పశ్చాత్తాపం

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

పశ్చాత్తాపం

రచన: సావిత్రి కోవూరు 

ఒకరోజు మధ్యాహ్నం రంగారావు భార్యకు టాబ్లెట్స్ ఇచ్చి, “పడుకో రాత్రి ఆయాసంతో నిద్ర పోలేదు నీవు. బాగా నిద్ర పోతె ఆయాసం తగ్గుతుంది” అని చెప్పి బయటకు వచ్చాడు.

హాల్లో ఉన్న కొడుకుతో “నాన్న ఆరోగ్యం బాగాలేదా లీవ్ పెట్టి నట్టున్నావ్” అన్నాడు.

“లేదు నాన్న. మీతో కొంచెం మాట్లాడాలి. పిల్లలు, వసుధ ఉన్నప్పుడు చెప్పడానికి కుదరటంలేదు. అందుకే తీరికగా మాట్లాడాలని లీవ్ పెట్టాను” అన్నాడు అనిరుధ్.

“చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు” అని అడిగాడు రంగారావు. టీచర్ గా పని చేసిన రంగారావు వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని, తన కొడుకుకు జాబ్ వచ్చేల చేసారు.

“ఏం లేదు నాన్న. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు, అమ్మ లాగానే రాత్రంతా ఆయాస పడుతుంటే దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అక్కడ చాలా చెట్లు ఉండడం వల్ల, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం, కరెక్ట్ టైంకి భోజనం, డాక్టర్ పర్యవేక్షణ వల్ల ఆయన ఆరోగ్యం చాలా బాగు పడిందట. మా ఫ్రెండు మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తుంటాడు” అన్నాడు.

వింటున్న రంగారావుకు కొడుకు ఏం చెప్పబోతున్నాడో అర్థమైంది. “సరే రా అలాగే వెళ్తాం. నీకు ఎలా ఇష్టముంటే అలాగే జరుగుతుంది నీవు సంతోషంగా ఉండటమే మాకు కావలసింది” అన్నారు బాధతో.

“అది కాదు నాన్న, వసుధ పొద్దంతా ఆఫీస్ లో కష్టపడి వస్తుంది కదా. రాత్రంతా అమ్మ దగ్గుతుంటే పాపం నిద్ర పోలేక పోతుంది. అందుకే అమ్మని ఒక్కదాన్ని పంపిద్దాం” అన్నాడు.

“సరే రా. నీకు చిన్నప్పుడు మలేరియా వస్తే నీ బెడ్  దగ్గర నుండి కదలకుండా, నిద్రాహారాలు మాని, సేవలు చేసి రక్షించుకున్నది మీ అమ్మ. నీవు కాలేజీకి టూవీలర్ పై వెళుతూ యాక్సిడెంట్ అయి, కాలు ఫ్యాక్చర్ అయి విపరీతంగా రక్తంపోవడంతో పరిస్థితి విషమంగా ఉండటంతో తన రక్తం ఇచ్చి నిన్ను రక్షించుకున్నది మీ అమ్మ.

ఆరునెలల క్రితం నీకు, మీ ఆవిడకి కరోనా వస్తే, తనకు వస్తుందేమో అన్న భయం కూడ లేకుండా మీ ఇద్దరికి సేవలు చేయడమే కాక, పిల్లలకు ఏ లోటు రాకుండ చూసుకున్ళది. ఇప్పుడు కూడా తెల్లారగట్ల లేచి నీళ్లు పట్టి, బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతున్నందుకు, మంచి బహుమతి ఇస్తున్నావు.

ఇల్లు కట్టేటప్పుడు నాకు చూసుకోవడానికి వీలుకాకపోతె కాంట్రాక్టర్ వెంబడి ఉండి తనకు నచ్చినట్టుగా ఇంటిని కట్టించుకొన్నా, తనకెంతో ఇష్టమయినా ఆ ఇంటిని నీ పేర రిజిస్టర్ చేయమని నన్ను ఎంతో పోరి చేయించింది మీ అమ్మ. అంతే కాదు నాకు ఇంకా ఐదు సంవత్సరముల సర్వీస్ ఉన్నప్పుడే నీ అత్తెసరు  డిగ్రీ మార్కులకు, ఏ ఉద్యోగం రాదని నా చేత బలవంతంగా రిటైర్మెంట్ కు ఒప్పించి నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలాగా చేసింది.

