అమ్మతనం లోని కమ్మదనం

అమ్మతనం లోని కమ్మదనం

రచన: పరిమళ కళ్యాణ్

ట్రాఫిక్ కదలటం లేదు, సమయం దగ్గర పడుతోంది. ఒకపక్కన నా భార్య సుహాసిని పురిటినొప్పులు పడుతోంది. అంబులెన్స్ పిలిచే లోపు, సొంత వాహనంలో తొందరగా హాస్పిటల్ చేరొచ్చు అనుకోని కారులో తనని తీసుకొని బయలుదేరాను.

సమయానికి అమ్మకి రావటం వీలుపడక పోవటంతో తనకి సాయంగా తన అక్క సుభాషిణి మాతో పాటు వచ్చింది. అప్పటికే పది నిముషాలు అయ్యింది ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుని, ఇంకా ఆలస్యం అయితే ఏమవుతుందో అని భయంగా ఉంది. దగ్గర్లో ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ ఉంటే మాట్లాడదాం అని కారు దిగాను. ఎక్కడా కనపడలేదు. దూరంగా ఎక్కడో బడ్డీ కొట్లో సిగరెట్ తాగుతూ కనిపించాడు కానిస్టేబుల్.

కార్లో ఉన్న నా భార్యకి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. తన సౌకర్యార్థం కార్ అద్దాలు తెరిచి పెట్టడంతో, నొప్పితో తాను చేసే శబ్దాలు చుట్టుపక్కల వాహనాల వారందరూ వింటున్నారు.

ఒక బైక్ అతను వచ్చి, “ఏమైనా హెల్ప్ కావాలా?” అని అడిగాడు.

విషయం చెప్పాను. వెనుక ఉన్న తన స్నేహితుడిని దించి, ఎలాగోలా ట్రాఫిక్ తప్పించుకుని సిగ్నల్ వరకూ వెళ్ళి, ట్రాఫిక్ కానిస్టేబుల్ నీ పిలిచాడు. కారులో ఉన్న మా గురించీ, డెలివరీకి సిద్ధంగా ఉన్న పేషంట్ అని చెప్పటంతో పోలీస్ అతను వెంటనే వచ్చాడు.

మా పరిస్తితి చూసి, ఒక పక్క అంబులెన్స్ కి ఫోన్ చెయ్యమని చెప్పి, ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డాడు ట్రాఫిక్ పోలీస్. ఇందాక బైక్ లో వెళ్ళిన కుర్రాడు, అంబులెన్స్ కి ఫోన్ చేసి, లొకేషన్ చెప్పాడు. నాకు కంగారులో కాళ్ళు చేతులు ఆడటం లేదు. వీలైనంత తొందరగా ట్రాఫిక్ క్లియర్ చేశాడు కానిస్టేబుల్. వెంటనే అంబులెన్స్ వచ్చి, మా ముందు ఆగింది.

నా భార్యని అందులోకి తరలించారు. తను నొప్పులతో బాధ పడుతోంది. కానిస్టేబుల్ వైపు కృతజ్ఞతగా చూసాను. అంబులెన్స్ సైరన్ మోగిస్తూ ట్రాఫిక్ అడ్డు లేకుండా సాగింది. నా కారుని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా,

బైక్ వెనుక కూర్చున్న అతను, “కంగారు పడకండి, మీరు వాళ్ళతో వెళ్ళండి. కార్ నేను తీసుకుని వస్తాను” అని హాస్పిటల్ వరకూ నా కారులో మా వెనుకే వచ్చి, కార్ పార్క్ చేసి వెళ్ళాడు.

బైక్ అతని వైపు కృతజ్ఞతగా చూసి ధన్యవాదాలు తెలియచేశాను. చిరునవ్వు నవ్వి, “పర్వాలేదు సర్” అంటూ వెళ్ళిపోయాడు అతను.

హాస్పిటల్ స్టాఫ్ వెనువెంటనే ఆపరేషన్ థియేటర్ కి తీసుకుని వెళ్ళారు.

“నార్మల్ అయ్యే అవకాశం ఉంటే చేస్తాము, లేదంటే ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుంది” అంది లేడీ డాక్టర్ చెకప్ చేసి.

“సరే” అని, ఆపరేషన్ పేపర్ మీద సంతకం పెట్టాను.
మొదటిసారి టైం విలువ అర్థం అయ్యింది నాకు. నా భార్య ఎప్పుడూ చెప్పిన టైం కన్నా ముందే ఉండేది, నేను ఇంకా సమయం ఉంది కదాని నెమ్మదిగా పనులు చేసేవాడిని.

కానీ ఇప్పుడు కొద్దిపాటి సమయం ఆలస్యం అయితే ఏమయ్యేదో అని భయం వేసింది. నాకు సమయానికి సహాయ పడ్డ వ్యక్తులకు మళ్ళీ ఒకసారి మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇంకా మనుషుల్లో మానవత్వం నిలిచి ఉందని చెప్పటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏం కావాలి?

హాల్లో నేనూ, మా వదిన గారు అదే మా ఆవిడ అక్క కూర్చొని డాక్టర్ చెప్పే వార్త కోసం ఎదురుచూస్తూ ఉన్నాం, మధ్యలో ఫోన్లు మాట్లాడుతూ.

డాక్టర్ బయటకి వచ్చి, “కంగ్రాట్యులేషన్స్ ఆపరేషన్ అవసరం లేకుండానే నార్మల్ డెలివరీ అయ్యింది. ఆడపిల్ల, మీరు వెళ్లి చూడొచ్చు. ఆవిడకి కాస్త రెస్ట్ కావాలి. జాగ్రత్త!” అంది.

డాక్టర్ కి థాంక్స్ చెప్పి, లోపలకి వెళ్ళాను.

నా ఆనందానికి అవధులు లేవు. ఇద్దరం తల్లిని బిడ్డని చూసాము. పాపని చూడగానే ఎంతో ముద్దొచ్చింది. తన చేతి వేళ్ళని తాకగానే నా చేతిని పట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ స్పర్శ ఎప్పటికీ గుర్తుండిపోయేలా నా మనసులో నిలిచిపోయింది.

ఆ పాప స్పర్శ, నా భార్య నొప్పులు బాధ చూసిన నాకు వెంటనే అమ్మ గుర్తొచ్చింది. అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఎంతో సంతోషించింది, అలాగే తను దగ్గరలో లేనందుకు బాధ పడింది కూడా. మరో

బిడ్డకి జన్మనివ్వడం అనేది ఆడవాళ్ళకి పునర్జన్మ లాంటిది. దాదాపు మరణం అంచుల దాకా వెళ్ళి వస్తారు. కానీ బిడ్డని చూడగానే వాళ్ళు పడ్డ నొప్పులన్ని మర్చిపోతారు. అదే అమ్మతనం లోని కమ్మదనం అంటే.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!