స్ చేసిన వాళ్ల మాటలు ఎవరు లెక్కచేయకుండా పెళ్ళి సాఫీగా జరిగింది. ఈ మూడు నెలలకు మామూలు స్థితికి వచ్చి హాయిగా ఆఫీస్ కు వెళ్లి వస్తున్నాడు.
వాళ్ళ సంసారం మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!