రంగడి జాతకాల పిచ్చి

రంగడి జాతకాల పిచ్చి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం. రంగడు ఊరికే మంచం మీంచి ఎగిరెగిరి పడుతున్నాడు. ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. కదల లేకుండా ఉన్నాడు. గొంతు ఎండిపోయింది. ఏదో బలవంతంగా మంచం దిగి కిటికీ లోంచి బయటకు చూసాడు, అంతే గుండె జారిపోతోంది. చెట్లన్నీ ఎర్రని రంగులో ఉన్నాయి. ఓ అరటి చెట్టు ఆకుల్లోంచి రక్తం కారుతోంది. పక్కనే గొడ్ల చావిడి లో గేదెలు కర్ణ కఠోరంగా అరుస్తున్నాయి. కోడి పుంజులు ఎగురుతూ కింద పడి చనిపోతున్నాయి. మధ్యలో ఏవో తెల్లని శరీరాలు నాట్యం చేస్తున్నాయి. రంగడు అదే పనిగా అరుస్తున్నాడు. పక్కన ఉన్న భార్య కోమలిని పిలుస్తున్నాడు కానీ ఆమె గాఢ నిద్రలో ఉంది. లేవడం లేదు. మరి కొంత సేపటికి కొంచెం మెలుకువ వచ్చి పక్కన చూస్తే రంగడు కనిపించలేదు. కోమలి ఒక్కసారి పక్కన చూస్తే, కిటికీ దగ్గర కూర్చుని భయంతో మూలుగుతూ కనిపించాడు రంగడు. దగ్గరకు వెళ్ళి ఏమైంది అని తట్టి లేపి, కొంచెం మంచినీళ్లు ఇచ్చింది. అప్పుడు తెలివిలోకి వచ్చి ఇదంతా కలా! అనుకున్నాడు. హమ్మయ్య బ్రతుకు జీవుడా అని లేచి అమాంతం భార్య ఒళ్ళో దూకాడు. ఏమైంది అసలు, ఆ కంగారు, భయం ఏమిటి అంది కోమలి. జరిగిన కల వృత్తాంతం అంతా చెప్పాడు రంగడు. మీ చాదస్తం, జాతకాల పిచ్చితో నాకు కూడా పిచ్చి లేస్తోంది అంది. అది కాదే అంటూ గొణిగాడు. ఊరుకోండి వాడెవడో చెప్పాడని ఈ తోటలో, మధ్యలో మంచం వేసి పడుకో బెట్టారు. పీడ కలలు కాకపోతే, స్వర్గానికి పోతామా? పదండి ఇంట్లోకి, ఈ అర్ధరాత్రి మద్దెల దరువులా, ఎవరైనా చూస్తే ఏ దొంగలో అనుకుని తన్న గలరు, పదండి అనే సరికి మనవాడికి ఇంట్లోకి నడవక తప్పలేదు. మరునాడు ఉదయం వాడి స్నేహితుడు కమ్ జాతకచక్ర అనుకునే వీరేశం దగ్గరకి వెళ్లి గత రాత్రి జరిగింది అంతా చెప్తాడు. అదేరా నీతో వచ్చింది. ఏ పనీ పూర్తిగా చెయ్యవు, రాత్రంతా అక్కడే పడుకుని ఉంటే నీకు తప్పకుండా పదోన్నతి వచ్చి, ప్రధానోపాధ్యాయుడు అయ్యే వాడివి. మొన్న గుడిలో రాత్రంతా పొర్లు దణ్ణాలు పెట్టమంటే పోలేదు. నీ బ్రతుకంతా ఉపాధ్యాయుడుగానే ఉండు అంటూ కసురు కొన్నాడు. అది కాదురా నువ్వు ఇలాటివి అన్నీ చెబుతావు, ఎలా? గుళ్ళో రాత్రి ఎవరు ఉండనిస్తారు, ఆ పూజారి తిట్టి పంపాడు. ఇప్పుడేమో నా భార్య. మరో మార్గం ఏదైనా చెప్పరా అన్నాడు. సరేలే పో..రేపు ఆ బుధ గ్రహాన్ని అడిగి చెప్తా అని పంపేశాడు. మరునాడు సాయంత్రం రంగడు, వీరేశం దగ్గరకి వెళ్లి తదుపరి కార్యాచరణ తెలుసుకుని ఇంటికి వెళ్తాడు. చూడు కోమలి కొంచెం తొందరగా భోజనం పెట్టే, తినేసి నేను పక్క ఊర్లో స్నేహితుడిని కలిసి ఉదయమే వచ్చేస్తా అన్నాడు రంగడు. ఈ రాత్రి వేళ ఎందుకు? ఓ ఆదివారం వెళ్లొచ్చు కదా అంది భార్య. కాదోయ్ వాడికి ఏదో అవసరం ఉందిట ఈ రోజే వెళ్ళాలి అన్నాడు.
