బాడీగార్డ్

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

బాడీగార్డ్

రచన:సావిత్రి కోవూరు 

“ఏమే కళ్యాణి నీ బాడీ గార్డ్ రెండు రోజులుగా కనిపించడం లేదు” అన్నది వైదేహి

“అదే నాకు తెలియట్లేదు పది రోజుల నుండి  ఒక్కరోజు కూడా నేను అతని వైపు చూడక పోయినా బాడీ గార్డ్ లాగా ఇంటి వరకు వచ్చే ఆ అబ్బాయి, రెండు రోజులుగా రావట్లేదు” అన్నది కళ్యాణి.

“నీవు మిస్ అవుతున్నావా” అన్నది వైదేహి.

“అదేంటి నేను ఇలాంటివి అసలు పట్టించుకోను. నాకు అసలు ఇలాంటి బాడీ గార్డ్ ల పైన ప్రేమ కలాపాలు పైన నమ్మకం లేదు. నీవు, నేను రోజు  కాలేజీకి కలిసి వెళ్తాం కదా. నీవు రెండు రోజులు రాకపోతే ఎందుకు రాలేదు అనుకుంటాను. అలాగే అతను కనిపించక పోయేసరికి రాలేదెందుకు అనుకున్నాను. అంతకుమించి ఏమీ లేదు. ఆ అబ్బాయి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అని బాధ. అదే విషయం చెప్పాలి అనుకున్నానుకో మాటలు పెరిగి, లేని ఆశలు పెంచుకుంటారు ఈ అబ్బాయిలు. అందుకే మనం చూసీచూడనట్టు, పట్టించుకోనట్టు ఉంటే నాలుగు రోజులకు మానేస్తారు అంతే.” అన్నది కళ్యాణి.

“నీవు అన్నది కరెక్టే మనము వాళ్ళ వైపు చూడటం, మాట్లాడటం చేయకుండా, లెక్క లేనట్టు ఉంటే వాళ్లే మానేస్తారు.” అన్నది వైదేహి.

“అది సరే వైదేహి డిగ్రీ పూర్తి అవుతుంది. మీ ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారా? ఎలాగైన సిద్దంగా ఉన్నాడు కదా పెండ్లి కొడుకు.” అన్నది కళ్యాణి.

“లేదే. మా బావ కొత్త ఉద్యోగంలో చేరాడట. ఇప్పట్లో  లీవ్ దొరకదట. అందుకని నేను కొన్ని రోజులు ఏదైనా జాబ్ లో జాయిన్ అవుతాను. నెక్స్ట్ ఇయర్ మా బావ వచ్చినాకనే పెండ్లి.మరి నీ సంగతేంటి మీ ఇంట్లో ఏమైనా ప్రయత్నాలు మొదలు పెట్టారా” అన్నది వైదేహి.

“మా నాన్న ఫ్రెండ్ భరత్ అనే అతని ఫ్యామిలి మావాళ్ళు ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ప్రక్క ప్రక్క ఇళ్ళలో ఉండేవారట. రెండు కుటుంబాలు చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళట. నాకు అంత జ్ఞాపకం లేదు. వాళ్లకు కొన్నేళ్ల తర్వాత చెన్నై ట్రాన్ఫర్ అయి వెళ్ళిపోయినా, వాళ్ళ ఫ్రెండ్ షిప్ మాత్రం చెక్కు చెదరలేదు. పైగా వాళ్ళ ఫ్రెండ్ షిప్ ను బంధుత్వంగా మార్చుకోవాలని అనుకున్నారట.

మా నాన్న చెన్నై వెళ్ళినప్పుడల్లా ఫ్రెండ్ ని కలవకుండా వచ్చేవారు కాదు. ఆ మధ్యన ఒకసారి మా అమ్మ మా నాన్న చెన్నై వెళ్లినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి, అందరూ కలిసి అక్కడి నుండి తిరుపతి వెళ్లి వచ్చారు.

ఈ మధ్య మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ కు
వచ్చేశారట. అప్పటినుండి రాకపోకలు ఎక్కువ అయినాయి. మొన్నొక రోజు మా అమ్మ నాతో ‘అహల్య ఆంటీ వాళ్ళ అబ్బాయి ఇండియాకు వచ్చాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మళ్ళీ ఎన్ని రోజులకు కనిపించాడు. యూ.ఎస్. లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడట. ఆంటీ వాళ్ళు ఆ అబ్బాయికి  పెళ్లి చేయాలనుకుంటున్నారట. మన అభిప్రాయం చెప్పమన్నారు. ఆ అబ్బాయి పేరు శరత్. నీవు ఏమంటావు? మేము ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్నామని కాదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మాకు 30 ఏళ్ళ నుండి తెలుసు. మంచివాళ్ళు. అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు. నీ అభిప్రాయం చెబితే ఆ అబ్బాయి వాళ్ళని మన ఇంటికి పిలుద్దామని, మీరిద్దరూ చూసుకుని మీకు నచ్చితే ఆంటీ వాళ్లకు చెప్తాను. నచ్చకపోయినా బలవంతం ఏం లేదు. అన్నది’ నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నా” అన్నది కళ్యాణి.

