విద్యా దానం

విద్యా దానం

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : అద్దంకి లక్ష్మీ

“ఏమే! మంగీ! ఇంత ఆలస్యంగా పనిలోకి వచ్చావ్? ఏంటి? నీ గురించి నేను వెయిట్ చేస్తున్నాను ఇందాకట్నుంచి, వస్తావో రావో అని” అంది సుశీల. పేపర్ చదువుకుంటూ అప్పుడే వచ్చిన మంగిని చూసి, “అవునమ్మ గోరూ! ఈరోజు నాకు చాలా కట్టమైపోనాది, ఏం సెప్పమంటోరు, రేతిరి ఒళ్లంతా దెబ్బలు తిని, నేవనేక పోయాన మ్మగారు” అంటూ ఏడుపు మొహం పెట్టింది మంగి.
“ఏమైందే? ఎప్పుడూ ఏదో ఒకటి”, అంటూ  విసుక్కుంది సుశీల. “అవునమ్మా గోరు, ఓ విషయం ఉన్నాది. ఎప్పటినుంచో సెప్పుకోవాలని మనసులో ఒకటే ఉబలాటం. మా లచ్చిమి ఉన్నాది గందా, దానికి నిండా పదేళ్లు నేవమ్మా, బడికి పోతాది, సదువుకుంటాది గందా ఐదో క్లాసు, మా వోడికి నాకు జగడామవుతాది ఈ పిల్ల ఇచయంలో, ఆ తాగుబోతు ఎదవనాయాలు ఒకడున్నాడు, ఆడికి మా పిల్ల మీద కన్ను పడిందమ్మ గోరు ఆడు అత్తమానం సతాయిత్తన్నాడు. ఆడుకో కుంటి ఎధవ పిల్లోడు ఉన్నాడు. ఆడికి సదువు సంధ్య లేదమ్మ , ఆ పిల్లోడికి మా పిల్లనిమ్మని ఊరికే సతాయిత్తన్నాడు. నాను ఆ పిల్లదాన్ని చదివించుకోవాలని ఎంతో ఆశపడతన్నాను. నా బతుకు ఇలా బండలా అయింది కదా! లచ్చిమి బాగా సదువుతుందని ఆళ్ళ టీచరమ్మ సెప్పింది. అది సదువుకుంటే దాని జీవితం బాగవుతాది కదమ్మా” అంటూ మంగి తన సోది చెప్పుకుంది.
“అవునే మంగి !అయినా ఇప్పుడు దానికి 12 ఏళ్లు ఐదో క్లాస్ చదువుతోంది ఇప్పటినుంచి పెళ్లంటే మీకు ఏమైనా బుద్ధి ఉందా!
“అందుకనే గందా అమ్మ గోరు! మా వోడికి నాకు జగడాలు ఆడో ఎదవ, ఆ ఎదవ మాటలు పట్టుకుని పిల్లని ఆడు బహుశా డబ్బు ఇస్తానని ఉంటాడు. ఆ డబ్బుకి ఆశపడి పిల్ల నమ్మేద్దామని చూస్తున్నాడు దొంగ నాయాలు. “నేనైతే సత్తినా ఒప్పుకోనని చెప్పాను.” ఆడికి నా మాట మంట రేగింది.
“అయితే ఓ పని చేయవే నాకు ఉపాయము తట్టింది”. మీ లక్ష్మిని మా ఇంట్లో పనికి కుదిరిచ్చే నేనే దానికి అన్ని చూసుకుంటాను నా పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అయ్యగారు నేను ఇద్దరమే కదా!.మాకు సహాయంగా ఉంటుంది. పనులు చేసి వెళ్లి స్కూల్లో చదువుకొని వస్తుంది. నేను కూడా దానికి చదువులో సహాయం చేస్తాను. నేను చదివిస్తాలే దానికి కావలసిన పుస్తకాలు డ్రెస్సులు కొనిబాగా చదువుకుంటే కంప్యూటర్స్ కోర్స్ కూడా నేర్పిస్తాను. దాని కాళ్ళ మీద అది బతుకుతుంది తర్వాత పెళ్లి మాట చూద్దాము కంగారు లేదు. మిగతా ఇద్దరు మగ పిల్లల్ని మెల్లిగా చదివించుకో ఆడపిల్ల జీవితం నాశనం చేయమాకు మగ పిల్లలు అయితే కూలో నాలో చేసుకుని బతుకుతారు.
“అట్టాగేనమ్మ అదే నా బాధ, నాకు నాగా నానావత్తలు పడకూడదు. మీరు మంచిగా సెప్పినారు పిల్లని మీ కాడ వదిలేత్తాను, కానీ మా మావోడు ఒప్పుకోడు గందా! నా నేటి సేయాల?”
ఏం పర్వాలేదు మీ ఆయన్ని ఒకసారి మా ఇంటికి పంపించు, నేను మాట్లాడతాను, వినకపోతే భయపెట్టి వాడిని లొంగదీస్తాను”, నువ్వేమీ బాధపడకు. ఆ పిల్లని చదివించే బాధ్యత నాదే,