సరే మీ ఇష్టం, మళ్లీ ఎవడో చెప్పాడని అక్కడా ఇక్కడా పడుకున్నారంటే, ఈ సారి మా పుట్టింటికి పోతా నిజంగానే అంది. అదేం కాదు, నువ్వు భోజనం పెట్టు, మళ్లీ ఆలస్యం అవుతుంది.
అలా భోజనం చేసి రంగడు ఊరి చివర ఉన్న శివాలయం తలుపులు మూసే సమయానికి ముందే ప్రాంగణానికి చేరుకుని, ఎవరికీ కనిపించకుండా కూర్చున్నాడు. యథాప్రకారం పూజారి గారు సమయం అయ్యాకా, గుడి తలుపులు తాళం వేసి ఇంటికి వెళ్లి పోయారు. హమ్మయ్య అనుకొని రంగడు గుడి ఆవరణలో ఉన్న మంటపంలో పడుకున్నాడు. అలా నిద్ర పట్టేసి పడుకుని ఉన్నాడు. ఉదయం పూజారి గారు వచ్చి తలుపు తీసే సరికి ఇతన్ని చూసి విస్తుపోయారు, ఇతడు లోపలికి ఏల వచ్చాడు, ఇక్కడ ఎందుకు పడుకున్నాడు అనుకుని బాబూ రంగడులే! అని లేపారు. రంగడు లేవలేదు. లే బాబూ ఏమిటి ఈ విడ్డూరం, మళ్లీ నీ జాతకాల మిత్రుడు చెప్పాడా, నీకు పిచ్చి బాగా ముదిరి పోయింది అని కొంచెం గట్టిగానే లేపారు. రంగడు లేవకపోయే సరికి దగ్గరికి వెళ్ళి తట్టారు, ఒళ్ళు కాలిపోతోంది, మూలుగుతున్నాడు. అరే ఏమైంది అని తొందరగా రోడ్డు మీద వెళ్తున్న వారి సాయంతో, అచారి గారు అని ఆ ఊరి వైద్యుడు దగ్గరకి తీసుకు వెళ్లి, కోమలి కి కబురు చేశారు. పాపం కోమలి పరుగు పరుగున ఆసుపత్రికి చేరుకుంది. ఆచారి గారు అన్నీ చూసి ఏదో విషపు పురుగులు కుట్టాయి, విరుగుడుకి మందు వేశా, కంగారు ఏమీ లేదు. ఓ గంటలో లేస్తాడు అనే సరికి హమ్మయ్య అనుకున్నారు అంతా, ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లి పోయారు.