ఇవన్నీ మర్చిపోయి తను కట్టించుకొన్న ఇంటిలోనే, తన ఆరోగ్యం బాగా లేనందువలన, తనకు స్థానం లేదని వృద్ధాశ్రమంలో పడేద్దామనుకుంటున్నావు. చాల మంచి ఆలోచన. ముసలిదైన ఆవును  కబేళాకు పంపించి కసాయికి అప్పగించినట్టు, మీ అమ్మ వల్ల ఏమి ఉపయోగం లేదని వృద్ధాశ్రమానికి పంపిద్దాం అని నీవు అన్నా, మీ అమ్మ ఒప్పుకున్నా, పెళ్లై ఇన్నేళ్లయినా ఒక్కరోజు కూడా నన్ను వదలకుండా నా మాటకు ఎదురు చెప్పకుండ, నా కష్టసుఖాలలో పాలుపంచుకున్న నా భార్యని, నేను నీలాగా నిర్దాక్షిణ్యంగా వదలలేను. నేను ఎక్కడ ఉంటే ఆమె అక్కడే ఉంటుంది” అన్నాడు నిక్కచ్చిగా.

“అదేంటి నాన్న లోకంలో ఎవరూ చేయని పనేదో  నేనే చేస్తున్నట్టుగా అదేదో పెద్ద తప్పన్నట్టుగా ఇంత రాద్ధాంతం చేస్తున్నావ్. మిమ్మల్నేమీ వెళ్ళమనలేదు కదా” అన్నాడు అనిరుధ్.

“అవును రా నన్ను పొమ్మనవు. ఎందుకంటే నా పెన్షన్ డబ్బులు కూడా నీకే ఇస్తున్నాను కదా. చిన్నా చితకా పనులు కూడా చేసి పెడుతున్నాను. మీ అమ్మ వల్ల ఏమి లాభం లేదని ఆమెను పొమ్మంటున్ళవ్. మేము ఇన్నాళ్లు పాముకు పాలు పోసి పెంచాము. ఇప్పటికైన నీ బుద్ది చూపించావు. కృతజ్ఞతలు. మీకు అంత భారంగా ఉంటే మేము వెళ్ళిపోతున్నము మీరు సుఖంగా ఉండండి” అని గబగబా తనవి, భార్యవి కొన్ని బట్టలు తీసుకుని, భార్య చేయి పట్టుకుని బయటపడ్డాడు.

ఆవేశంగా బయటకు వచ్చాడే గానీ ఒంట్లో బాగా లేని మనిషిని తీసుకుని ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు రంగారావుకు. ఆటో మాట్లాడుకుని నెక్లెస్ రోడ్ కొచ్చి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. గంటలు గంటలు గడిచిపోతున్నాయి. బంధువులెవరింటికి వెళ్లడం ఇష్టం లేదు. ఊరికి వెళ్లి తమకున్న పాత ఇంట్లోనే ఎలాగో గడపొచ్చు. కానీ అక్కడికి ఉదయం ఒక్కబస్సు మాత్రమే ఉంటుంది. ఈ రాత్రికి ఇక్కడే ఎక్కడో గడిపేసి ఉదయం వెళ్లొచ్చు అనుకుని చెట్టుకు ఆనుకుని కూర్చున్న రంగారావుకు కళ్లు మూతలు పడ్డాయి.

“మాస్టారు మాస్టారు” అన్న పిలుపుతో మేల్కొని ఎదురుగా ఉన్న యువకుని చూసి,

“ఎవరు బాబు మీరు. ఏంటి నన్ను లేపారు” అన్నాడు.

“మాస్టారు నన్ను గుర్తుపట్టలేదా నేను మీ ఇంట్లో ఉండి చదువుకున్న కిషోర్ ని. మీ దయ వల్లనే నేనిప్పుడు మంచి స్థితిలో ఉన్నాను.

ఇటువైపు ఏదో పని పడి వస్తే మీరు కన్పించారు. ఇక్కడెందుకు కూర్చున్నారు. చీకటి పడుతోంది ఇల్లు ఎక్కడో చెప్పండి నేను తీసుకెళ్తాను” అన్నాడు.

“బాబు ఇక్కడికి దగ్గర్లో ఏదైన వృద్ధాశ్రమం ఉంటే మమ్మల్ని అక్కడ చేర్పించు” అన్నాడు.

“అదేంటి మాస్టారు అనిరుద్ ఎక్కడున్నాడు. మీరు వృద్ధాశ్రమంలో ఎందుకు ఉండాలనుకుంటున్నారు” అన్నాడు.

“అదంతా తర్వాత చెబుతాను. మీ పంతులమ్మ ఉదయం నుండి ఏమీ తినలేదు. నీవు అక్కడికి తొందరగా తీసుకెళ్తే ఏదైనా తింటుంది” అన్నాడు.

“సరే మాస్టర్ రండి”  అని వాళ్లని తన ఇంటికి తీసుకెళ్లాడు.

