ప్రేమకు రంగేది

(అంశం:: ” ప్రేమ”)

ప్రేమకు రంగేది
💕💕💕💕💕💕💕

రచయిత:: ఆలేఖ్య రవికాంతి

సమయం ఉదయం ఏడు కావస్తుందిహ ఇంకా ఈ పిల్ల లేవదేంటి…!?. అసలు ఈ రోజు తనకు పెళ్లి చూపులన్న విషయం గుర్తుందో లేదో ఈ పిల్లకి అంటూ… రాధ..,ఇక లే…, అంటూ గదిలోకి వచ్చింది సుమతి.
రాధ హాయిగా ముసుగుదన్ని కుంభకర్ణుడి చెల్లిలా గురకలు పెడుతూ పడుకుంది.

ఏంటే తల్లి ఈ మొద్దు నిద్ర. ఇంక లేవే.. , అసలే అబ్బాయి వాళ్లు పదింటికల్లా అందరూ వస్తానన్నారు. నాకసలు చేతులు… కాళ్లు ఆడట్లేదనుకో అని దుప్పటిని లాగింది సుమతి.

తన నిద్రకు భంగం వాటిల్లడంతో కోపంతో మూడో కన్ను తెరిచిన శివుడిలా రాధ తల్లి పై కోపంతో తాండవం చేయసాగింది.

“ఎంటి అమ్మ నీ గోల” …!! వాళ్ళొచ్చేది పదింటికైతే ఇప్పటీ నుంచే ఎందుకంత తొందర అని విసుక్కుంటూ లేచింది.

అదేంటే అలా అంటావు…? నువ్వు బయటికి వెళ్ళడానికే అద్దం ముందు నిలబడి గంటలు గంటలు తెగ సింగారమవుతావు. అలాంటిది పెళ్ళి చూపులకైతే ఓ రోజు కూడా నీకు సరిపోదు. అందుకే లేవ్వమంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది సుమతి.

అమ్మో, అవును నేను త్వరగా లేచి అందంగా రెడీ అవ్వాలి. నేను అందరికీ నచ్చాలి. అబ్బాయికి వేరే చాయిస్ ఉండకూడదు కదా…! చేస్తే ఈ ప్రిన్సెసే అందరిని రిజెక్ట్ చేయాలి అని గబగబ లేచి నలుగుపిండితో స్నానం చేసింది.

ఇంతలో సుమతి వచ్చి, చూడు తల్లి ఈ రోజు మాత్రం దయచేసి చీర కట్టుకుని కుందనపు బొమ్మలా తయారవ్వు. జీన్స్ వేస్తానని మాత్రం మంకు పట్టు పట్టకు సరేనా అని అందమైన గులాబి రంగు చీర రాధకి చూపించి, ఇది నీకు బాగా నప్పుతుంది అని చీర కట్టింది.

“గులాబీ రంగు చీరలో రాధ అప్సరసలా ఉంది..! నా తల్లే ఎంత అందంగా ఉన్నావే.! .నా దిష్టే తగిలేలా ఉంది అంటు మురిసిపోయి చెవి వెనుక దిష్టిచుక్క పెట్టింది” ..

సరే, ఇంకా త్వరగా రెడీ అవ్వు అంటు పూలదండ టేబుల్ పై పెట్టి పువ్వులు మాత్రం పెట్టుకోవడం మరిచిపోకే అంటూ వెళ్ళిపోయింది సుమతి.

హుమ్.., ఈ అబ్బాయి ఫోటోలో బాగానే ఉన్నాడు మరి నేరుగా ఎలాగుంటాడో..? “దేవుడా హీరోలా లేకపోయిన కనీసం హీరో ఫ్రెండ్ లానైన ఉండేలా చూడు” అంటు అలంకరించుకోవడం మొదలెట్టింది.

అందంగా అలంకరించుకుని జడలో మల్లెలు తురుముకుని పదహరణాల తెలుగింటి ఆడపడుచులా తయారయ్యి అద్దంలో చూసుకుంది..

