ఏమని చెప్పేది నా చిట్టి తల్లికి

ఏమని చెప్పేది నా చిట్టి తల్లికి

రచయిత :: నామని సుజనాదేవి

ఏమని చెప్పేది నా చిట్టి తల్లికి
పాలుంచుకుని, పోతపాలు పట్టడానికి
గుండెల వెనక గుండె ధైర్యం గుట్టు చెప్పని
ఉప్పొంగే కన్నీటి సముద్రాలున్నాయని ఎలా చెప్పేది ?

వదిలేసి వెళుతున్న ఈ క్షణమే తనను చూసే
చివరి క్షణమయినా కావచ్చని
ఎలా ఏమని చెప్పేది చిట్టితల్లికి ?

రేపనేది ఉంటుందో ..ఉన్నా చూసే స్థితి
ఉంటుందో ఉండదో నని
ఎలా ఏమని చెప్పేది చిట్టితల్లికి ?

తనలాంటి ఎందఱో చిన్నారుల వెతలను దూరం చేయాలని
కోరి మృత్యు కుహరం లోకి అడుగుపెడుతున్నానని
కనిపించని శత్రువుతో పోరాడడానికి
కన్నబిడ్డ కంట నీరు పెట్టినా కరగని పాషాణం గా మారానని
ఎలా ఏమని చెప్పేది చిట్టితల్లికి?

నిమిషాలు, గంటలు కాదు రోజుల తరబడి
ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే ఆ గడియ కోసం
మొక్కని దేవుళ్ళు లేరని ఎలా చెప్పేది చిట్టితల్లికి?

కళ్ళు కాయలు గాసేలా
కంటి చూపులు గుమ్మానికతికించి
కడుపెండ బెట్టుకుని ఎదురుచూసే
కంటిపాప కు కనబడితే కరుచుకుపోతుందని
కంటికి కనబడకుండా దాచుకోవడాని కెన్ని
గుండెల్ని అరువు తెచ్చుకోవాలో ఎలా చెప్పేది చిట్టితల్లికి?

అయినా ఒక్కటి మాత్రం తధ్యమని చెప్పగలను
కటిక చీకటిలో ఎప్పటికయినా కాంతిరేఖ విరియక తప్పదని
కాలకూట విషం తర్వాత అమృతం వచ్చినట్లు
రాలిన ఆకు స్థానంలో చిగురు వచ్చినట్లు
నేటి ఓటమి రేపటి జయానికి మెట్టు అని
చీకటి తర్వాత తప్పక వెలుగు వస్తుందని
అలుపెరుగని పోరాటం విజయానికి నాంది అని .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!