‘భగినీ హస్త భోజనం’

‘భగినీ హస్త భోజనం’!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త:సుజాత.పి.వి.ఎల్

‘భగిని’ అంటే సోదరి అని అర్థం. అక్కని గానీ, చెల్లెల్ని గానీ సోదరి అంటారు. హస్త భోజనం అంటే చేతి వంట అని అర్థం. అంటే, సోదరి చేతి వంటని, సోదరుడిని ఇంటికి పిలిచి ఆప్యాయంగా భోజనం పెట్టడం అన్నమాట. అయితే ఇందులో కొత్త విషయం ఏముందని అనుకోవచ్చు. కానీ, గొప్ప విశేషమే దాగుంది. అదేమిటంటే..సాధారణంగా “మన ఇంటి ఆడ బిడ్డకి పెళ్ళయ్యాక ఆ ఇంటికి(అత్తవారింటికి) దీపం అవుతుంది”. మన ఇంటిని దాటి వెళ్ళిపోయాక అన్నదమ్ములు గానీ, తల్లిదండ్రులు గానీ సోదరింటికి వెళ్లి భోజన చెయ్యడానికి నచ్చుకోరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్లకి ఋణపడ్డం ఏ పుట్టింటివారికీ ఇష్టం ఉండదు కదా! అందుకని. అయితే శుభకార్యాలలో, శుభ సందర్భాలలో వచ్చి భుజించడం తప్పులేదు..తప్పదు కాబట్టి అంత పట్టింపు ఉండదు. కానీ, చీటికీ మాటికీ వచ్చి తిని వెళ్లడం మర్యాద కాదని మన సంప్రదాయం. కానీ, కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు ఖచ్చితంగా భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. ఇందుకు పురాణాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సూర్య భగవానుడికి, సంధ్యాదేవికి యముడు, యమునా అని ఇద్దరు సంతానం కలిగారు. యమునకు తన అన్నయ్య యముడంటే ఎంతో ప్రేమ. అలాగే యముడికి కూడా సోదరి యమున అంటే చాలా ఇష్టం. యముడు తన చెల్లెలు యమునను ‘యమీ ‘ అని ముద్దుగా పిలిచేవాడు. కొంతకాలానికి యమునకు పెళ్లీడు వచ్చింది. మంచి వరుడ్ని చూసి వివాహం చేశారు. అత్తారింటికి వెళ్లిపోయింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలనిపించింది. తన ఇంటికి వచ్చి విందుని స్వీకరించమని అన్న అయిన యమధర్మ రాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమునకు మాటిచ్చాడు యమధర్మ రాజు. అన్నయ్య వస్తాడనే ఆనందంతో అన్నకు ఇష్టమైన వంటకాలన్నీ స్వయంగా తయారు చేసి ఎప్పుడొస్తాడా? అని ఎదురు చూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపైనా అన్నయ్య రాలేదు. ఆ రోజు యముడికి పాపుల సంఖ్య ఎక్కువగా ఉండే సరికి, ”పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల రాలేక పోతున్నాను చెల్లీ..మన్నించమని, ‘కార్తీక శుద్ధ విదియనాడు’ తప్పక వస్తానని” వర్తమానం పంపాడు యమధర్మరాజు. అప్పుడు అన్న రానందుకు విచారించినా, విదియనాడు ఎలాగూ వస్తానని మాటిచ్చాడుగా అని సంతోషపడింది యమునా. కార్తీక శుద్ధ విదియ రోజు రానే వచ్చింది. తన అన్నకు ఇష్టమైన పదార్థాలన్నీ స్వయంగా తయారు చేసి, స్వాగత దీపాలు వెలిగించి గుమ్మoలో కూర్చొని అన్న కోసం ఎదురు చూడసాగింది. అన్నమాట ప్రకారం యముడు చెల్లెలు ఇంటికి విందుకు విచ్చేశాడు. యమున ఎంతో సంతోషంగా తన అన్నయ్యకు అతిధి మర్యాదలు చేసింది. అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూల మాలతో అలంకరించి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించింది. చెల్లెలు ప్రేమానురాగానికి ముగ్ధుడైన యముడు ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. ‘ప్రతియేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకు రావాలనీ, అలాగే ప్రతి సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్లి తన చేతి భోజనం భుజించాలనీ, ఈ సంతోషం ప్రతి సోదరీసోదరులకు కలిగేలా వరం ఇమ్మని కోరుకుంది యమున.”తథాస్తు” అని అనుగ్రహించాడు యముడు. అందుకే నాటి నుండి నేటి వరకు ఈ భగినీ హస్త భోజనం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పండుగను పలు రాష్ట్రాల్లో పలు విధాలుగా పిలుస్తుంటారు. మహారాష్ట్రలో ‘భయ్యా -దుజ్ ‘ అని, నేపాల్ ప్రాంతంలో ‘భాయీ- టికా ‘ అని, పంజాబ్ ప్రాంతవాసులు ‘టిక్కా’ అని..ఇలా పలు ప్రదేశాల్లో పలురకాలుగా పిలుచుకుంటారు. ఏదిఏమైనప్పటికీ, సోదరీసోదరుల ఆప్యాయతానురాగాలకు అద్దం పట్టే ఒక సంప్రదాయ వేడుక ఈ పండుగ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!