కానుక

కానుక

రచన :: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

కాటుక కనులతో కవ్వించే కస్తూరి కావేరికి స్వయానా చెల్లి అయినా చెల్లెలంటే కావేరికి అసూయ.కస్తూరి అందాన్ని కావేరి భర్త కనకారావు పొగుడుతూ ఉండడంతో కోపం,అనుమానంతో కూడిన అసూయన్నమాట.కావేరి తల్లిదండ్రులు పోవడంతో కస్తూరిని తనతోపాటే ఉంచుకొని మంచి అబ్బాయిని చూసి పెళ్ళిచేసి ఒకింటిదాన్ని చేసేస్తే తనకు భారం ఉండదనుకుంటూ ఉంటే అందంగా ఉండడం వల్ల కస్తూరి చుట్టూ తిరిగే అబ్బాయిలతో ,ముఖ్యంగా కనకారావు తో ఇబ్బంది పడుతూ ఉంది.

కనకారావు కస్తూరికి సహాయం చేస్తే కావేరి భగ్గుమంటుంది.కస్తూరి మాత్రం విసుక్కోవట్లేదు తను ఇబ్బంది పెడితే అది ఇరిటేట్ అవ్వాలిగా అనుకుంటూ కస్తూరిని కూర్చోబెట్టి “ఏమే ..నువ్వు బావతో చనువుగా ఉండద్దు.పెళ్ళికావలసిన పిల్లవి అర్థం చేసుకో “అంది.దానికి కస్తూరి “ఇంట్లో ఉండేది మన ముగ్గురం.బావతో కాకపోతే ఇంకెవరితో చనువుగా ఉండాలి.నేనేమీ హద్దులు దాటడం లేదులే అక్కా.నా గురించి నీకు తెలియదా “అనడంతో కావేరి”నీ గురించి కాదు నా మొగుడి గురించే నా భయమంతా “అంది.”అక్కా..బావ నీతో ఉన్నట్లు నాతో ఎందుకుంటాడు.బావ మంచోడక్కా నన్ను నమ్ము “అంటూ కస్తూరి ధైర్యం చెప్పి అనుమానాన్ని పోగొట్టింది.అప్పటినుంచి కావేరి ప్రశాంతంగా ఉంది.కనకారావు కూడా ఆనందంగా ఇంట్లో ఉంటూ అన్నీ పనులను చేస్తూ ఉండగా ఒకరోజు కస్తూరి వాంతులు చేసుకుంది.కావేరి దిగులుగా బెడ్ రూంలో కూర్చుని ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయింది.
కనకారావు వచ్చాడు.”ఏమేవ్ అన్నం పెట్టు” అన్నాడు.ఉలుకూ లేదు పలుకూ లేదు.కస్తూరి వచ్చి అన్నం పెట్టింది.తినేసి కావేరి తినిందా మీ అక్కకి ఏమైంది అన్నం పెట్టడానికి కూడా రాలేదు అన్నాడు.ఒంట్లో బాగోలేదని పడుకోవుంది అనడంతో వెళ్ళిపోయాడు.కస్తూరి బెడ్ రూంలోకెళ్ళి “అక్కా ఇప్పుడేమైందని అలిగావ్ అనడంతో “ఇంకేమవ్వాలే నా కొంప ముంచావ్ కదే పాపిస్టిదానా అంటూ కస్తూరిపై విరుచుకుపడింది.నిన్న గోబీ తిన్నాను కదా అది అరగక వాంతులయ్యాయి అంతే నువ్వేదంటే అది ఊహించుకోకు.నాకూ లేని పోని ఐడియాలు ఇవ్వవద్దు అంటూ కస్తూరి హితవు పలికింది.కావేరి అంతేనా అనడంతో ఒసేయ్ అనుమానపు పిశాచి అంటూ కస్తూరి అరిచి వెళ్ళిపోబోతుండగా కనకారావు కావేరికి ఫోన్ చేసి “ఏం కావేరి బాగోలేదని కస్తూరి చెప్పింది ఎలా ఉందని అడిగి ఫోన్ కస్తూరి దగ్గర ఇవ్వమంటాడు.లౌడ్ స్పీకర్ ఆన్ చేసి కావేరి ఫోన్ ఇస్తుంది.కనకారావు “కస్తూరి సాయంత్రం పార్క్ దగ్గరికి రా నీతో మాట్లాడాలి,నీకో గిఫ్ట్ కూడా ఇస్తా” అన్నాడు.వినిన కావేరికి పిచ్చ కోపం వచ్చింది.” ఏమో అక్క బావ ఎప్పుడూ అలా మాట్లాడడు ఏంటో ఈరోజు అలా మాట్లాడాడు” అంటూ కస్తూరి వాపోయింది.మీ ఇద్దరి బాగోతాన్ని పార్క్ లో బయట పెడతానంటూ కావేరి “కస్తూరి.. నువ్వు నేను చెప్పినట్లు చెయ్.పార్క్ దగ్గరికెళ్ళు నేనూ నీతో వచ్చి దూరంగా ఉంటా.బావకి చెప్పావో చంపేస్తా .ఏం గిఫ్ట్ ఇస్తాడో చూద్దాం.మీ బావా మరదళ్ళ కథ ఈరోజుతో తేలిపోవాలి “అంది.