“ఇంకా ఆలోచించడం ఏంటి నీవు  ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలి. ఆ చేసుకునేదేదో మీ వాళ్లకు నచ్చిన అబ్బాయిని చేసుకుంటే బాగుంటుంది.”

“నేను ఎవరిని ప్రేమించట్లేదు అని ఎలా అనుకుంటున్నావు. మా అమ్మ వాళ్ళు మాటిమాటికి చిన్నప్పటి నుండి శరత్ విషయం మాట్లాడటం నాకు తెలియకుండానే, అతని చూడకుండానే నా ఊహలలో అతనిని భర్తగా బావించుకున్నాను. కానీ అతను ఎలా ఉంటాడో, అతని బిహేవియర్ ఏంటో, అతని ఆలోచనలు ఏంటో ప్రత్యక్షంగా మాట్లాడి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అన్నీ నచ్చితే ఓకే అంటాను.” అన్నది కళ్యాణి.

“అమ్మ దొంగ ఇన్ని రోజులు ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు.” అన్నది వైదేహి.

“నేను చూడకుండనే నీకెలా చెప్పను. అందుకే చెప్పలేదు. అమ్మ చెప్పడం బట్టి మంచి పద్ధతి అయిన వాడు అని అర్థమైంది. అతను కూడా నన్ను చూడకుండానే వాళ్ళ అమ్మ మాటలతో నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది” అన్నది కళ్యాణి.

“సరే అంతా బాగానే ఉంది. పాపం ఈ బాడీ గార్డ్ సంగతేంటి?”అన్నది వైదేహి.

“మాటిమాటికీ బాడీ గార్డ్ అని నాకు జ్ఞాపకం చేస్తావేంటి. పాపం అతను కూడా బుద్ధిమంతుడు లాగానే ఉన్నాడు, చూడడానికి బానే ఉన్నాడు. కానీ నన్ను చేసుకునే అదృష్టం అతనికి లేదు. ఏం చేస్తాం” అన్నది బిగ్గరగా నవ్వుతూ.

“అంటే తొందర్లోనే నీ కలల రాకుమారుణ్ణి చూడబోతున్నావన్నమాట.” అన్నది వైదేహి.

“అప్పుడే రాకుమారుడు అని అనకు. అతను నాకు నచ్చాలి. అతనికి నేను నచ్చాలి. అప్పుడు ఓకే  చెస్తాను” అన్నది కళ్యాణి.

“హలో కల్యాణి ఏం చేస్తున్నావ్” అన్నది వైదేహి మరుసటి రోజు ఉదయం.

“ఏముంది చేయడానికి ఆదివారం కదా బద్ధకంగా పడుకున్నాను.”అన్నది కళ్యాణి.

“అదేంటి లంచ్ కి బయటకి వెళ్దాం అన్నాను కదా. మా కజిన్స్ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. మనం అందరం వెళదామని ప్లాన్ చేశాను” అన్నది

“ఎందుకు”

“ఈ రోజు నా బర్త్ డే అని చెప్పాను. మర్చిపోయావా? మా కజిన్స్ పార్టీ ఇమ్మంటున్నారు. అందుకే బయట ఎక్కడన్నా తినేసి ఓపికుంటే, సినిమాకి వెళ్దాం. చాలా రోజులైంది బయటకు వెళ్ళక అన్నది వైదేహి.

“మీ కజిన్స్ ఉన్నారు కదా. మీరు వెళ్ళండి మనం మళ్ళీ ఎప్పుడైనా తీరికగా వెళ్దాం” అన్నది.

“బర్త్ డే రోజు వాళ్ళు ఎంతమంది ఉన్నా, నీవు నాతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ రావే ప్లీజ్ ప్లీజ్ అన్నది వైదేహి.

“ఆపవే తల్లి, నీ ప్లీజ్ స్తోత్రం. అలాగే వస్తాను” అన్నది కళ్యాణి.

ప్లీజ్ తొందరగా రా మా ఇంటికి. ఇక్కడి నుండే వెళదాం” అన్నది.

“సరే మా అమ్మని అడిగి వస్తాను.” అన్నది కళ్యాణి.

“అమ్మ నేను వైదేహి బర్త్ డే పార్టీ కి వెళ్తున్న వచ్చేవరకు లేట్ అవుతుంది.” అన్నది కళ్యాణి.

“అరె ఈ రోజు ఆంటీ వాళ్లని పిలుద్దాం అనుకున్నాను. సరే రేపు పిలుస్తాను లే. నువ్వు వెళ్ళు. హ్యాపీగా గడిపేసిరా.” అన్నది కళ్యాణి వాళ్ళ అమ్మ భారతి.

