విడిపోని బంధం

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

విడిపోని బంధం

రచన: వాడపర్తి వెంకటరమణ

అనుకుంటాం గానీ, అసలు ఒంటరితనానికి మించిన నరకం మరొకటి ఉండదేమో…ఒంటరిగా ఉన్నప్పుడు మెదడుచుట్టూ రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు ముసురుకుని వేరు దొలిచే పురుగుల్లా మెదడును తినేస్తూవుంటాయి.ఇప్పుడు నా పరిస్దితి అలాగే ఉంది.గతం తాలూకు ఆలోచనలు మెదడు పొరల్లోకిచేరి కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఈ సంకటస్థితిని ఎవరితో చెప్పుకోను.ఒకవేళ చెబితే తనపట్ల జాలి చూపిస్తారేతప్ప, తన సమస్యను పూర్తిగా సాల్వ్ చేసేవారేరి? అయినా ఎవరి పనుల వత్తిళ్ళు వాళ్ళవి.ఎవరి జీవితం వాళ్ళది.నా పరిస్థితిని చూసి నాకే నవ్వొచ్చింది. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమౌతోంది… నా జీవితం కుక్కలు చింపిన విస్తరి అయ్యిందని!

మురళి నుండి నేను విడిపోయి సంవత్సరం అయ్యింది.ఇద్దరి మనస్తత్వాలు వేరయ్యి, అభిప్రాయ భేదాలు రావడంతో కోర్టు ద్వారా లీగల్ గానే విడిపోయాం.

విడిపోయి విడాకులు తీసుకుని పుట్టింటికి చేరిన ఈ సంవత్సరంలో చాలా అనుభవాలు నాకు ఎదురయ్యాయి.

నాకు మరో పెళ్ళి చేయడానికి పుట్టింటివాళ్ళు రెండు సంబంధాలు చూశారు.మాటలు కూడా జరిగాయిగానీ, నన్ను చూడడానికి మొదటి సంబంధం వాళ్ళు ఎందుకు రాలేదో నాకిప్పటికీ తెలియదు.బహుశా నాకు రెండో పెళ్ళి గురించి వాళ్ళకు తీవ్రమైన అనుమానాలున్నాయేమో మరి…!

రెండో సంబంధం వాళ్ళు పెళ్ళిని పీటలదాకా తీసుకొచ్చారు.అయితే చివరి నిమిషంలో తెలిసిన భయంకర నిజమేమిటంటే… పెళ్ళికొడుక్కి అది రెండో పెళ్ళంట.ఆ విషయాన్ని పెళ్ళికొడుకు తల్లిదండ్రులు చాలా గోప్యంగా దాచిపెట్టారు.నిజానికి అది సమస్య కానేకాదు.కానీ అతనికి లేని వ్యసనమంటూ లేనేలేదని, అదనపు కట్నం కోసం భార్యని, ఇంట్లోవాళ్ళ సాయంతో అతి కిరాతకంగా పెట్రోలుపోసి  చంపేశాడని తెలియడంతో ఉన్నపళంగా ఆ పెళ్ళికూడా ఆగిపోయింది.

ఆ రెండు సంబంధాల తర్వాత పుట్టింటివాళ్ళు విసిగిపోయారో, నా జాతకం ఇంతే అనుకున్నారేమోగానీ, ఆ తర్వాత ఆ ఇంట్లో నా గురించి పెళ్ళిమాట వినబడలేదు. ఇప్పుడు నా పరిస్దితి నాకు బాగా అర్థమయ్యింది. భర్తనుండి విడాకులు తీసుకుని ఎంత పెద్దతప్పు చేశానో తెలిసొచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం…! జరగాల్సిన తప్పు జరిగిపోయింది.

ఇంట్లోవాళ్ళకి ఈ ఆరు నెలల నుండి నా గురించి శ్రద్ధ తగ్గడం గమనించాను.మొదట్లో ఉన్నంత ప్రేమ వారి మాటల్లోనూ, చేతల్లోనూ కనబడడంలేదు.ఎవరి పనుల్లో వాళ్ళున్నారు.రానురాను ఆ ఇంట్లో నా పాత్ర చారులో కరివేపాకు అయిపోయింది.

