విరిసిన వసంతం

విరిసిన వసంతం

రచన::వడలి లక్ష్మినాథ్

వసంత కళ్లు తెరిచి చూసేసరికి ఎక్కడున్నదో అర్థం కావడంలేదు. తనకి కొంచం ఒంట్లో బాగాలేని మాట వాస్తవమే. చుట్టూ పరిసరాలను పరిశీలించింది. అందరూ వృద్ధులు, లేవలేని వాళ్ళు…చుట్టూ మంచాల మీద పడుకుని వున్నారు. ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా గుర్తుకు రావట్లేదు…బహుశా, అనారోగ్యంతో ఎవరైనా ఆసుపత్రికి తీసుకొని వచ్చారా……కానీ, తానున్నది ఆసుపత్రి కాదు.

ఒకావిడ ఆయమ్మలాగా ఉంది, అందరినీ కంగారు పెడుతోంది, “ఇవాళ మన ఆశ్రమానికి సందర్శకులు వస్తున్నారు, తొందరగా లేవండి…అందరూ శుభ్రంగా తయారుకావాలి. మీ పాత దుప్పట్లు కనిపించకుండా లోపల పెట్టండి…..ఇదిగో ఈ మంచి దుప్పట్లు వేసుకోవాలి. అందరూ జుట్టు నున్నగా దువ్వుకోండి” అంటూ పక్క దుప్పట్లు అందచేస్తూ మరొక గదిలోకి వెళ్ళింది.

పక్క మంచం మీద ఉన్న ముసలమ్మ అంటోంది, “ఈవిడ వెళ్లాకా, మనకి మంచి బట్టలు పట్టుకొని, ఆవిడ వస్తుంది. ఈ చినిగిపోయిన, వెలిసిపోయిన బట్టల నుండి ఒక్క రోజైనా విముక్తి” అంటూ తన ఒంటి మీద నున్న చీరను తడుముకుంటూ.

“బట్టల గురించి ఎవరు ఆలోచిస్తారు…ఎంత మంచి బట్టలు కట్టినా, మంచం మీద పడుకోవడమేగా! ఈ రోజు మంచి భోజనం తినవచ్చు. చాలా రోజులైంది…. సందర్శకులు వచ్చి, నోరు చచ్చి పోయింది. ఎన్నాళ్ళయిందో మంచి ఆహారం తిని” అంటోంది ఇంకొక పెద్దావిడ.

“అవును ఈ రోజు స్వీట్ కూడా పెడతారు. వస్తున్నది ట్రస్ట్ చైర్మన్ అనుకొంటాను…. బాత్రూములు అన్నీ
శుభ్రంగా కడుగుతున్నారు. మనకి ఓపిక లేక, మనని
పిల్లలు చూడలేక ఇక్కడ పెట్టారు…..నాకు ఓపికున్న రోజుల్లో, మా ఇంట్లో నేను ఎప్పుడూ బాత్రూము కడుక్కున్నాకనే స్నానం చేసేదాన్ని. ఈ బాత్రూములో అసలు అడిగే పెట్టలేము” వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు.

వసంత కేమీ అర్దం కావట్లేదు…..పక్క మంచం మీద ఉన్న ముసలమ్మని అడిగింది….”నేను
ఎక్కడ ఉన్నాను, ఇవాళ ఏమిటి ప్రత్యేకం” అని.

“మీరు కొత్తగా వచ్చారుగా….ఇది ఆపత్బంధు
అనాధాశ్రమం ….నిన్ననే మీ పిల్లలు మిమ్మల్ని ఇక్కడ దింపి వెళ్లారు” అంది.
వసంతకి ఏ విషయము గుర్తుకు రావడం లేదు.

“ఈ రోజు మన ఆశ్రమానికి సందర్శకులు వస్తున్నారు…..మనకి మంచి భోజనము, వస్తుంది. మీరు అదృష్టవంతులు….వచ్చిన రోజే ఇలా మంచి ఆహారం …రోజూ ఇలాగే ఉంటుందని ఆశించవద్దు”
అని చెబుతున్న ముసలమ్మ పక్క గదిలో నుండి మాటలు వినిపించడంతో, అందరూ అటు వైపు చూడసాగారు.

