దత్త జయంతి విశిష్టత

దత్త జయంతి విశిష్టత (వ్యాసం)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత.పి.వి.ఎల్

దత్తాత్రేయుని జన్మ దినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున ‘దత్త జయంతి’ గా జరుపుకుంటారు. కలియుగమంతా గురుతత్వాన్ని వ్యాప్తి చేస్తూ అవతార పరిసమాప్తి లేకుండా కొన సాగుతున్నటువంటి అవతార మూర్తి దత్తాత్రేయుడు. ఈ దత్తావతారం త్రిమూర్తిలైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో జనించింది.
అత్రి, అనసూయలకి మానస వర పుత్రుడు శ్రీ దత్తాత్రేయుడు. అనసూయాదేవి మహా పతివ్రత. ధర్మ వంతుడైనట్టి అత్రి ముని భార్య.
ఒకసారి త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. అందుకు వారు బ్ర్రాహ్మణుఁల రూపంలో అనసూయ ఇంటికి వెళ్లారు. ఆ ముగ్గురు బ్ర్రాహ్మణులని సాదరంగా ఆహ్వానించింది. వారికి భోజనం పెట్టడం కోసం అరిటాకుల్ని పరుస్తుండగా,” నువ్వు మాకు నగ్నంగా వడ్డిస్తేనే నీ ఆతిధ్యాన్ని స్వీకరించి, నువ్వు పెట్టిన ఆహారాన్ని భోజిస్తాము” అని అనగానే..ఆ మాటలకు కొద్దిసేపు సంకోచించింది.. వెంటనే ప్రశాంతతగా ఆలోచించి వారి కోరిక మేరకు ‘సరే’నని అంగీకరించింది అనసూయ. తన పాతివ్రత్య మహిమతో ఒక మంత్రాన్ని ఉచ్చరించి ఆ ముగ్గురిపై నీళ్లు చల్లి వారిని శిశువులుగా మార్చేసింది. పిదప వారు కోరుకున్నట్లుగానే తాను నగ్నంగా సేవలందిస్తూ వారికి భోజనం పెట్టింది.
కొద్ది దినాల తరువాత అత్రి తన ఆశ్రమానికి తిరిగొచ్చినప్పుడు..ఉయ్యాలలో ఉన్న ఆ ముగ్గురి బాలకుల కథ, జరిగిన సంఘటనను భర్తకు వివరించి చెప్పింది. అత్రి తన మానసిక శక్తి ద్వారా వారు త్రిమూర్తులని గ్రహించి ఆ శిశువులను హృదయానికి హత్తుకున్నాడు. మూడు తలలు మరియు ఆరు చేతులతో ముగ్గుర్నీ ఒకే బిడ్డగా మార్చేశాడు అత్రిముని.
ఇదిలా ఉండగా, ఎన్ని రోజులైనా త్రిమూర్తులు తిరిగి దేవలోకానికి రాకపోవడంతో, వారి భార్యలు భర్తల జాడ వెతుక్కుంటూ అనసూయ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. పసి బాలల రూపంలో ఉన్న తమ భర్తలను చూసి విషయమేమిటో తెలుసుకుని ”వారు కోరిన కోరిక తప్పేనని..వాళ్ళ తరపున మేము క్షమాపణ చెబుతాము.. క్షమించి మా భర్తలను మాకు ఇచ్చెయ్యమని” అభ్యర్థించారు త్రిదేవీలైన సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి మాతలు.
మహర్షి వేదవ్యాసుడు రాసిన దత్త పురాణం ప్రకారం విష్ణువు అవతారాలలో దత్త ఒకటి. దత్తాత్రేయుడు’ జ్ఞాన’ స్వరూపం. ఇక్కడ ‘జ్ఞానం’ అంటే ఇంగిత జ్ఞానం అని కాదు. ‘బ్రహ్మ జ్ఞానం’, ‘అంతిమ సత్యం’ గురించి లేదా’ పర బ్రహ్మణ జ్ఞాన’మని అర్థం. కలియుగంలో భూమిపై ఉండే, ప్రతి ఒక్కరికీ బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించడం దత్త అవతారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
దత్తాత్రేయ అనే నామoలోనే వైవిధ్యం మరియు ఐక్యతాలోచనను సూచిస్తుంది. దత్తాత్రేయుడు జ్ఞానం యొక్క మహా సముద్రమే కాదు ఆనందాన్నిచ్చే శక్తి కూడా.
శాండిలియోపనిషత్ లో దత్తాత్రేయుడు అత్యున్నత అధి దేవత, జ్ఞాన ప్రదాత మరియు గురు పరంపరా జగద్గురువు అని తెలుపబడింది. మన మనసులను పవిత్రం చేయడానికి, హృదయాలు శుద్ధి అవడానికి ”శ్రీ దత్తాయనమః”అని పఠిస్తే చాలు. దత్తా అంటే ప్రేమ, కరుణ మరియు దయ యొక్క రూపం. దత్తుడుని ఆరాధిస్తే భక్తి, ముక్తి రెండూ లభిస్తాయి.
దత్త పురాణం ప్రకారం బ్రహ్మ దేవుని యొక్క ఏడుగురు కుమారులలో అత్రి మహర్షి ఒకరు. అనసూయాదేవి కర్థమ మహర్షి కుమార్తె. వారిద్దరూ ఆధ్యాత్మికతలో ఎంతో పరిజ్ఞానాన్ని పొందిన వారు, దైవభక్తులు.
రుత్రికా అనే పర్వతం మీద పరబ్రహ్మ కోసం అత్రి మహర్షి మహా తపస్సు చేసాడు. తన సుదీర్ఘ తపస్సుకి మెచ్చిన త్రిమూర్తులు తమని తాము అత్రికి పుత్రులుగా అమానవీయ రూపంలో జన్మించారని పురాణ కథనం.
చంద్రుడు బ్రహ్మ శక్తితో, శివుని శక్తితో దుర్వాసుడు, విష్ణు శక్తి తో దత్తాత్రేయుడు జన్మించారు. చంద్రుడు మరియు దుర్వాసుడు వారి అధికారాలను దత్తుడికి వదిలి వారు వారి లోకాలకు వెళ్లిపోయారు. నాటి నుండి భక్తుల కోరిక మేరకు దత్తాత్రేయుడు భూలోకంలోనే ఉండిపోయాడు.
దత్తాత్రేయుడనే నామకరణం తనకి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. పుట్టుకతోనే వచ్చింది. ఎలాగంటే..దత్త అనగా ఏ షరతులు లేని ప్రార్థనల ఫలితంగా అత్రి మహర్షికి లభించిన అయాచిత వరం. త్రిమూర్తులు ముగ్గురూ కలిసి ‘అత్రి’ కి కుమారుడు కాబట్టి అందరూ ‘ఆత్రేయ’ అని పిలిచేవారు. అలా కాలక్రమేణా దత్తాత్రేయుడయ్యాడు.

”దత్తం దత్తం పునర్దత్తం
యోవదేత్ భక్తి సంయుతః!
తస్య పాపాని సర్వాణి
క్షయం యాంతి న సంశయః” !!
ఈ శ్లోకాన్ని దత్తాత్రేయ జయంతి రోజున పఠిస్తే సర్వదా శుభప్రదం.
‘ఓం శ్రీ గురు దత్త నమో నమః’!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!