“అబ్బా..,! నిజంగానే ఈ చీరలో నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను”. ఇంకా అబ్బాయి అయితే ఫిదా కావలసిందే. ఎలాగు రెడీ అయ్యాగా ఫోటోలు తీసుకుని ఎఫ్.బీలో అప్లోడ్ చేద్దాం అని వివిధ ఫోజుల్లో ఫోటోలు తీసుకుని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసింది.

‘రాధమ్మ.., ‘ అబ్బాయి వాళ్లు ఇంకో పది నిమిషాల్లో ఇక్కడుంటారట. నువ్వు ఈ టిఫిన్ గబగబ తిని ఇక్కడే కూర్చో. నేను వచ్చి నిన్ను కిందికి తీసుకెళతానే. ఆవేశపడి మాత్రం నువ్వు కిందికి రాకు తల్లి. ఈ పిల్లకి పద్దతులు తెలియవు అని అనుకుంటారు అని పెళ్లి చూపుల్లో ఎలా ఉండలో వివరాలు చెప్పి కిందికి వెళ్లిపోయింది సుమతి.

అబ్బాయి వాళ్లు రావడంతో కింద హడావుడి మొదలైంది. ఇరు కుటుంబాలు ఆత్మీయంగా పలుకరించుకుని వారివారి కుటుంబాల గురించి మాట్లాడుకుంటున్నారు.

కృష్ణ కళ్ళు మాత్రం చుట్టూత వెతుకుతున్నాయి రాధ కోసం..!

రాధ కూడా అబ్బాయిని ఏ సంధులో నుంచి చూద్దామా అని శతవిధాల ప్రయత్నిస్తుంది. పెద్దల ముచ్చట్లు అవుతూనే ఉన్నాయి..

” అబ్బా! వీరి ముచ్చట్లు ఆగేలా లేవు. రాధని ఎప్పుడు చూపిస్తారో ఏమో…? త్వరగా చూపిస్తే బాగుండు” అని ఆత్రంగా గదంతా కళ్ళతోనే వెతకసాగాడు కృష్ణ .

అబ్బాయి ఆత్రాన్ని గమనించిన రాధ బామ్మ…, మన ముచ్చట్లు అవుతూనే ఉంటాయి. ఇక అబ్బాయికి అమ్మాయిని చూడాలనే ఆత్రం అతని మొఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు..? సుమతి వెళ్లి రాధమ్మను తీసుకురా అంది..

బామ్మ అందరి ముందు తన గురించి ఎకసెక్కమాడిన రాధను తీసుకురమ్మంది.అది చాలు అని కళ్ళు పెద్దవి చేసుకుని సుమతి వెళ్లిన గుమ్మం వైపు ఆత్రుతుగా ఎదురు చూడసాగాడు కృష్ణ ..

రాధమ్మ, పద నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అంది సుమతి…

“అమ్మ, అబ్బాయి అందంగా , మంచి ఎత్తుతో, రంగుతో ఉన్నాడా..? చెప్పు ప్లీజ్” అంది రాధ..

తినబోయే ముందు రుచెందుకు, చూడబోయే ముందు ఆత్రమెందుకు.మాకైతే నచ్చాడు. మరి నీ సంగతేంటో అబ్బాయిని చూసాకే నువ్వే చెప్పాలి. పద.. వెళదాం, అని రాధను తీసుకు వచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది.

రాధని ఫోటోలో చూసిన నిమిషమే తన ప్రేమలో పడిపోయాడు క్రిష్ణణ ఇప్పుడు నేరుగా చూసేసరికి తన చిట్టి గుండె రాధ.. రాధ అని కొట్టుకోసాగింది.

