ఎవరి సోది వారిది

ఎవరి సోది వారిది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కందర్ప మూర్తి

పరిసరాలు సర్వే చేస్తున్న దోమని చూసి, ఏమిటి వదినా! పుల్లారావు గారింటి నుంచి పెంటారావు ఇంటి పరిసరాల్లోకి మకాం మార్చేవు, ఏం అక్కడ బాగా లేదా? అడిగింది ఈగ. ఏం చెప్పను వదినా , నేను కాపురాని కొచ్చిన కొత్తలో పుల్లా(కట్టెలమండి) రావు ఇంటి పరిసరాలు బాగానే ఉండేవి. పుల్లారావు కట్టెల దుకాణం, పాడి బర్రెలుండే రేకుల షెడ్డు అన్నీ నివాసానికి అనుకూలంగా ఉండేవి. బర్రెల షెడ్డు లోంచి వచ్చే మురుగు నీటి గుంట నిండి ఆహ్లాద
కరంగా ఉండేది. పగలప్పుడు కట్టెల మండీలో ఉంటే రాత్రిళ్లు బర్రెల షెడ్డులో ఆహార విహారాలు జరిగేవి. చీకూ చింతా లేకుండా రోజులు గడిచి పోయేవి. ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్లతో ఇబ్బందు లొస్తున్నాయి. సిటీలో మలేరియా కేసులెక్కు వయాయని, చిన్న పిల్లలు జ్వరాలతో  చచ్చిపోతున్నారని వైధ్య ఆరోగ్యశాఖ వారు పారిశుధ్య పనుల్లో జోరు పెంచారు. చెత్తా చెదారం ఏ రోజు దారోజు చెత్త బళ్లల్లో పోసి తీసుకు
పోతున్నారు. మురుగు కాల్వల్లో ఏవేవో రసాయన ద్రవాల మందులు పిచికారీ చేస్తున్నారు. గమాక్సిన్, బ్లీచింగు పౌడరు లాంటి  పొడిమందులు జల్లుతున్నారు. రాత్రయేసరికి పొగబండిలో  మందుల పొగ సందు సందుల్లో వ్యాపిస్తున్నారు. అందువల్ల మా పిల్లల్లో ఎదుగుదల లేక రెక్కలు సరిగ్గా రాక మరణాలు సంభవిస్తున్నాయి. మేము పెద్ద దోమలం ఏదోలా తప్పించుకో గలుగుతున్నాం కాని పసిగుడ్లు మందుల ప్రభావానికి బలై పోతున్నాయి. ఇంకా అక్కడే ఉంటే మా ప్రాణాలకే ముప్పు వచ్చే లాగుంది. మాది మలేరియా జాతి , కాని పులిమీద పుట్రలా ఈమధ్య డెంగ్యు, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధి పుట్టించే మరొక రకం దోమలు వచ్చి మరింత గందరగోళ పరిస్థితు లేర్పడ్డాయి. అందువల్ల మున్సిపల్ ఆరోగ్య సిబ్బంది మరింత జోరుపెంచి రాత్రి పగలు మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే మా జాతి దోమలు పట్టణ ప్రాంతాల్లో చాలా అంతరించి పోయాయి. మిగిలిన మేమైనా ప్రాణాలు రక్షించు కోవాలని సురక్షిత ప్రాంతంగా తలిచి పెంటకుప్పల పెంటారావు ఇంటి పరిసరాల కొచ్చాము. ఇక్కడైతే ప్రస్తుత పరిస్థితులు బాగానే కనబడుతున్నాయి. పెంటకుప్పలు దండిగా ఉన్నాయి. మురుగు నీటి చెరువులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సిటీకి దూరంగా ఉండటం వల్ల మున్సిపల్ సిబ్బంది  సమస్యలుండవు. ప్రశాంతంగా రోజులు వెళ్లదీయొచ్చు. తన గోడు చెప్పుకు పోతోంది మలేషియా మస్కిటో. మంచి పని చేసావు వదినా, ఇంతకు ముందు మేము కూడా సిటీలోనే ఉండేవాళ్లం. హాయిగా రోజులు గడిచేవి. పిల్లల్లోను పెద్ద వాళ్లలో నీళ్ల విరోచనాలు, వాంతులు కలరా వంటి రోగాలు కలుగుతున్నాయని  పారిశుద్ధ్య సిబ్బంది రసాయన మందులు జల్లడం, పెంటకుప్పల్ని తగలబెట్టడం చేస్తున్నారు. ఇళ్లలో  తడి పొడి చెత్త కోసం ప్లాస్టిక్ తొట్టెలు ఉంచి ఆటో రిక్షాలు వేన్లలో పట్టుకు పోతున్నారు. ఇంతకు ముందులా ఇళ్లలో చచ్చిన జంతువుల కళేబరాల్ని రోడ్ల మీద పడెయ్యకుండా మున్సిపల్ సిబ్బంది పట్టుకుపోయి తగల బెడుతున్నారు. అన్ని  తినుబండారాల దుకాణాలు, చికెన్, చేపలు అమ్మే షాపుల్లో ఈగల నిరోధ తీగల అల్లికల కప్పులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ
రోజులు గడపటం కస్టమని ఇక్కడి కొచ్చాం వదినా తన సోది వెళ్లబోసుకుంది కలరా ఈగ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!