ఆమధ్య నా స్నేహితురాలు పుష్ప ఇంటికి వచ్చినపుడు మురళికి మళ్ళీ పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది.నా మనసులో బాధతో కూడిన ఆనందం కలిగింది.పోనీలే…ఈ రకంగానైనా తను సుఖంగా పిల్లాపాపలతో జీవించనీ అని మనస్పూర్తిగా దేవున్ని కోరుకున్నాను.ఎందుకంటే చెప్పుడు మాటల్ని చెవికెక్కించుకుని బంగారంలాంటి భర్తను చేజేతులా దూరం చేసుకున్న తనకు సంసార సుఖాన్ని అనుభవించే యోగంలేదని ఎలాగూ తేలిపోయింది.

ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు.మనసుకు బాధ కలిగినప్పుడు నాకునేనే ఓదార్చుకోవాలి.నాకునేనే సాంత్వన వచనాలు పలుకుకోవాలి.జడివానలో చిక్కుకున్న ఒంటరి పక్షనైపోయాను. దుఃఖంతో కళ్ళనుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి.

“అత్తయ్యా…! ఫంక్షనుకి వెళ్ళాలంట.అమ్మ తొందరగా రమ్మంటోంది!” చెప్పి వెళ్ళిపోయింది శాన్వి.శాన్వి మా అన్నయ్య కూతురు.

ఈరోజు మా దగ్గర బంధువుల పెళ్ళి ఫంక్షనుంది.ఇంట్లో ఒంటరిగా ఉంటే, పిచ్చి పిచ్చి ఆలోచనలతో తల బద్దలైపోతోంది.కాస్త మార్పుగా ఉంటుందని వదినతోకూడా ఫంక్షన్ కి వెళ్ళాను.

ఫంక్షన్ హాలు ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళతో కళకళలాడుతోంది.వధువు దగ్గరి బంధువవ్వడంతో ఆమె తల్లిదండ్రులతో మాటల్లో పడిపోయారు అన్నయ్య, వదినలు.

వధూవరులకు విషెస్ చెప్పి వేదికపైనుండి కిందికి దిగుతున్నప్పుడు షాక్ తగిలినట్లు తూలిపడబోయి తమాయించుకున్నాను నేను.

అదే హాల్లోనే కాస్త దూరంగా ఎవరితోనో మాట్లాడుతూ మురళి కనిపించాడు.అనుకోకుండా దృశ్యమానమైన ఆ హఠాత్పరిణామానికి గుండెల్లో ఏదో తెలియని కంగారు మొదలైపోయింది.ఇక్కడ తననేమైనా చూసాడేమోనని ఒకటే గుబులు.ఇక అక్కడ ఉండలేక దూరంగా వచ్చేశాను. అయినా తన పిచ్చిగానీ, ఒకరికొకరు విడిపోయాక ఇంకా ఇద్దరిమధ్య ఏ సంబంధం ఉంటుందని!? నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది.గుండె మాయమైపోయింది.

ఈలోగా భోజనాల కార్యక్రమం మొదలయ్యింది.వేదికపై తాము తీసుకొచ్చిన గిఫ్ట్ ప్యాక్ ను వధూవరులకు అందజేస్తూ వారితో ఫోటోలుదిగే హడావిడిలో ఉన్నారు అన్నయ్య వాళ్ళు. ఇక నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. హడావిడిగా ఏదో తిన్నాననిపించి, అన్నయ్య వాళ్ళకిచెప్పి ఇంటికి బయలుదేరడానికి ఫంక్షన్ హాలునుండి బయటపడ్డాను.

పదడుగులు వేసానో లేదో వెనకనుండి ‘ప్రమీలా…’ అన్న పిలుపు వినబడింది.చిరపరిచితమైన ఆ పిలుపుకు నాకు ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. వెనక్కి తిరిగి చూశాను.నా ఎదురుగా మురళి నిల్చుని ఉన్నాడు.

మళ్ళీ అతన్ని నేను చూస్తాననుకోలేదు.సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే చూడడం.మనిషిలో మార్పేమీలేదు. ఇంతకుముందెలా ఉండేవాడో… ఇప్పుడూ అలానే ఉన్నాడు.కాకపోతే ఇంతకుముందున్న కళ ఇప్పుడతని మొహంలో కనపడలేదు.

కొద్ది క్షణాలు మా ఇద్దరిమధ్యా మౌనం రాజ్యమేలింది.

“ఎలా ఉన్నావు…ప్రమీలా?” ముందుగా అతనే నోరువిప్పి పలకరించాడు.

ఆ మాటకు గొంతు తడారిపోయి…ఏం బదులు చెప్పాలో అర్ధంకాక మౌనంగా ఉండిపోయాను.