అబ్బాయిని చూడమ్మ అని సుమతి అనేసరికి రాధ మెల్లగా తలెత్తి అబ్బాయిని చూసింది.. ఒక్కసారి తన మదిలోని కలల సౌధం కుప్పకూలిపోయింది. కారణం, ఆ అబ్బాయి నలుపు. ముఖ కవలికలు కూడా నచ్చలేదు తనకి. వెంటనే తల కిందికేసింది.

అబ్బాయి వాళ్ళు కాసేపు మాట్లాడుకుని మాకు అమ్మాయి నచ్చిందండి. మీకు కూడా సమ్మతమైతే పెళ్లి ఏర్పాట్లు చేద్దాం అన్నారు అబ్బాయి నాన్నగారు.

అలాగేనండి అమ్మాయిని కనుక్కొని కబురు చేస్తాం అన్నారు రాధ నాన్నగారు. సరేనండి అని అబ్బాయి వారు బయలుదేరారు.

క్రిష్ణకి మాత్రం అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. రాధనే చూస్తూ ఉండిపోవలనిపించింది. కానీ తప్పదు ఏం చేస్తాం అని రాధ రూపం కళ్ళల్లో నింపుకుని వెళ్ళొస్తానండి.. బై రాధ.., అని చెప్పి వెళ్ళాడు మనసంతా తన రూపం నింపుకుని.

అబ్బాయి వాళ్లు వెళ్ళాక రాధ తండ్రి పరమేశం కూతురిని హత్తుకుని తల్లి నువ్వు వాళ్ళకు బాగా నచ్చావు. నాకు కూడా వారి మాటతీరు, పద్దతి నచ్చింది. ఏరికోరి నిన్ను చేసుకుంటామంటున్నారు వారికి కృష్ణ ఒక్కగానొక్క కొడుక్కి. ఇంకా అబ్బాయిది సున్నితమైన మనసంట పైగా మంచి ఉద్యోగమని మధ్యవర్తి అయిన మా స్నేహితుడు చెప్పాడు. ఇంతకు నీ అభిప్రాయం ఏంటి తల్లి ..? చెప్పు అన్నాడు.

రాధ నిక్కచ్చిగా చెప్పింది.., “నాన్న, నాకు ఆ అబ్బాయి నచ్చలేదు” . చామనచాయ కూడా కాదు నలుపు. మా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు అతన్ని చేసుకుంటే. నాకు ఈ సంబంధం నచ్చలేదు అని తెగిసి చెప్పింది…

అదేంటే అలా అంటావూ..!! బంగారంలాంటి సంబంధం. అబ్బాయి కాస్త నలుపైతేనేం…? మంచి కుటుంబం. అందులోను ఒక్కగానొక్క కొడుకు. ఆ ఇంటికి నువ్వు కోడలివైతే ఆడిందే ఆట పాడిందే పాట అంది సుమతి.

అమ్మ, ఒక్క కొడుకైతే నాకేంటి…? అతను చూడడానికి హీరోలా కాదు కనీసం కమిడియన్ లా కూడా లేడు. వేరే సంభంధం చూద్దాం అంది గడుసుగా.

ఏమే.., ఇప్పటికే ఐదు సంబంధాలు చూసావు. అందులో నిన్ను ఈ అబ్బాయి మెచ్చే సరికి ఇంత విర్రవీగుతున్నావు. అసలు నువ్వు చదివిన డిగ్రీకి ఇంజనీరు రావడమే ఎక్కువ. అందులోను లకారాల జీతవంతుడు, పైగా గుణవంతుడు.

ఇక చాలు నిన్ను మెచ్చినోడు పైగా నీ కోరికలు తీర్చగల స్థితిమంతుడు దొరికాడు. కాస్త రంగు తక్కువైతేనేం..?, పెళ్లి చేసుకోవే..! నీ మాటకి కట్టుబడి ఉంటాడు అంది రాధ నాయనమ్మ రత్నం…

ఇంతలో అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి…. ‘ఏవండి,మీ అమ్మాయి అభిప్రాయం కనుకున్నారా’ అని అడిగాడు.