“అదేంటి బాబు ఇక్కడికి తీసుకు వచ్చావ్. మీ వాళ్ళు గాని, మీ ఆవిడ గాని ఏమనుకుంటారు. మమ్మల్ని ఆశ్రమానికి తీసుకెళ్ళు నీకు పుణ్యముంటుంది” అన్నాడు మాస్టారు.

“అమ్మ గారు, మీరు ఏ బెంగ లేకుండా ఈ సోఫాలో హాయిగా కూర్చోండి. మీకు రూమ్ శుభ్రం చేయించేస్తాను. స్నానం చేసి, భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. నా భార్య లావణ్య వల్ల మీకు ఏమి ఇబ్బంది లేదు. ఇక పోతే నాకు ఒక ఒక పాప, బాబు. వాళ్లే మిమ్మల్ని బోర్ కొట్టించే అవకాశం ఉన్నది.

మీకేమి కావాలన్నా పని అమ్మాయిని పిలిస్తే మీకు కావలసిన సహాయం చేస్తుంది. మీకు గదిలో విసుగనిపిస్తే టీవీ పెట్టుకోండి. నేను మీ అబ్బాయిని అనుకోండి. నాకు ఇన్ని రోజులు తల్లిదండ్రులు లేరన్న బెంగ ఈరోజుతో తీరిపోయింది. మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా పడుకోండి” అని చెప్పి, రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

రంగారావు సీతమ్మ స్నానం చేసి వంటావిడ చేసి పెట్టిన వేడివేడి భోజనం చేసి కూర్చున్నారు. కిషోర్ తన భార్యను, పిల్లలను పరిచయం చేశాడు. “నేను చెప్తాను కదా మా రంగారావు మాస్టర్ గురించి, వారే వీరు. ఈమె మా మాస్టర్ గారి ధర్మపత్ని సీతమ్మగారు. ఈ అమ్మగారి చేతి బోజనం తినే పెరిగాను. అమ్మ కంటే ఎక్కువ చిన్నప్పుడు నన్ను తన కొడుకుతో సమానంగా చూసుకునేవారు. నేను శ్రద్ధగా చదువుకుని ఇంతవాడిని అయ్యాను అంటే వీరి దయే”అన్నాడు.

కిషోర్ భార్య లావణ్య “మీ శిష్యుడు మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకోవాలని ఎన్నోసార్లు అనేవారు. దేవుని దయవల్ల మీరు మా ఇంటికి వచ్చారు” అన్నది.

రంగారావు ఎంతోమంది శిష్యులను చేరదీసి చదువు చెప్పించాడు. వాళ్ళందరూ ఎక్కడెకడున్నారో తెలియదు. తన చేతిలో ఉన్న సాయం చేసినందుకు ఇంత జ్ఞాపకం పెట్టుకుని ఇంత ఆదరిస్తున్నాడు, అనుకున్నాడు.

కిషోర్ సీతమ్మ గారిని మంచి డాక్టర్కు చూపించి మందులు ఇప్పించడం వల్ల ఆమె ఆరోగ్యం చాల వరకు కుదుటపడింది.

కొన్ని రోజులకు మాస్టర్ “బాబు మమ్మల్ని  బస్సు ఎక్కిస్తే మా ఊరు వెళ్ళిపోతాం. అక్కడ తెలిసిన వారుంటారు.ఎలాగో బ్రతుకుతాము. మీకు భారంగా ఎన్ని రోజులు ఇక్కడ ఉండమంటావు” అన్నాడు.

మాస్టరు మిమ్మల్ని ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను. మిమ్మల్ని ఎక్కడికి వెళ్లనిచ్చేది లేదు. మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి పంపిస్తాను” అన్నాడు.

“ఇక్కడ మీరిద్దరూ మమ్మల్ని పసిపిల్లల్లా చూసుకుంటూ ఆధరిస్తుంటే, మీ పిల్లలు మా సొంత మనుమడు, మనుమరాలు లాగా ముద్దు మాటలతో ఆనందం కలిగిస్తున్నారు. ఈ వయసులో ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది చెప్పండి. మీకు ఇబ్బంది కాకూడదని వెళతానంటున్నాను” అన్నారు.

“మా అమ్మానాన్నలు మా ఇంట్లో ఎంత స్వతంత్రంగా ఉంటారో, మీరు కూడా అలాగే ఉండండి. మాకు చాలా ఆనందం” అని లావణ్యా అభిమానంతో చెబుతుంటే వెళ్లలేకపోయారు రంగారావు.

ఆ విధంగా రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. ఒకరోజు కిషోర్, రంగారావు దంపతులకు నూతన వస్త్రములు ఇచ్చి “మాస్టారు ఈ రోజు మన పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ లో చిన్న పార్టీ ఉంది. మీరు రెడీ అవుతే అందరం వెళ్దాం” అన్నాడు.

