పండుగ శోభ

పండుగ శోభ

రచన: పి. వి. యన్. కృష్ణ వేణి

ప్రేమ నిండిన హృదయాలతో,

ఆశ నిండిన కన్నులతో,

మదినిండా ఆనందం నింపుకుని ఎదురు చూస్తున్నాను.

నీ రాకకై, నీ స్పర్శకై,  నీతో గడిపే ఆ క్షణంకై…

నువ్వు ఎప్పుడు మన ఇంట అడుగుపెడితే,

అప్పుడే నాకు పండగ, మనసుకు ఆనందం,

మదికి పులకింత, మన ఇంటికి పండగ శోభ.

నీకై ఎదురు చూసి చూసి నా కన్నులు కాయలు కాశాయి.

నీ మది నిండా మాతృభూమి పై ప్రేమ,

నాకేమో నా కడుపు తీపి పై మమకారం.

నలుగురితో నా కొడుకు వీర సైనికుడు అని చెప్పి మురిసిపోయినా,

నువ్వు ఎలా తిరిగి వస్తావో అని,

అనుక్షణం నా మనసు పడే ఆ బాధను

ఎవరికీ చెప్పుకోలేక,  నాలో నేనే కుమిలిపోనా!!!

మదిలో ఆనందం లేనిదే… ఇంకా ఈ ఇంట్లో  పండగ ఎక్కడ?

అందుకే నిన్ను చూసిన ఆ నిమిషం,

నువ్వు నాతో ఉన్న ప్రతిక్షణం,  నాకు ఓ పండగే.

తల్లిగా నేను, నీ పై ప్రేమ చంపుకోలేక పోతున్నా,

అందుకే నువ్వు తిరుగు ప్రయాణంలో వెనుదిరిగి చూడకు,

నన్ను చూసి, నా బాధను చూసి, నువ్వు వెనుకంజ వెయ్యకు.

నా కన్నీటి ధారలే నీకు ఆశీర్వాదాలు.

నీకు ఎల్లప్పుడూ విజయం చేకూరుతుంది.

ఆ విజయ దరహాసంతో…. నువ్వు నా ముంగిట నిలువు.

ఆ నిమిషాన జయ హారతి నీకు ఇస్తాను.

అప్పుడే నిజమైన పండగ పండుగ జరుపుకుందాం,

ఒక్క మన ఇంట్లోనే కాదు, దేశమంతటా వెల్లివిరియాలి పండుగ శోభ.

అదీ ఆ మాతృభూమి,  ఈ పుణ్యభూమి ఆశీర్వాదంతో….

నిజమైన పండుగ జరుపుకుందాం అందరం.

మన ఇంటితో కలసి దేశమంతటా పండుగ శోభ వెల్లి విరియాలి…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!