ఇప్పుడే కదండి పెళ్లి చూపులయ్యాయి. కాస్త తీరిగ్గా అమ్మాయిని అడిగి మా నిర్ణయం మీకో రెండు రోజుల్లో చెబుతాం. కాస్త ఏమనుకోవద్దే.ఇది జీవితానికి సంబంధించిన విషయం కదా అందుకే అన్నాడు పరమేశం.

అవునండి, నిజమే..! సరే రెండు రోజుల తరువాత మీ నిర్ణయం ఏదైన పర్వాలేదు చెప్పండే అని ఫోన్ పెట్టేసాడు..

అమ్మ రాధ.. , ఇటురా, నీకో విషయం చెప్పాలా..?
ప్రతి అమ్మాయి రాకుమారుడు వంటి వరుడు కావాలని కోరుకుంటుంది. కానీ అందం కంటే గుణం గొప్పది. ఆ మంచి గుణమనే లేకపోతే ఆడపిల్ల బతుకు అస్తవ్యస్తంగా మారుతుంది తల్లి అన్నాడు పరమేశం.

నాన్న..! సరే ఎలాగు రెండు రోజులు గడువడిగావుగా. ఈ లోపు ఆలోచించి చెబుతా సరేనా… ఇక నన్ను ఈ రెండు రోజులు విసిగించకండి అని తన గదిలోకి వెళ్లిపోయింది..

రెండు రోజుల తరువాత అబ్బాయి వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది పరమేశానికి. కూతురి అంగీకారం ఇంకా తెలుపకపోవడం వలన వాళ్ళ ఫోన్ ఎత్తలేదు..

రాధ… రాధ, ఓ సారి ఇటు రా..! అని తండ్రి పిలుపు వినేసరికి రాధ కిందికి వచ్చింది… ఏంటి నాన్న పిలిచారు అని అంది.

చూడు తల్లి, అబ్బాయి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వారికి ఏం చెప్పమంటావు. వారిని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు.

అదే నాన్న, ఆలోచిస్తున్న ఏం చేయాలోనని. అబ్బాయి రంగు గురించే నా బెంగంతా అంది.

చూడమ్మ,” నలుపు నారాయణుడు మెచ్చు” అన్నారు. నా మాట విను. ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు. ఏ తండ్రి తన కూతురి జీవితం పాడవ్వాలని అనుకోడు. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు నిట్టూరుస్తూ.

‘సరే నాన్న, నీ ఇష్టమే నా ఇష్టం’, అని చెప్పి వెళ్లిపోయింది.

పరమేశం సంబరంగా ఇంట్లో వాళ్ళందరిని పిలిచి శుభవార్త చెప్పి ఆ తర్వాత అబ్బాయి వాళ్ళకి కూడా సంబంధం కాయం చేసుకుందాం అని కబురందించాడు..

రాధ పెళ్ళికి సరే అంది అనే మాట వినేసరికి కృష్ణ ఊహల లోకంలో విహరించసాగాడు..

ఓ వారంలో నిశ్చితార్థం కూడా జరిగింది. రాధని ఫోన్ నెంబర్ ఇమ్మంటే… ‘నాకు పెళ్ళికి ముందు ఇలా మాట్లాడుకోవడం నచ్చదు’ అనేసింది.
పద్దతిలో పెరిగిన పిల్ల కదా అని తన మనసుని సరిపెట్టుకున్నాడు.

మరో పది రోజుల్లో పెళ్లి ఘనంగా జరిగింది. కృష్ణ మనసులో తను కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిగిందని ఆనందం హరివిల్లులా విరిసిన, రాధ మొఖంలో ఆ సంతోషం కనిపించకపోయేసరికి ఎదలో తెలియని అలజడి మొదలైంది..