అది చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటే మిమ్మల్ని కూడా పోషిస్తుంది, అదే దానికి కావలసిన పెళ్ళికొడుకుని వెతుక్కుని పెళ్లి చేసుకుంటుంది నీవు బాధపడక్కర్లేదు,”
“సరేనమ్మ గోరు మీ మాట ఇంటాను పిల్లదాన్ని మీ కాడ యెడతాను, మీరే సూసుకోండి అమ్మయినా అయ్యయినా! ఇక మీరే. “సరే పని చేసుకుపోయి రేపు మీ ఆయన్ని సాయంత్రం పంపించు ఒకసారి నేను పిల్ల దాని గురించి మాట్లాడతాను,” అంది సుశీల. సరేనమ్మ గోరు అంటూ పనిలోకి పోయింది మంగి. మంగి మొగుడు వీరన్న సాయంత్రం సుశీలమ్మని కలుసుకోవడానికి వచ్చాడు. “ఏంటమ్మా గారు పిలిచారంట” అన్నాడు. “ఇదిగో వీరన్న చూడు మీ లచ్చిమి వయసు 10 ఉన్నది నీవు దానికి పెళ్లి చేయడానికి లేదు అంది సుశీల. “ఏం చేయనమ్మ గారు ఈ పిల్ల దానికి కట్టనాలు ఇచ్చి పెళ్లి చేయలేను కదా! ఆ మల్లి గాడి కొడుకు సేసుకుంటానన్నాడు.
ఏం సేయమంటారమ్మ గోరు. వీరయ్య చాలా మర్యాదగా మాట్లాడాడు.
“ఇదిగో చూడు నువ్వు ఆ చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే నేను పోలీసు ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి చెప్తాను.  ఆడపిల్లలకి 18 ఏళ్ళు వయసు వచ్చేవరకు పెళ్లి చేయరాదు. నిన్ను జైల్లో పెడతారు. ఆ తర్వాత నిన్న దొంగోడని నిన్ను పనిలోంచి తీసేస్తారు, తెలిసిందా!”
“అయ్య బాబోయ్ ఈ ఇసయం నాకు తెనీదు అమ్మ గోరు!” వీరయ్య కొద్దిగా భయపడ్డాడు.
సుశీలమ్మ చెప్పింది “పిల్లదాన్ని నా దగ్గర వదిలే నేను చదువు సంధ్యలు చూసుకుంటాను. నీకు కావలసినప్పుడు ఇంటికి పంపిస్తూ ఉంటాను. దీని గురించి నువ్వేమీ బెంగ పడవలసిన అవసరం లేదు, ఇంట్లో అయ్యగారు నేనే కదా! ఉంటాము.” అని సర్ది చెప్పింది. మొత్తానికి “సరేనమ్మా!” అంటూ వెళ్లిపోయాడు.
లక్ష్మీని, సుశీలమ్మ ఇంట్లో వదిలిపెట్టింది మంగి. ఇంట్లో పనులు చేసుకుంటూ, అక్కడే ఉండి చదువుకునేది. సెలవులిచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్లి తన చిన్న తమ్ముళ్ళు ఇద్దరితో ఆడుకుంటూ ఉండేది. సుశీలమ్మ దానికి చదువు కూడా చెప్తుండేది, కావలసిన అవసరాలన్నీ సమకూర్చేది.
లక్ష్మి డిగ్రీ పాసై బ్యాంకులో ఉద్యోగం సంపాదించింది.
ఇంతలో తమ్ముళ్ళని ఇద్దరినీ కూడా కష్టపడి చదివించింది వాళ్లు కూడా డిగ్రీ పాసై కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. బ్యాంగ్ క్వార్టర్స్ ఇస్తే తల్లిదండ్రులను తీసుకు వెళ్లి తన దగ్గర పెట్టుకుంది. లక్ష్మి , తనతో బ్యాంకులో పనిచేసే శేఖర్ తో పరిచయమై ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పుడప్పుడు సుశీలమ్మ గారిని అయ్యగారిని  చూసి వెళుతూ ఉంటుంది. లక్ష్మితో పాటు మంగి వీరయ్య వచ్చి “అమ్మగారు మా పిల్ల దాని జీవితం బాగుపడింది. మేము కూడా సుఖంగా ఉంటున్నాము అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!