బాహుబల్లి (ద హేపీనెస్)

బాహుబల్లి (ద హేపీనెస్)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కందర్ప మూర్తి

రాత్రయింది. మన్యం గిరిజన ప్రాంతంలో చీకట్లు అలుముకున్నాయి. నక్కల అరుపులు, గుడ్లగూబల కూనిరాగాలు, గాలిలో గబ్బిలాల పరుగులు, కీటకాల విహారాలు మొదలయాయి. పాడేరు మండల కేంద్రంలో అదొక అతిధి గృహం. వరండాలో ట్యూబ్ లైట్ వెలిగి తెల్లని కాంతి వెదజల్లుతోంది. ట్యూబ్ లైట్ ఫ్రేమ్ వెనక కాపుర ముంటున్న బాహుబల్లి కుటుంబం నిద్ర లేచి సందడి మొదలైంది.
అమ్మా , ఆకలిగా ఉందే. పిల్ల బల్లి మారాం మొదలెట్టింది. ఏమయ్యా! ఇంకా తొంగున్నావేంటి ? పిల్లది ఆకలితో అలమటిస్తోంది. అల్పాహారం ఏర్పాటు చెయ్యి కేకలేస్తోంది. శ్రీమతి బాహుబల్లి.
అబ్బా, ఏమిటే ఉదయాన్నే నీ సొద. నిన్న  తిండివేటలో జారి పడి బాహువులన్నీ నొప్పి పెడుతున్నాయి. కాస్త విశ్రాంతి తీసుకోనివ్వు. అదీగాక ఇంకా దోమలు, దీపం పురుగులు వచ్చే సమయం కాలేదు. పిల్లదాన్ని కొంచెం
సేపు ఓదార్పు శ్రీమతికి నచ్చచెప్పేడు మిస్టర్ బాహుబల్లి. కొద్ది సేపటి తర్వాత తుర్రున ఎగురుతు చిన్న దోమపిల్ల ట్యూబ్ లైట్ తెల్లని వెలుగు చూసి ముచ్చట పడి గెంతులేస్తోంది. వెనక అమ్మా, నాన్న  దోమలు అటూ ఇటూ చూసుకుంటూ వస్తున్నాయి.
చిన్నా , గదికి అటువైపు వెళ్లకు. అదంతా డెంగీ దోమల ప్రాంతం. మనం మలేరియా జాతి దోమలం. అటు వెళ్లకూడదు పిల్లని హెచ్చరిస్తున్నాయి.
ఇంతలో జూనియర్ బాహుబల్లి ఫ్రేమ్ వెనక నుంచి పైకి వచ్చి హేయ్, ఎవరు నువ్వు ? ఇంతకుముందు నిన్ను ఇక్కడ చూడలేదే !” ఆశ్చర్యంగా అడిగింది.
ఓ , అదా! మేము ఇంతకు ముందు గుడిసెల ప్రాంతంలో ఉండే వాళ్లం. అక్కడ అన్నీ చిన్న దీపాలే ఉన్నాయి. కాంతి ఉండవు. మసక వెలుగులోనే
ఆడుకునే దాన్ని. ఇక్కడ ఎంత బాగుందో ” అని తన ఆనందాన్ని కనబర్చింది. చిట్టి దోమ. చిట్టి దోమతో కబుర్లు చెబుతు తన ఆకలిని మర్చిపోయింది జూనియర్ బాహుబల్లి. సీనియర్ బాహుబల్లి  తన బాహువులకు జండూబామ్ మర్దన చేసుకుంటున్నాడు..కొత్త  ప్రాంతమైనందున అమ్మా నాన్న దోమలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఎక్కడ మురుగునీటి కుంటలు, విశ్రాంతి ప్రదేశాలు ఉన్నాయో చూస్తున్నాయి. ఇంతసేపూ ఆకలని అల్లరి చేసిన చంటిది ఎవరితో కబుర్లు చెబుతోందోనని, శ్రీమతి బాహుబల్లి పైకి వచ్చి చూస్తే చిట్టి దోమతో కబుర్లు చెబుతు కనబడింది.
ఏమోయ్, ఇలా రా! కేకేసింది శ్రీమతి. ఏమైందే, అలా కేకలేస్తున్నావ్! చికాకుగా పైకి వచ్చాడు మిస్టర్ బాహుబల్లి. అటుచూడు, చంటిది ఎంచక్కా ఆ చిట్టి దోమతో నవ్వుతూ ముచ్చట లాడుతోందో, ఇన్నాళ్లూ దానితో ఆడుకోడానికి ఎవరూ లేక చిర్రు బుర్రు   లాడేది. ఇప్పుడు దాని ముఖంలో ఆనందం కనబడుతోంది. పిల్లదాన్ని చూసి తన సంతోషాన్ని తెలియచేసింది శ్రీమతి బాహుబల్లి. ఔనే, నిజం. దాని మొహంలో నవ్వు కళ  ఉట్టిపడుతోంది. ఇన్నాళ్లు ఒంటరి తనంతో చికాకుగా ఉండేది. ఇప్పుడు చలాకీగా కనబడుతోంది. ఆ చిట్టి దోమ అమ్మానాన్నల్ని అతిథులుగా ఆహ్వానిద్దాం అన్నాడు ఆనందంగా మిస్టర్ బాహుబల్లి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!