అప్పగింతలు, వ్రతం అన్ని సక్రమంగా జరిగిపోయాయి. రాధలో మాత్రం ఇంకా సంతోషపు చారలు కానరాలేవు కృష్ణకి..

ఆ రోజు వాళ్ళకి తొలిరేయి. రాధ ఇంట్లో హడావుడి మొదలైంది. రాధని అందంగా అలంకరించారు.

రాధ నాయనమ్మ రత్నం నెమ్మదిగా మనుమరాలిని పక్కకు తీసుకెళ్లి.. చూడమ్మ ఇప్పటి వరకు నువ్వు చిన్న పిల్లవి. ఇక నుంచి ఓ ఇంటి కోడలివి. భర్తకి, అత్తమామలకి అనుకూలంగా ఉండాలి. భర్తకి కావలసినవన్నీ సమకూర్చి తన హ్రుదయంలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలి సరేనా అని చెప్పి భర్తతో ఎలా మెలగాలో చెవిలో చెప్పి రాధను గదిలోకి పంపించింది.

కృష్ణ అప్పటికే గదిలో రాధ రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు. రాధ వచ్చేసరికి సంతోషంగా తన దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాడు.

రాధలో ఏదో అలజడి మొదలైంది తన చేతి స్పర్శకి. నెమ్మదిగా తల పైకెత్తి కృష్ణ మొఖం చూసింది.

‘అబ్బ..! ఎంత నలుపో’… ఇతడితో ఇక పై ఎలా ఉండాలి. ఒకవేళ మనసుకి సర్ది చెప్పుకుని కాపురం చేసిన మాకు పుట్టబేయే పిల్లలు కూడా ఇతడిలానే నల్లగా పుడతే ఇక అంతే అనుకుని ఒక్కసారిగా తనను వెనక్కి నెట్టేసింది.

చూడండి నాకు మీరంటే కోపం లేదు. మనం కొన్ని రోజులు మంచి మిత్రులుగా ఉందాం. సమయం అనుకూలించినప్పుడు జరగాల్సిన కార్యం
అదే జరుగుతుంది. ఏమంటారు అంది లోలోన భయపడుతూ..

అలాగే నీ ఇష్టమే నా ఇష్టం. అలాగే ఉందాం అన్నాడు నవ్వుతూ.

ఇదేంటి ఈయన వెంటనే ఒప్పుకున్నాడు.!! మరి మా నాయనమ్మేంటి భర్త మాట వినకపోతే గొడవపడతాడు, పుట్టింట్లో వదిలేసి వెళతాడు అంది. హుమ్, తనో చాదస్తపు మనిషిలే అనుకుంది.

రాధ, మనం మనసువిప్పి మాట్లాడుకున్నదే లేదు కదా. ఈ రోజు ఇద్దరం ఒకరి గురించి ఒకరం మాట్లాడుకుందాం ఏమంటావు అన్నాడు కృష్ణ భార్య కై చూస్తూ…

సరేనండి, అలాగే అని ఇద్దరు వారి అభిరుచుల గురించి చర్చించుకుని కాసేపటికి పడుకున్నారు..

ఉదయం అయ్యాక సుమతి కూతురిని పిలిచి వారి మధ్యన సఖ్యత గురించి అడిగింది.’ రాధ అంతా బాగుందమ్మా ‘అని చెప్పేసరికి ఊపిరి పీల్చుకుంది సుమతి.

కూతురి మనస్తత్వం గురించి బాగా తెలిసిన పరమేశం మాత్రం వారి మధ్యన ఇంకా భార్యాభర్తల సాంగత్యం ఏర్పాటు కాలేదని గ్రహించాడు కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే తన కూతురు మనసుకు నచ్చినప్పుడే దేన్నైనా అంగీకరిస్తుందని తనకు తెలుసు కాబట్టి..