“అమ్మ గారు వస్తున్నారు అందరూ నిశ్శబ్ధంగా ఉండండి…ఆయమ్మ అరుపుతో అందరూ ఆవిడ వైపు చూస్తున్నారు.
కొంతమంది పరిచారికలను వేసుకొని మహారాణి లాగా వస్తోంది, ఆ ఆశ్రమ మేనేజర్. బాగా నునుపు దేలిన శరీరం మంచి కండ పట్టి, ఆరోగ్యంగా ఉంది.

“అందరికీ గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారుకదా!” నవ్వుతూ పలకరించింది.

అందరూ ఒక్కసారిగా “గుడ్ మార్నింగ్ మేడమ్, బాగున్నాము” అన్నారు.

“అందరూ తొందరగా శుభ్రంగా తయారై, కిందకు రావాలి…..పడుకునే మంచాలన్నీ నీట్ గా సర్దుకోవాలి…..కింద ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే నవ్వుతూ సమాధానం చెప్పాలి.
రోజూ మీకు ఇలాంటి ఆహారమే పెడతారా! అని వచ్చినవాళ్ళు అడగవచ్చు, ‘అవును’ అని సమాధానం చెప్పాలి.
మీకు ఇక్కడ సౌకర్యంగా ఉందా? అని అడుగుతారు.
‘ఇంటి కంటే ఇక్కడే బాగుంది’ అని చెప్పాలి.
అంటూ వసంత వైపు చూస్తూ, ఈవిడేనా కొత్త అడ్మిషన్?” అని అడిగింది.
“అవును మేడమ్, నిన్ననే వచ్చారు” చెప్పింది పక్కనే ఉన్న ఆయమ్మ.

“అన్నీ వివరంగా చెప్పి, ఆవిడని కూడా తీసుకొని కిందకు రండి” అంటూ ముందుకు సాగిపోయింది ఆ బృందం.

******

అందరూ తయారై వసంతను తీసుకొని కిందకు వెళ్ళారు.
అది పెద్ద ఆశ్రమంలా వుంది…..చాలామంది వృద్ధులు ఉన్నారు. కొంతమంది వీల్ చైర్ లో కూడా ఉన్నారు. స్త్రీలు అధికంగా ఉన్నారు. వసంతకి గుర్తుకు వస్తోంది, తను హాస్టల్ వార్డెన్ గా పని చేసినప్పుడు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి, అందరి మన్ననలు పొందేది.

ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ,” ట్రస్ట్ నా తల్లితండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినందున, ఎవరికీ ఎటువంటి అసౌకర్యం జరగకుండా చూడాలి. ఆశ్రమంలో ఇప్పుడున్న పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నాయి…..ఇలాంటి నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలి…..వృద్ధుల మౌలిక సదుపాయాలకు ఎటువంటి నిధులు కావాలన్నా మంజూరు చేస్తాము” అంటూ ఏ ఏ ఖర్చులకు ఎంత నిధులు విడుదల చేస్తున్నదనే వివరిస్తున్నారు.

చివరగా “ఇక్కడ ఉన్న సదుపాయాలకు
మీరు తృప్తిగా ఉన్నారా?” అని అడిగారు.

దానికి వృద్ధులు ” మాకు రోజూ ఇలాంటి ఆహారం, బట్టలు ఇవ్వడంతో మేము తృప్తిగా ఉన్నాము” చెబుతున్నారు.

“ఇది అన్యాయం….ఇక్కడ రోజూ ఇటువంటి సదుపాయాలు లేవు….నేను కూడా హాస్టల్
వార్డెన్ గా చేసాను. నాకు తెలుసు వీళ్లు మీరిచ్చిన నిధులన్నీ ప్రక్కదోవ పట్టిస్తున్నారు”….చెప్పుకొని పోతోంది వసంత.

