బంగారమ్మ కాసులపేరు

బంగారమ్మ కాసులపేరు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి ప్రసాద్ గునుపూడి.

     “ఎందుకు బంగారమ్మ! హడావిడి పడతావ్! ప్రతి సంవత్సరం జరిగే పేరంటమే కదా. ఎందుకు అంత హడావిడి ” అని ఏడుకొండలు అనగానే “చాల్లెండి. వచ్చిన అమ్మలక్కలంతా ఏం చేయించుకున్నవు వదినా పండక్కి అంటూ.. నన్నే కదా అడుగుతారు. మిమ్మల్ని ఎవరన్నా అడుగుతారా ఏమిటి?”  “లేని పోనీ  ఆర్బాటాలు అన్నీ ఎందుకు. ఉన్నంతలో ఉంటాం. వాళ్ళ కోసం వీళ్ళ కోసం లేనిపోని గొప్పలు మాకెందుకు. ” అని భర్త చెబితే వినే రకమా బంగారమ్మ! పట్నంలో కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి బోలెడు జీతం అని ఊరక ముందు గొప్పలు చెప్పుకుంది. దాంతో చుట్టుపక్కల అమ్మలక్కలు ఊరుకుంటారా. అంత గొప్ప జీతం అన్నప్పుడు బంగారం అది ఏం చేయించుకో పోయావా  అంటూ అడిగేసరికి, నాలుక కరుచుకుని అబ్బే చేయించుకోక పోవడం ఏంటమ్మా! పట్టణంలో పది సవర్ల కాసులపేరు బెత్తాయించి వచ్చానని, చెప్పుకుని వచ్చింది. అయితే పండక్కి మన బంగారమ్మ కాసులపేరు వేసుకుంటుంది మాట మనం తప్పక చూడాల్సిందే అంటూ అమ్మలక్కలందరూ పేరంటానికి వచ్చినప్పుడు చూస్తాం అని చెప్పారు. కొడుకుకి ఉత్తరం రాసింది. తను వెలగబెట్టిన నిర్వాకం గురించి కొడుకు రెండే రోజుల్లో ఓ కాసులపేరు తీసుకువచ్చి బంగారమ్మ కిచ్చాడు. ఇప్పుడు ఆ నగ చూపించుకుని గొప్పలు పోవడానికే బంగారమ్మ పేరంటం పెట్టింది. పేరంటానికి అంతా సిద్ధం చేసింది. కాసులపేరు తో లక్ష్మీదేవి లా తయారయింది. ముత్తయిదువులు రానే వచ్చారు. అందరికీ వాయినాలు ఇస్తూ తన కాసులపేరు చూపించుకుని మురిసిపోతోంది. ఇంతలో తన కొడుకు ఫోన్ మోగింది. తీరా కొడుకు ఎదురింటి తన స్నేహితుడి ఇంట్లో ఉన్నాడు. ఏ ముఖ్యమైన ఫోన్ అనుకుంటూ ఫోన్ తీసుకొని ఎదురింటి పరిగెత్తింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక ఆగంతకుడు బండి మీద వచ్చి బంగారమ్మ కాసులపేరు కాస్త లక్కు  పోయాడు. అంతే! బంగారమ్మ ఓ పక్కకి విసురు వల్ల  పడిపోయింది. ఇంతలో పేరంటాలు అందరూ పరిగెత్తుకొని వచ్చి “అయ్యో బంగారమ్మ, ఊరికే గొప్పలు చెప్పుకున్నా వు. ఇప్పుడు చూడు ఎవరి కన్నుకొట్టిందో ఏమో! అన్నాక కాస్త దొంగ లాక్కుని పోయాడు. అంటూ ఓదార్చారు. అది ఓదార్పొ, లేక దెప్పి పొడుపో అర్థం కాలేదు బంగారమ్మకు. అంత జరిగినా భర్త గాని, కొడుకు గాని ఒక మాట బంగారమ్మను గాని, ఆ దొంగని గానీ అనలేదు.
మరునాటి ఉదయం యధావిధి గా  వాకిలి ఊడుస్తూ, కళ్ళాపి జల్లుతోంది. ఆ మసక వెలుతురులో మళ్ళీ ఆ దొంగ వచ్చాడు. బంగారమ్మ గమనించే లోపే దగ్గరగా వచ్చి, ఛీ దుర్మార్గురాల! చిలకలపూడి బంగారం వేసుకుని అందరినీ మోసం చేస్తావా. అంటూ కాసులపేరు తన మొహాన్నే విసిరికొట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది బంగారమ్మకు తన భర్త, కొడుకు ఎందుకు మాట్లాడకుండా ఊరుకున్నారో.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!