రెండు రోజులైనాకా ఇద్దరు ,కృష్ణ ఉద్యోగ రిత్య ముంబయి బయలుదేరారు. విమానం ఎక్కడం రాధకి మొదటిసారి కావడంతో తెగ సంబరపడింది. తీరా ఎక్కాక బయలుదేరుతుంటే ఒకటే వణుకు. విమానం ఎక్కడ ఉన్నపలంగా కూలిపోతుందోనని.

కృష్ణ భార్యకున్న భయాన్ని పోగొట్టి తన చేతులను గట్టిగా పట్టుకున్నాడు విమానం ల్యాండ్ అయ్యేవరకు..

ఇద్దరు ఇంటికి వెళ్లారు. అక్కడ తను సొంత ఫ్లాట్ కొనుకున్నాడు. ఇళ్లు చిన్నదే అయిన అందంగా ఉంది. సామాన్లన్ని ఒక పద్ధతి ప్రకారం సమకూర్చి ఉన్నాయి. రాధకి ఇళ్లు బాగా నచ్చింది..

రాధ, నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు నేను ఈలోపు మనకు భోజనం ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు.

రాధ సరేనని స్నానం చేసి హాలులోకి వచ్చేసరికి టీ, బిస్కెట్స్ అందించాడు కృష్ణ.

మీకు టీ పెటొచ్చా!!? అంది రాధ…

నాకు అన్నీ పనులు వచ్చు.ఇంకో గంటలో డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను. అప్పటి వరకు ఈ స్నాక్స్ తిను అని చిప్స్ ప్యాకెట్ ఇచ్చి కిచెన్ లోకి వెళ్ళాడు..

‘ఓ గంటలో అన్నం, టమాట పప్పు, వడియాలు, నెయ్యి, పెరుగుతో డిన్నర్ మెనూ సిద్ధం చేసి రాధని కూర్చోబెట్టి దగ్గరుండి వడ్డించాడు’.

రాధ కడుపునిండా తినేసింది. ఇద్దరు తిన్నాక ల్యాప్ టాప్ లో సినిమా చూసి పడుకున్నారు.

మరునాడు రాధ నిద్ర లేచేసరికి కృష్ణ ఆఫీస్ కి రెడీ అయ్యాడు.

రాధని చూసి, ఓ లేచావా..! నేను ఆఫీస్ కి వెళుతున్నాను. నీకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అన్ని రెడీ చేసి డైనింగ్ టేబుల్ పై పెట్టాను. హర్డ్ డ్రైవ్ లో నీకు నచ్చిన మూవీస్ అన్నీ అప్లోడ్ చేసాను. నీకు బోర్ కొడితే చూడు సరేనా.. నేను సాయంత్రం త్వరగా వస్తాను. అప్పుడు బయటకు వెళదాం సరేనా అని వెళ్లిపోయాడు…

రాధకు తెలియని అభిమానం ఏర్పడింది భర్త పై. వెంటనే స్నానం చేసి టిఫిన్ చేసి సినిమా చూస్తూ కూర్చుంది. ఇంతలో కృష్ణ ఫోన్ చేసి రాధతో కాసేపు మాట్లాడి పెట్టేసాడు..

రాధ కాసేపు అయ్యాక లంచ్ చేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇంట్లో వారందరితో మాట్లాడి పెట్టేసింది.. ఫోన్ చూసుకునే సరికి భర్త నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే ఫోన్ చేసింది.

రాధ అన్నం తిన్నావా..? అందుకే ఫోన్ చేసా అన్నాడు కృష్ణ..

తినేసానండి… సారీ…!! అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ మీ కాల్ చూసుకోలేదు అంది..

ఎం పర్వాలేదు..!

నేను సాయంత్రం ఆరింటి వరకు వస్తా. నువ్వు రెడీగా ఉండు బయటకి వెళదాం అన్నాడు..

రాధ భర్త వచ్చేసరికి అందంగా తయారయ్యింది. కృష్ణ తనని చూస్తూ ఉండిపోయాడు.. ఇద్దరు కాసేపటికి బయలుదేరారు..