కళ్యాణి వెళ్లేసరికి వైదేహి కజిన్స్ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఉన్నారు. ఆ ఫ్రెండ్ ని చూసేసరికి కళ్యాణి గతుక్కుమంది. ఎందుకంటే రోజు తనను ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపే బాడీగార్డ్.

అదే విషయం వైదేహి అడిగితే “నాకు తెలియదు మా పెద్దమ్మ కొడుకు ఫ్రెండ్ అంటే ఎవరో అనుకున్నాను. అయినా నీకేం ఇబ్బంది ఉండదు లే. అతను చాలా మంచివాడని మా కజిన్ అన్నాడు” అన్నది వైదేహి.

వైదేహి చెప్పినట్టుగానే అతనేమి ఇబ్బంది పెట్టలేదు. తన ఫ్రెండ్ తోనే కబుర్లు చెబుతున్నాడు. కానీ మధ్య మధ్య అదే పనిగా కళ్యాణిని చూస్తున్నాడు. కల్యాణికి అదే ఇబ్బందిగా ఉన్నది.

వైదేహితో చెబితే “నువ్వేం భయపడకు నీవు ఎంగేజ్డ్ అని చెప్పాను.”అన్నది వైదేహి.

“అలా ఎందుకు చెప్పావ్ పాపం.” అన్నది కళ్యాణి.

“అది అబద్ధం అని చెప్పనా ట్రై చేసుకుంటాడు” అన్నది.

“నీతో ఏది మాట్లాడిన తప్పే” అన్నది కళ్యాణి.

“మరి నీవు అసలు చూడని అబ్బాయిని చేసుకునే బదులు నీ చుట్టూ వెర్రి వాడిలా పదిహేను రోజుల నుండి తిరుగుతున్న ఈ బాడీగార్డ్ బెటర్ కదా. నచ్చితే చెప్పు వివరాలన్నీ కనుక్కుంటా. అన్నీ నచ్చితే ఓకే చేయొచ్చు.” అన్నది వైదేహి.

“నోర్ముయవే నేను చెప్పాను కదా. నేను చూడక పోయినా అతనినే నా భర్తగా భావించుకుంటున్నాను.” అన్నది కళ్యాణి.

“మరి ఎప్పుడు వస్తున్నారు వాళ్ళు”

“రేపు వాళ్లను మా అమ్మ వాళ్ళు ఇంటికి పిలిచారు. అయినా ఆ అబ్బాయి మా అమ్మ వాళ్లకు నచ్చినంత మాత్రాన నాకు నచ్చాలని లేదనుకో. కానీ కొత్త సంబంధాలు అయితే అన్ని విషయాలు కనుక్కోవాల్సి ఉంటది” అన్నది కళ్యాణి.

“బెస్ట్ ఆఫ్ లక్ అబ్బాయి నచ్చితే, నాకు ‘కాల్’ చెయ్” అన్నది వైదేహి.

“సరే తప్పకుండా” అన్నది కల్యాణి.

మరుసటి రోజు సాయంత్రం శరత్ వాళ్లు మా ఇంటికి వస్తున్నారని మా అమ్మ వంటావిడతో ఎన్నో స్పెషల్స్ చేయించింది.

సాయంత్రం 6 గంటలకు వచ్చారు శరత్ వాళ్ళ ఫామిలీ. నేను నా రూమ్ లో ఉంటే, అమ్మ వచ్చి “రావే వాళ్ళు కొత్త వాళ్ళేమి కాదు. వచ్చి కూర్చో. అంటే వెళ్ళాను హాల్లోకి. అంకుల్ ఆంటీ కి నమస్కరించి కూర్చున్నాను. అబ్బాయి వైపు తిరిగి ‘హలో’ అంటూ అటు చూసిన నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ అబ్బాయి పదిహేను రోజుల నుండి నా బాడీ గార్డ్ గా తిరిగిన అబ్బాయి. అతను కొంటెగా నవ్వుతున్నాడు కల్యాణి చూసి.

కళ్యాణి అయోమయంగా “మీరు రోజు కాలేజ్ దగ్గరకు వచ్చేవారు కదా ఎలా” అన్నది.

“ఏం లేదు నిన్ను పెద్దయిన తర్వాత చూడలేదు కదా. ఒకసారి చూపెట్టమని మీ కజిన్ ని అడిగితే దూరం నుండి చూపించాడు. నిన్ను చూసినప్పటి నుండి రోజు చూడాలనిపించి, నిన్ను ఫాలో అయిన” అన్నాడు నవ్వుతూ.

“మరి మా ఫ్రెండ్ ఇంట్లో”?అన్నది.

“అది అనుకోకుండ నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు.” అని నవ్వడం మొదలు పెట్టాడు. కళ్యాణి కూడ నవ్వడం మొదలు పెట్టింది.

వాళ్ల నవ్వుల చూసిన పెద్దవారికి అర్ధమైపోయింది పెండ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు అని.

You May Also Like

One thought on “బాడీగార్డ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!