“మేము ఎందుకు బాబు. మీరందరూ వెళ్లి రండి” అన్నాడు రంగారావు.

కిషోర్ “లేదు మాస్టర్ మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. మీరు కూడా వస్తే బాగుంటుంది” అన్నాడు.

“సరే బాబు” అని అందరు కలసి బయలుదేరారు. వీళ్ళు వెళ్ళెసరికి అందరూ వచ్చేశారు. వీళ్ళ రాకకై ఎదురుచూస్తున్నారు.

కిషోర్  “మాస్టారు, అమ్మగారు మీరు ఇక్కడికి రండి” అంటూ స్టేజ్ పైకి తీసుకెళ్ళి, కుర్చీలో కూర్చుండ పెడుతుంటే, మాస్టర్ దంపతులు అయోమయంగా చూస్తూ ఉండగానే,
కిషోర్ మైక్ లో “ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నది ఈ రోజు కొరకే. నా చిన్నప్పుడు  మహబూబ్ నగర్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరు నుండి రోజు నడిచి వచ్చి చదువు కొనే వాడిని. అప్పుడు మాస్టరు నాలాంటి ఎందరో విద్యార్థుల బాధను అర్థం చేసుకొని, తమ ఇంటిలో వసతి కల్పించి, చదువు చెప్పించే వారు. వారు చెప్పడం వల్లనే మా నాన్న నన్ను చదువుకోవడానికి అనుమతించారు. లేకపోతే మా ఆర్థిక పరిస్థితుల రీత్యా నా చదువు ఆపేసి పనిలో పెట్టేవారు.

ఆ రోజుల్లో మాస్టరు మా నాన్నతో ‘మీ పిల్లవాడు చాలా చురుకైన వాడు. చదువు ఆపకండి. మీకు వీలు కాకపోతే మా ఇంట్లో ఉంచుకుని నేను చదివిస్తాను’ అని చెప్పడం వల్ల నేను చదువుకుని నా కాళ్ళ పై నేను నిలబడటమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. మాస్టర్ మేలు నేను ఎప్పటికీ మరువను ఆయనకు ఇష్టమైతే మా అమ్మానాన్నల్లాగ మా ఇంట్లో శాశ్వతంగా ఉండి మమ్మల్ని కృతార్థులను చేయగలరని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మా మాస్టర్ గారి పెళ్లి రోజును పురస్కరించుకుని మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది” అన్నాడు.

తన పెళ్లి రోజును కనుక్కుని ఇంత ఘనంగా సన్మానించిన కిషోర్ ని ఆనందంతో దగ్గరకు తీసుకున్నారు రంగారావు. ఆహ్వానితులలో దూరంగా కూర్చున్న అనిరుధ్ దంపతులు తన తల్లిదండ్రులు ఏదో ఒక వృద్ధాశ్రమంలో ఉంటారులే అని భార్యా పిల్లలతో హాయిగా గడుపుతున్నారు.

తన తల్లిదండ్రులను ఇంత ఆదరించే శిష్యుడు ఉన్నాడని తెలియదు. తన బాధ్యతను ఒక పరాయి వ్యక్తి ఆనందంగా స్వీకరించి నిర్వర్తించడం చూసి కుంగి పోయాడు.

రక్తమాంసాలు పంచిచ్చి ఎంతో గారాబంగా పెంచి ఇంత వాడిని చేసిన తన తల్లిదండ్రులను, పనివాళ్ళను చూసినట్టు చూసాడు. వాళ్ల కష్టార్జితాన్ని వాళ్ళ ఇంటిని సొంతం చేసుకున్నాడు. దిక్కులేని వాళ్ళలాగ  ఇంటి నుండి వెళ్ళగొడ్తే, ఏమీ సంబంధం లేని ఆయన శిష్యుడు తనకు జ్ఞాపకం కూడా లేని తల్లిదండ్రుల పెళ్లి రోజును ఇంత ఘనంగా చేస్తున్నాడు.

తనను కూడా ఆహ్వానించి ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడక, హుందాగా వ్యవహరించిన కిషోర్ కి మనసులోనే నమస్కరిస్తూ, తల్లిదండ్రులను పలుకరించేందుకు ముఖం చెల్లక, దూరం నుండే వెళ్ళొస్తానని సైగ చేసి తనపై తనకే అసహ్యం వేస్తుండగా సిగ్గుతో తలవంచుకుని ఇంటి దారి పట్టాడు అనిరుద్.

నాలుగు రోజులు ప్రేమగా ఇంత బోజనం పెట్టి, నాలుగు అక్షరం ముక్కలు నేర్పించినందుకే మా అమ్మనాన్నల బాధ్యత అంత సంతోషంగా తీసుకుంటుంటే, తనేమి చేశాడు? అని పశ్చాత్తాపంతో బాధపడసాగాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!