ఆశల వలయం

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

ఆశల వలయం

రచన: పద్మజ రామకృష్ణ.పి

ఒక ఆడపిల్ల పుట్టగానే నీకు పెళ్ళాం పుట్టింది అంటూ వరసైన వారితో వరసలు కలుపుతూ పెద్దలు చేసే తాత్కాలిక తప్పులు పిల్లల జీవితాలకు శాశ్వత ఆశలు రేపుతాయి,అవి వాళ్ళ జీవితం మొత్తం మీద ఒక్కోసారి నిరాశ నీడలుగా మారతాయి..!!

మన రాము కథ అలాంటిదే

రాము అక్కకు ఆడపిల్ల పుట్టింది..అందరు’రేయ్’ నీకు పెళ్ళాం పుట్టింది అని నవ్వుకున్నారు..ఆ నవ్వుల మాటున మాటలు నిజమే అవ్వాలి అని రాము మనసులో అప్పుడే నాటుకుపోయింది.. పిల్లపేరు మాధురి అని పెట్టారు..

రాము 10వ తరగతి వరకు చదివి,చదవాలి అనే ఇంట్రస్ట్ లేక పనిలో చేరాడు..

కాలం వేగంగా జరిగింది..మాధురి ఓణి ఫంక్షన్ వచ్చింది’అప్పుడు కూడా అవే నవ్వులు అందరిలో ‘రేయ్’రాము నీ పెళ్ళానికి ఏం పెడుతున్నావు అని..  బంధువులు ఎవరికి తెలియకుండా,తల్లికి మాత్రమే తెలిసేలా ఒక ఉంగరం కొన్నాడు మాధురి కోసం..

‘ఫంక్షన్ బాగా జరిగింది’అక్కడ కూడా మరో తాత్కాలిక తప్పు చేశారు మాధురి పెద్దలు..
రాము పక్కన మాధురిని నిలబెట్టి కాబోయే మొగుడు పెళ్లాలు అంటూ నవ్వుకుంటూ స్పెషల్ గా ఫోటోస్ తీయించారు..

రోజులు గడుస్తున్నాయి..మాధురికి పెళ్లి వయసు వచ్చింది..

రాము’మాధురి మీద వెలకట్టలేని ప్రేమను పెంచుకున్నాడు,సెలవు దొరికిన ఖాళీ టైమ్ మొత్తం అక్క ఇంట్లో గడపడం మొదలు పెట్టాడు మాధురి కోసం..

“రాము పుట్టినరోజు సందర్భంగా”వాళ్ళ అక్కను ఇంటికి పిలిచాడు,మాధురి కూడా వచ్చింది” ఎప్పటికైనా మాధురి నుదుటిపై సింధూరం దిద్దేది నేనే కదా అనే భావనలో మాధురికి బంగారు బొట్టుబిళ్ళను కానుకగా ఇచ్చాడు రాము..ఇలా ఎన్నో ఆశలతో బంగారు కలలు కన్నారు ఆ ఇద్దరూ!

అనుకోకుండా రాము అక్కవాళ్ళ ఇంటి నుండి ఫోన్ వచ్చింది,అవతల రాము”అక్క గొంతు”అమ్మా..పిల్లకు సంబంధం కుదిరింది అని.. మాధురికి పెళ్లిచూపులకు వచ్చిన ఆ అబ్బాయి బాగా నచ్చాడు,రాముకంటే అందగాడు,బాగా
డబ్బున్నవాడు కావడంతో మాధురి కూడా పెళ్లికి ఒప్పేసుకుంది

మాధురికి నిశ్చితార్థం రోజు,రాము ఏమి తినకుండా, పడుకుని మెలికలు తిరుగుతూ పొట్టపట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు

ఎందుకు.?ఏడుస్తున్నావు అని తల్లి అడిగితే,భరించలేని కడుపు నొప్పిగా ఉంది అని చెప్పాడు రాము

అది కడుపు నొప్పి కాదు..కట్టుకున్న ఆశలసౌధం కుప్పకూలిపోయి పేగులు తెగిపోయాయి,తన బాధకు కారణం ఏం చెప్పాలో అర్థంకాక అలా చెప్పాడు తల్లితో రాము నన్ను కూడా ప్రేమించింది అనుకున్నాను మాధురి.!
ఇలా ఎందుకు చేసింది.!అని మాధురి ఆలోచనలతో కాలం గడుపుతున్నాడు రాము