రన్నింగ్ ట్రాక్ పై పడుకొని ఉన్న ముసలాయన ఆయన పక్కనే ఒక కుర్రోడు యోగాసనాలు వేయడాన్ని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు కనకారావు.కావేరి కస్తూరి పార్క్ లోకి వచ్చారు.కావేరి కనకారావు వెనుక దూరంగా కూర్చుంది .మరదలు రావడంతో కనకారావు నవ్వుతూ “కస్తూరి..పిలవగానే పార్క్ కి వచ్చావు థ్యాంక్స్.”అనడంతో కస్తూరి “బావా అక్కకి తెలిస్తే చంపేస్తుంది “అంది.”మీఅక్కకి తెలిస్తే ఎగిరి గంతేస్తుంది లే నువ్వేమీ భయపడకు”అంటూ తనివ్వబోయే గిఫ్ట్ తీసి చేతిలో పట్టుకుని.కస్తూరీ..అక్కడొక ముసలాయన ఉన్నాడు కదా పక్కనో కుర్రోడు కూడా ఉన్నాడు చూశావా.వాడు మన దూరపు చుట్టం వాడు నీకు నచ్చితే మీ ఇద్దరికీ పెళ్ళి చేద్దామని అనుకుంటున్నా.”అనడంతో కస్తూరి కి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.అక్కా నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటా బావా అంది.కావేరి అంతా వింటూ మనం ఎంత అపార్థం చేసుకున్నాం అనుకుంటూ ఉంది.కనకారావు”అదికాదు కస్తూరీ..నీకు నచ్చకుండా వాళ్ళని ఇంటికి రమ్మని మళ్ళీ నీకు నచ్చని పెళ్ళి చేయడం నాకిష్టం లేదు.నా కూతురైతే నేను నచ్చిన వాన్నే కదా ఇచ్చి చేస్తాను “అంటూ మనసులో మాట బయటపెట్టాడు.సరే బావా చూశాను బాగున్నాడు అనడంతో కనకారావు వాళ్ళిద్దరి ఫోటోలు అచ్చేసిన పింగాణీ కప్పుని కానుకగా ఇచ్చి వారిరువురి జోడీ ఎలా ఉంటుందో ముందే కస్తూరికి చూపించాడు.ఆ కుర్రోడెవరో చూద్దామని కావేరి యోగా చేసే రన్నింగ్ ట్రాక్ వైపు తొంగి తొంగి చూస్తూ ఉండగా కనకారావు లేచి ఏమే అనుమానపు పిశాచీ నువ్వొచ్చుంటావని నాకు తెలుసే .నా మనసులో నీ చెల్లిమీద నాకే దురుద్దేశం ఉండదు.ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న పిల్ల.నువ్వు నీ అనుమానంతో విలువ పోగొట్టుకున్నావ్.ఇకనైనా ప్రశాంతంగా బతుకు అంటూ దెప్పిపొడిచాడు.కావేరి”నన్ను క్షమించండి అంటూ కనకారావు చేతులు పట్టుకొని మరిదిగారు బాగున్నారండీ “అంది.”నాకు వాడంటే చాలా ఇష్టం.పిలవనా కస్తూరి మాట్లాడుతుంది”అనడంతో కస్తూరి”వద్దు బావా నేను మాట్లాడను “అంటూ సిగ్గు పడుతూ ఇంటి బాట పట్టడంతో కనకారావు “అమ్మో అప్పుడే పెళ్ళి కూతురికి సిగ్గొచ్చేసింది “అంటూ కావేరి చెయ్యి పట్టుకున్నాడు.కావేరి కనకారావు తన భర్త అయినందుకు గర్వంతో తలెత్తుకొని నడుస్తూ కనకారావు చేతిని గట్టిగా పట్టుకుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!