పక్కనే ఉన్న ఆయమ్మలు గ్రహించి వసంత నోటిని రెండు చేతులతో మూసేసి పక్కకు లాక్కెళ్ళిపోతున్నారు.

వసంత గట్టిగా అరవాలని గొంతు పెకిలించుకొంటోంది….. గొంతు రావడం లేదు.
వసంత పెనుగులాడుతోంది…ఊపిరి కూడా అందట్లేదు….ఏలాగైనా నిజం చెప్పాలని నానా హైరానా పడుతోంది.

అంతలో ఏదో ఆపన్న హస్తం తనని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. తలుపు కొడుతున్నారు…..తలుపు తియ్యమని.

ఆ మనిషి అందర్నీ తప్పించుకొని వచ్చి
“మేడమ్ …మేడమ్ “అంటున్నారు.

తెలుసున్న గొంతులాగే ఉంది, అవును అది కీర్తన, తన పి ఎ గొంతు.
“మేడమ్ నేను కీర్తనని, ఏమైయ్యింది? ఇంత పొద్దెక్కే వరకు నిద్ర లేవలేదు. తలుపు ఎంత కొట్టినా తియ్యడం లేదు. ఈ కిటికీ తెరచి ఉండడంతో చూడడానికి వస్తే మీరు ఎందుకో ఇబ్బంది పడుతున్నారు” అంది.

ఒళ్ళంతా చెమటలతో కళ్ళు తెరిచింది వసంత.

నెమ్మదిగా వెళ్ళి తలుపు తెరిచింది.

“మేడమ్ ఈ రోజు మన హాస్టల్ కి మినిస్టర్ ప్రోగ్రాం ఉంది కదా…మీరు ఇంకా హాస్టల్ కి రాకపోయే సరికి నేనే మీ క్వార్టర్ కి వచ్చాను…….మీ ఆరోగ్యం బాగాలేదనుకొంటాను……ఒళ్ళంతా చెమటలు….. డాక్టర్ కి ఫోన్ చెయ్యమంటారా?” అడిగింది కీర్తన.

“అవసరం లేదు….ఏదో పీడకల .
నేను పది నిమిషాల్లో తయరయ్యి అక్కడ ఉంటాను” అంది ముక్తసరిగా.

“తొందర లేదు. అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పిల్లలందరినీ ఎలా మాట్లాడాలో కూడా తర్ఫీదు ఇచ్చాము…వాళ్ళకి చాక్లెట్ కూడా తెచ్చి చూపించాము. మనం చెప్పినట్లుగా సమాధానం చెబితే, తర్వాత ఇస్తానని” చెప్పుకుపోతోంది కీర్తన.

“మీరు బయలుదేరండి….. నేను వస్తున్నాను” చెప్పి కీర్తనను పంపించేసింది వసంత.

వసంత వెళ్ళేసరికి అన్ని ఏర్పాట్లు పద్దతిగా జరిగిపోయాయి…..అధికారులు రావడానికి సమయం ఉండడంతో, పిల్లలతో కలిసి ఉపాహారం చెయ్యడానికి కూర్చుంది వసంత. పిల్లలు ఆబగా తింటున్నారు…

“మేడమ్, మీరు చెప్పినట్టు రోజూ ఇలాంటి ఆహారం పెడుతున్నారని వచ్చిన వాళ్ళకి చెపుతాను” అంటోంది ఎనిమిదేళ్ల హారిక.

“చెప్పడం కాదమ్మా! రేపటి నుండి మీకు ఎటువంటి లోటూ ఉండదు….రోజూ ఇలాంటి భోజనమే పెడతాము” అంటూ దగ్గరకు తీసుకొని నుదిటి మీద ముద్దు పెట్టుకొంది వసంత.

***

You May Also Like

One thought on “విరిసిన వసంతం

  1. కథనం చాలా బాగుంది. తన దాకా వస్తే గాని భాధ ఎంటో తెలవదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!