బ్రతుకు ప్రయాణంలో కొత్త మలుపు

బ్రతుకు ప్రయాణంలో కొత్త మలుపు

రచయిత :: సౌజన్య

కన్నతల్లి వంటి పల్లెను విడవలేక విడిచి వచ్చిన వలస బతుకుల తిప్పలు
శ్రమనే నమ్ముకుని రోజు కూలీలుగా మారి బతుకీడుస్తున్న వారి గుండె దీపం ఆరిపాయే
నేడు పట్నం సవతి ప్రేమనే చవి చూపే
పని లేదని పొమ్మంటూ మొండిచేయి చూపే

రగిలే ఆకలి మంటల్లో ఆవిరైపాయే ప్రాణాలపై ఆశలు
వర్ణించలేని విధి వెలివేసిన ధీనమైన బతుకు చిత్రం
బతుకు తెరువు లేక అలసిన ఆ మనుషుల నెత్తుటి ధారలతో తడిచిన దారంతా ఎర్రని తీవాచిలా మారే
సమయంకై కాచుకుని వున్న కరోనా భూతం వికటాట్టహాసంతో వికృత చేష్టలతో విజృభించే
చిగురుటాకు ఆశలకు ఘోరీ కట్టీ బతుకు జీవుడా అని సాగే ప్రయాణం రెక్కలు తెగిన పక్షిలా మారి దిక్కులేక నడిరోడ్డు పాలాయే

మండుటెండలో డొక్కలు ఎండి పాయే చెమటచుక్కలే సోపతాయే
కాలే పాదాలు కాలంతో అడుగులేయలేమని మొరాయించి రహదారిలోనే సొమ్మసిల్లిపాయే
కళ్ళ చెమరింతే దప్పిక తీర్చే
చిన్నా పెద్దా ముసలీ మూక ఒకరికొకరు తోడుగా చీమల దండుగా కదిలే ఈ ప్రయాణం ఏ మలుపులో ఎవరి దారి ఎటువైపు సాగునో చివరికి…

జ్వలిస్తున్న మారణహోమంలో చిన్నా భిన్నం అయిన వలస జీవితాల వేదన తీర్చుటకు మంచిమనిషిలా మనసును మేలుకొలుపు మిత్రమా
మానవత్వంతో మసులుకో నేస్తమా
మనకున్న అంతలో కొంతైనా సాయం చేస్తూ
వలసెల్లే కష్టజీవులకు చేయూత నివ్వు

వారి మనోధైర్యం మసక బారనివ్వక నేటి కష్ట నష్టాలు శాశ్వతం కాదని మంచి రోజులు ముందున్నాయని భరోసానివ్వు
వారి బతుకు ప్రయాణం సుగమనం కావాలని ఆశిస్తూ నేటికి వీడ్కోలు పలుకు
ఇక రేపటికై మనందరి ఆశల ఎదురు చూపులు…
బ్రతుకు ప్రయాణంలో మంచి మలుపుకై…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!