చేతులు కాలాకే

చేతులు కాలాకే

రచన :: చంద్రకళ. దీకొండ

వంటా…అదేం బ్రహ్మవిద్యా…
చేస్తే రాకపోవడానికి…?!
చిటికెలో పని అంటూ…
వంటింట్లోకి చొరబడ్డాడు
వంట రాని మొనగాడు…
ఇట్టే చేస్తే…
అట్టా లొట్టలేస్తూ తింటారంటూ…!
స్టవ్ నాబ్ ఎడమకు తిప్పాలో, కుడికి తిప్పాలో తెలియక తికమకపడి…
బియ్యానికి ఎసరెంత పెట్టాలో
ఎరుగక కళవెళ పడి…
ఏ డబ్బాలో ఏముందో తెలియక గందరగోళపడి…!
కూరగాయలతో పాటు వేలు కోసుకుని హైరానా పడి…
ఉప్పేదో, చక్కరేదో తేల్చుకోలేక పొరపాటుపడి…
కారం కొలత తెలియక కంగారుపడి…
పోపు మాడి దగ్గుతో బేజారై…
వంటిల్లంతా చేసాడు కంగాళీ…!
ఏ పనీ సులువు కాదు…
సులభమూ కాదు…
దేనికైనా కావాలి ఓ ప్రణాళిక…
పద్ధతీ…!
నానబెట్టి ఉడకేసేదేదో…
నీళ్లు పోసి వండేదేదో…
ఎంతసేపు ఉడికించాలో…
ఎంత మంటపై వేగించాలో…
కాస్త ముందస్తు జ్ఞానం ఉండాల్సిందే…
తెలియనంతసేపూ అది బ్రహ్మవిద్యే మరి…!
ఏ పనైనా…
ఓర్పు ఉంటేనే…
నేర్పు చూపితేనే…
నైపుణ్యం కూడితేనే…
ఫలితం భేషుగ్గా ఉంటుంది…!
ఆవ పెట్టో…
అరవై మసాలాలు కూరో…
కాదు…!
శ్రద్ధతో మనసు పెట్టిచేస్తేనే…
ఓపికతో గంటల కొద్దీ నిలబడితేనే…
చేతులు కాలినా ఉఫ్ మని
ఊదుకుంటూ ఓర్చుకుంటేనే…
కమ్మని భోజనం
కళ్లముందుకు వస్తుంది…!

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!