ఏం వండను?
రచన:: మంగు కృష్ణకుమారి
అత్తగారు ఉల్లికి ఆమడ దూరం
ఆచారానికీ అలవాట్లకీ కూడా
నప్పదు! మామగారికీ అత్తగారికీ
కూడా ఆలూ విషతుల్యం!
తేలికగా అరిగేవే కావాలంట!
అబ్బాయికి ఆకుకూరలు అసహ్యం
ఆయనగారికి పప్పులే పడవు!
కారాలంటే కడుపులో తంటా!
అమ్మాయికి వంకాయ ఎలర్జీ
టొమాటో పప్పు ఉంటే ఓకే!
చిన్నోడు మసాలాకూర లేందే
ముద్ద ఎత్తడు! కొత్తగా వచ్చిన
కోడలుపిల్లకి సొరా, బీరా,కీరా
ఏవీ కిట్టవట! మసాలాలంటే
డోకుట! టొమాటో చూస్తే వికారంట!
దెయ్యానికి చెప్దునా, దేవతలకి
చెప్దునా? వంటిల్లంటే వణుకు!
గోడమీంచి పక్కింటి పిన్నిగారు
అన్నీ విన్నారు! రత్నంలాటి
సలహా ఇచ్చేరు! దప్పళం
కాచీ, అప్పడాలు వేపీ!
నోర్లు తినడానికే తెరుస్తారు
మీ వాళ్ళందరూ!
అంతేనా నేస్తాలు? మీ సమస్య
నాకేనా? మీ ఎవరికీ లేనే లేదా?
***