చల్లని తల్లి

చల్లని తల్లి

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

“రేతిరి వరకు పని పాట లేకుండా ఆ పోకిరి ఎదవలతో తిరిగి ఇంటికొచ్చి ఏటోండినావు పెట్టు అంటున్నావే. పప్పు చారేట్టా తిని తొంగో”. అన్న నూకాలు మాటలకి పదో క్లాస్ పదిసార్లు పోయిన శ్రీనుగాడు “ఏటి చారాన్నం తిని తొంగోవాలా” అని   తల్లని చూడకుండా బూతులతో తిట్టాడు. వెంటనే  “తాగి, తాగి నీ అయ్య నీ చావు నువ్వు చావని రెండేళ్ళ క్రిందట చచ్చాడు”.
“సదువుకుని నువ్వు బాగు పడతావనుకుంటే ఆ ఎదవలతో చెడు తిరుగుళ్ళు తిరిగి పదో క్లాస్ పాసవలేదు”. నా బతుకింతే అని నూకాలు భాధ పడింది. “ఒసే నూకాలు” అని పక్కనే ఉన్న లచ్చి “మగాడే వాడెప్పుడయినా వస్తాడంటూ” చేపలపులుసు, ఉల్లిపాయ సత్తుగిన్నెలో తెచ్చి తినరా శ్రీనుగా అని తెచ్చిపెట్టింది.
“మా బంగారు అత్త! నీవు నయం నా గురించి పట్టించుకున్నావు” అంటు అవురావురని చేపల పులుసు బువ్వ తిన్నాడు శ్రీనుగాడు. వెంటనే పడుకుంటే నూకాలు, లచ్చితో “వాడ్ని పొగుడుతు వెనుక వేసుకొస్తున్నావు అందుకే వాడికి బుద్ధి రాలేదు” అంటే “అది కాదే నూకాలు నాకా ఎవరులేరు నీ మొగుడు తాగి తాగి నీ బతుకు నాశనం చేసాడు”. పోనీలే వీడు చదువు కుంటే సుఖపడొచ్చనుకుంటే వీడు పక్కదారి తొక్కుతున్నాడు. ఏమనుకోకె దెబ్బలాడితే రెచ్చిపోతారు వయస్సులో ఉన్నారు. అందుకే నేనలా అన్నాను”. “రేపు కొత్తమావాస్య నూకాలమ్మకి ఉపారాలు పెట్టి సల్లగా సూడు అని వేడుకుంటే నీ శ్రీను గాడి బతుకు బాగుపడుతుంది.” అంది లచ్చి. “ఏటి అమ్మకు ఎంత చేసాను నా పెనిమిటి తాగడం మానేడా! ఉన్నన్నాళ్ళు సంపుకు తిన్నాడు. మన బతుకిలింతే ఒదిన అంది”. “అది కాదే నూకలమ్మతల్లి చల్లని తల్లి నేను చెబుతున్నా నేను వాడి బతుకు బాగుపడాలని మనం రెండు పూటలా గంజి తాగేటట్లు చెయ్యమని మొక్కుతున్నా దిగులు పడమోకే జీవితం బాగుంటాది అంది”. “వెంటనే నూకాలమ్మ పేరు మా అయ్య పెట్టాడు అందుకే నా రాత ఇలా ఉంది అంటే”. “తప్పే పెద్దముండని చెబుతున్నా చూడు ఈ పాలి అమ్మ దయచూపుతుంది” అంటే “ఆ.. అని మన బతుకులు ఏం చేసినా బాగు పడవు. ” అని వస్తా పడుక్కో అర్ధరేతిరి అయింది. సూరీడు రాకముందే పనుల్లోకి పోవాలి అంది నూకాలు.
కొత్త అమావాస్య నాడు అనకాపల్లి నూకాలమ్మ జాతరలో లచ్చి, నూకాలు కొడుకును నూకాలుతో సహ తీసుకెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చిన మరునాడే లచ్చి పనిచేసే ఇంటి యజమాని చౌదరి గారితో శ్రీను గురించి చెబితే “నా కంపెనీలో వాడికి ఉద్యోగం ఇస్తాను. ముప్ఫై ఏళ్ళయి తల్లిలా మా ఇంట్లోనే చేస్తున్నావు.” అని చెప్పగానే “ఒసే నూకాలు అని వచ్చిన అత్త లచ్చిని చూసి “ఏటయినాదత్త అని శ్రీను గాడడిగితే” “ఒరే నువ్వు ఉన్నావా! అంటే “అవునే నిన్న అమ్మ వారి దగ్గర ఒట్టేసాను అమ్మని సుఖపెట్టాలని పని వెతుక్కుంటా అన్నాడు”. “ఒరే నీవనుకున్నది నిజమే, ఆ చల్లని తల్లి మన మొర ఆలకించినాది. నీకు ఉద్యోగం మా యజమాని ఇస్తానన్నాడు.” రా.. రా అంటుండగానే నూకాలు పని నుంచి వచ్చి విని.. ‘తల్లి కరుణించింది అని అనుకున్నది’
చౌదరి గారి ఇంటికి వెళ్ళిన శ్రీనుతో ఆయన “నెలకు ఆరువేలు ఇస్తాను. దసరాకి బోనస్ ఏడాదికి రెండు జతల బట్టలు ఇస్తాను. బాగుంటే ఏడాదికి పనిని బట్టి జీతం పెంచుతానంటే” శ్రీను సంతోషంగా ఒప్పుకుని. ఇంటికి రాగానే “అమ్మా ఈ రోజు నుంచి నువ్వు పనిమానెయ్యి నాకు నూకాలమ్మ తల్లి దయవల్ల ఉద్యోగం వచ్చిందే. అత్త లచ్చి దయవల్ల”  అంటుండగానే, “ఏటిరా! నూకలమ్మతల్లి చల్లని తల్లిరా!. అమ్మని సుఖపెట్టరా! దానికి మీ అయ్య వల్ల సుఖంలేదు. నీవైన సుఖపెట్టు అంతా! ఆ తల్లి దయ అంతే”. “అత్తా! నీ కెవరున్నారే మాతో పాటు నువ్వు ఉండు నిన్ను కూడా చూసుకునే బాధ్యత నాదే, మా పాలిట నీవు అమ్మోరువే” అని లచ్చి కాళ్ళకు దండం పెడితే “ఒరే శీను నా ఆయుష్షు పోసుకుని మంచిగా బతకరా! అన్నప్పుడు నూకాలు కంట నీరు ప్రవాహమైతే ఊరుకోవే ఎర్రి బాగులదాన! కొడుక్కి రెండేళ్ళలో పెళ్ళి చేసి పిల్లా, పాపలతో బాగుండు. నన్ను మాత్రం మరచిపోకండి అని నవ్వుతూ లచ్చి ఆ చల్లని తల్లి దయ అందరిపై ఉంటుంది అన్నప్పుడు ఆప్యాయతతో శ్రీనుగాడు అత్త చేతిని తీసుకున్నాడు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!