నేనేమీ మాట్లాడకపోయేసరికి తనే కల్పించుకుని, “ఏదన్నా మాట్లాడు ప్రమీలా! నీమాటవిని చాలా రోజులయ్యింది”నావైపు చూస్తూ అన్నాడు.

“భార్యా, పిల్లలు ఎలా ఉన్నారు?” తప్పనిసరి మాట్లాడాల్సిన పరిస్థితిలో ఏదో ఒకటి అతికష్టంగా అడిగానంతే.

“పిల్లలులేరుగానీ…భార్య మాత్రం బాగనేవుంది!” నావైపు అదోలాచూస్తూ అన్నాడు. ఆ చూపు నన్ను కలవరపెట్టింది.

అయినా తామిద్దరూ విడిపోయి సంవత్సరమేకదా అయ్యింది.పుష్ప చెప్పినదానిబట్టి బహుశా మురళికి రెండో పెళ్ళయ్యి ఆరు నెలలుకూడా అయ్యిండదు.పిల్లల గురించి అసందర్భంగా అడిగాననిపించింది.ఆ ప్రశ్నను కవర్ చేసుకునేందుకు ఇంకో ప్రశ్న వేశాను.

“అవునూ… ఫంక్షన్ కి మీ భార్యను తీసుకురాలేదా?” అడిగాను అతన్ని.

“వచ్చిందిగా…” ఎందుకో అతని పెదాలమీద చిరునవ్వు పూసినట్లనిపించింది.

“ఏదీ…? ఎక్కడ…?” నాలో అమాంతం ఆమెను చూడాలన్న కుతూహలం పెరిగిపోయింది.

“ఇదిగో… ఇక్కడే…నా ఎదురుగానే ఉంది!” అతను చెబుతున్నదేమిటో ముందు అర్ధం కాకపోయినా…తర్వాత తన అంతరంగమేమిటో అర్థమయ్యింది.అయినా సందేహ నివృత్తికోసం అడిగాను.

“అదేంటి…మరి మనం విడిపోయిన తర్వాత మీకు మళ్ళీ పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని నా ఫ్రెండ్ పుష్ప చెప్పింది.”

“మీ ఫ్రెండ్ చెప్పిందీ… నీవు విన్నదీ, రెండూ కరెక్టే.ఇంట్లోవాళ్ళు పెళ్ళి సంబంధాలు చూసిన మాటా వాస్తవమే.కానీ…విడిపోయినా అప్పుడూ…ఇప్పుడూ…ఎప్పుడూ… ఎవరు అవునన్నా, కాదన్నా నాగుండెల్లో భార్య స్థానం ఒక్కరికే.నేను చనిపోయేంతవరకు ఆ స్థానం నా ప్రమీలదే.” చెబుతున్నప్పుడు అతని ముఖం గంభీరంగా మారిపోయింది.

ఆ మాటలు నాకు చర్నాకోల్ తో కొట్టినట్లయ్యి, ఒక్కసారిగా నా కళ్ళు కన్నీటి చలమలయ్యాయి.

‘నామాటే పైచేయి కావాలని, నేను అనుకున్నది కచ్చితంగా నెగ్గాలని పరుల చెడుమాటల్ని చెవిలో పెట్టుకుని మూర్ఖంగా దేవునిలాంటి భర్తని విడాకులిచ్చి ఇన్నాళ్లూ దూరం చేసుకున్నాను.ఇంతజరిగినా…మరో పెళ్ళి చేసుకునే అవకాశమున్నా, ఇప్పటికీ నేనే తన భార్యగా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాడు.ఒక స్త్రీకి ఇంతకంటే ఇంకేం కావాలి! ఏదో పూర్వజన్మలో పుణ్యంచేసినందుకేమో దేవునిలాంటి నా భర్త మళ్ళీ నా భర్తగా దొరికాడు’ ఇన్నాళ్టికి నాకు కనువిప్పు కలిగి, కళ్ళుచుట్టూ కమ్ముకున్న మాయా మబ్బుపొరలు ఒక్కొక్కటిగా కరిగిపోయి, కళ్ళు ఒక్కసారిగా కన్నీటితో ధారాపాతమయ్యాయి.

ఆ దుఃఖాన్ని ఇక ఆపుకోలేక నా భర్త గుండెలపై వాలిపోయాను. ప్రేమగా నాతలను నిమిరి, నన్ను తన గుండెలకు హత్తుకున్నాడు నా భర్త మురళి.

ఇప్పుడు మా బంధం… విడిపోయిన బంధం కాదు.ఎన్నటికీ విడిపోని భార్యాభర్తల బంధం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!