మాధురి ఇంతలా నన్ను ఎలా మర్చిపోయింది!అని తలవని రోజంటూ లేదు రాముకి

అనుకోకుండా ఒక గ్రీటింగ్ కార్డ్ వచ్చింది రాముకి,అది లవ్ గ్రీటింగ్’మాధురి పంపింది రాము కోసం,అది కూడా తనభర్త పేరు మీద అతను పంపినట్లు పంపింది

నాలాగే మాధురికి కూడా నా మీద విపరీతమైన ప్రేమ ఉండి పెద్దలకు ఎదురు చెప్పలేక తల వంచిందేమో!లేకుంటే పెళ్ళి తరువాత కూడా ఇలా గ్రీటింగ్ ఎందుకు పంపుతుంది!అనుకున్నాడు మనసులో రాము..ఇప్పుడింకా మాధురిపై ప్రేమాభిమానాలు రెట్టింపు అయ్యాయి రాముకి

కాలం మరో రెండేళ్లు గడిచింది”రాముకి కూడా పెళ్లైంది.భార్యపేరు వనజాక్షి “వనజాక్షి మాధురి కంటే కూడా అందమైనదే కాని రాము మనసుకి ఎప్పుడూ గొప్పగా అనిపించేది కాదు,ఎందుకంటే తన మనసంతా మాధురి మధురస్మృతులతో నిండిపోయింది కాబట్టి

బంధువులు ద్వారా వనజాక్షికి భర్త విషయాలు మొత్తం తెలిసిపోయాయి..

పెద్దవాళ్ళు చేసిన తప్పుకి భర్త బలైపోయ్యాడు అనుకుంది వనజాక్షి,మరి పెళ్లైపోయాక కూడా మాధురి ఎందుకు అలా గ్రీటింగ్ పంపిందో అర్థం కాని ప్రశ్నగా.?మిగిలింది వనజాక్షికి

తెలియని పసిమనసుల్లో ప్రేమ పుడితే వాళ్ళకు పెళ్లిళ్లు అయ్యాక కూడా ఆ ప్రేమ చావదా.?భర్త ఉండగా మరో వ్యక్తిమీద ప్రేమను ఆడవాళ్లు మనసులో ఎలా దాచగలరు.?ఏంటి ఇదంతా!ప్రేమించిన మనిషికి ఇచ్చే విలువ,హృదయంలో ప్రేమకు ఇచ్చిన స్థానం తిరిగి మగవాళ్ళు భార్యకు ఇవ్వలేరా.?ఇలా ఎన్నో అర్థం కాని ప్రశ్నలు వనజాక్షి  బుర్రలో తిరిగాయి..జీవితం అంటే ఇంతే ఏమో!అనుకున్నది జరగదు,కోరుకున్నది దక్కదు..హ్మ్మ్
అనుకుంది వనజాక్షి..

బంధువుల ఫంక్షన్ లో కలిశారు”మాధురి ఫ్యామిలీ,రాము ఫ్యామిలీ,విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే ఎంత నరకమే భర్త కళ్ళల్లో కనిపెట్టింది వనజాక్షి

రాము బాధని చూసిన వనజాక్షికి కొద్దిగా బాధను, ఎక్కువగా కోపాన్ని కూడా తెచ్చిపెట్టాయి.. ఎన్నో పూజలు చేసి భర్తను కోరుకుంటే,భార్యను సంపూర్ణంగా ప్రేమించలేని భర్తను ఇచ్చావు దేవుడా అని మనసులో అనుకుంటూ,ఫంక్షన్ ముగించుకుని ఇంటికి బయలుదేరారు.. .రాము మాత్రం విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే కలిగే బాధ నుండి ఒకరోజంతా తేరుకోలేకపోయాడు “మాధురి ఎప్పుడు ఎదురైనా ఇదే పరిస్థితి రాముది తాత్కాలికంగా తప్పులు చేశారు పెద్దలు,శాశ్వతంగా ఆశపడ్డారు పిల్లలు.”తెలిసితెలిసి మరోసారి తప్పులు చెయ్యకండి “పెద్దలారా..!ఎదిగాక ఎప్పుడో జరిగే కళ్యాణం కోసం ఎగతాళిగా పిల్లలముందు ఎప్పుడూ మాట్లాడుకోకండి,చిన్నపిల్లల బంగారు భవిష్యత్తు పై ఆశల వలయం విసరకండి.

.సమాప్తం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!