కృష్ణ ఓ రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు… ‘రాధ… ఇవాళ మనం క్యాండిల్ లైట్ డిన్నర్ చేయబోతున్నాం.. నీకు కొత్తగా ఉంటుంది ఈ అనుభూతి పద అన్నాడు’..

క్యాండిల్ లైట్ డిన్నర్ రాధకి బాగా నచ్చింది.. కృష్ణ సాంగత్యంలో గంట ఓ సెకన్ల గడిచిపోయింది..
ఇలా వారం రోజులు గడిచిపోయాయి.. ఇప్పుడు రాధనే కృష్ణ కోసం ప్రత్యేకమైన వంటలు వండి పెడుతుంది…

రాధ పుట్టిన రోజు రేపు అనగా రాత్రి కృష్ణ కేక్ కట్ చేయించాలని ప్లాన్ వేశాడు. అందుకు తగ్గట్టే అన్ని అరేంజ్ మెంట్స్ చేసుకున్నాడు..

రాధని రాత్రి పన్నెండింటికి టెర్రెస్ పైకి కళ్ళు మూసి తీసుకెళ్లి నెమ్మదిగా కళ్ళ పై నుంచి చేతులు తీసాడు..

రాధ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది… “అమ్మా, నాన్న అంటూ తల్లిదండ్రులను హత్తుకుంది” …

ఏలా ఉన్నావురా తల్లి..? అని పరమేశం కూతురిని అడిగాడు.. చాలా బాగున్నాను నాన్న అంది తండ్రి ఓడిలో ఒదిగిపోయి…

“హ్యాపి బర్త్ డే రాధ” అని పూలబొకే అందించాడు కృష్ణ..

రాధ ఆనందంగా కృష్ణని హత్తుకుంది.. నా పుట్టిన రోజు మీకు గుర్తుందనుకోలేదు అంది..

” నా ప్రాణం పుట్టిన రోజు ఎలా మరిచిపోతాను” అని తన చేతికి బంగారపు ఉంగరం తొడిగి ముద్దాడి “ఐ లవ్ యూ ఫర్ ఎవర్.. ” అన్నాడు..

రాధ కూడా” లవ్ యూ టూ మై సోల్ ” అంది…
ఇద్దరు కాసేపు బాహువుల్లో బంధీలై ఈ లోకాన్ని మరిచారు..

సరే, సరే… ఇక కేక్ కట్ చేస్తారా అంటూ కృష్ణ తల్లిదండ్రులు అనేసరికి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు..

అత్తయ్య, మామయ్య అని ఇద్దరి ఆశీర్వాదం తీసుకుంది రాధ…

‘పుట్టిన రోజు శుభాకాంక్షలు బంగారం’ అని ఆశీర్వదించారు ఆ దంపతులు…

అందరి సమక్షంలో కేక్ కట్ చేసి ఇంకో పుట్టిన రోజు వసంతాన్ని అలాగే కృష్ణని తన జీవితంలోకి మనసారా ఆహ్వానించింది రాధా….

“ఆ రోజుతో వారు పరిపూర్ణమైన వివాహబంధానికి శ్రీకారం చుట్టి దాంపత్య బంధంతో ఏకమైనారు” ..

ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం రాధ పుట్టిన రోజుతో పాటు వారి ప్రేమ పుట్టిన రోజును కూడా కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకుంటూ వస్తున్నారు…

ఇప్పుడు రాధ గర్భవతి… ఇప్పుడు తనకి రంగు పై మమకారం లేదు ప్రేమ తప్ప. రాధకి కృష్ణ రూపురేఖలతోనే పాప పుట్టాలని బలమైన కోరిక, నమ్మకం ఉంది..

“రంగు శాశ్వతం కాదు… ప్రేమించే గుణమే మనిషికి, మనసుకి ఆభరణం” …

🌹 కథ సమాప్తం🌹

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!