మరో రెండు గంటల్లో రంగడు లేచాడు. కోమలి దగ్గర ఉండి అన్నీ చూసుకుని, రంగడ్ని ఆ సాయంత్రానికి ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇవేం పిచ్చి పనులు మీకు? ఎంత చెప్పినా మీ పిచ్చి మీదేనా? అంటూ ఏడుస్తూ అరుస్తోంది. రంగడుకి ఏమీ అర్థం కాలేదు ఏం చెప్పాలా అని. నేను నిన్ననే చెప్పా, మా పుట్టింటికి పోతా, మీతో వేగడం నా వల్ల కావట్లేదు, కాసేపట్లో మా అమ్మ నాన్న వస్తారు పిల్లాడిని తీసుకుని నేను వెళ్ళిపోయాక మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని కోమలి అంటుంటే రంగడు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో కోమలి అమ్మ, నాన్న వచ్చి ఏమయ్యా! అల్లుడూ నీకిది బాగుందా, శుభ్రంగా మంచి ఉపాధ్యాయుడు అని నీకు పేరు ఉంది, కష్ట పడతావు, ఈ జాతకాల పిచ్చి ఏమిటయ్యా, అయినా గ్రహాల అనుగ్రహానికి పూజలు, జపాలు చేస్తారు కానీ ఏదో చేతబడి చేసే వాళ్ళ లాగ ఈ పొలాల్లోను, గుట్టల్లోను రాత్రి పడుకోవడం ఏమిటీ, ఇక మారవా? అంటూ ఏకరవు పెట్టారు. లేదు మావయ్య, అత్తయ్య, కోమలి నేను ఇక ఆ వీరేశం దగ్గరికి పోను, ఒట్టు ఈ ఒక్కసారి నా మాట వినండి, అన్నాడు రంగడు. ఇంతలో ఆలయ పూజారి కూడా ఆ ఊరి పెద్దలకు విషయం చెప్పడం తో పంచాయితీ పెట్టి రంగడు నీ, వీరేశాన్ని పిలిచారు. ఏమయ్యా వీరేశం నీకసలు బుద్ది ఉందా, ఈ మధ్యనే కదా! నువ్వు ఇలాంటి చెత్త సలహాలు ఇస్తుంటే ఊరి జనం జోలికి పోవద్దని, మీ నాన్నగారు బ్రతిమాలితే నిన్ను ఊరి నుంచి పంపకుండా పోన్లే అని వదిలేసాం. ఏమయ్యా రంగడు నీకైనా జ్ఞానం ఉండొద్దు ఇప్పటికే ఐదారు సార్లు ఇక్కట్ల పాలయి, చావు తప్పి బ్రతికావు, మళ్లీ ఇప్పుడు ఇలా? నువ్వు ఉపాధ్యాయుడు అయి ఉండి, పిల్లల్ని తీర్చి దిద్దేది పోయి నువ్వే ఇలా ఉంటే ఎలా? అని ఇద్దరికీ బాగా చివాట్లు పెడతారు. వీరేశం నువ్వు ఈ ఊర్లో ఇక కనిపించడానికి వీలు లేదు, అలాగే రంగడు నువ్వు మంచి ఉపాధ్యాయుడువి కనుక బుద్దిగా ఉంటా అంటే ఉండు, మీ భార్య మాత్రం పుట్టింటికి వెళుతుంది, ఈ సారి మేము ఆపలేము. వీరేశం ఊరి పెద్దల కాళ్ళ మీద పడి, ఇంకెప్పుడూ అసలు జాతకాలు చూడను, ఎవరికీ చెప్పను, నన్ను నమ్మి ఇదే ఆఖరి అవకాశం ఇవ్వండి అని వేడుకున్నాడు. అతని తండ్రి కూడా వేడుకోవడంతో, సరే ఇంకెప్పుడైన, ఎవరికైనా ఇలాంటిది మళ్లీ జరిగింది అంటే అదే నీకు ఆఖరి రోజు అని చెప్పి పంపుతారు.
రంగడు కూడా క్షమించమని ఇక ఎప్పుడూ జాతకాల జోలికి, ఇలాంటి వారు చెప్పే వ్యర్థ సలహాల జోలికి పోను, నా కోమలిని నాకు దూరం చెయ్యకండి అని అందరి కాళ్ళ మీద పడతాడు. కోమలి కూడా సరే అనే సరికి ఇతనికి కూడా చివరి అవకాశం అని చెప్పి పంపుతారు అందరూ. ఆ తరువాత ఎప్పుడూ తప్పుడు సలహాలు జోలికి పోకుండా కష్ట పడి పని చేసుకుంటూ, ఇంకా మంచి ఉపాధ్యాయుడు అనిపించు కుంటాడు రంగడు. కొంత కాలానికి అక్కడ ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ చెయ్యడం ఆ పదవిలోకి వృత్తి రీత్యా పెద్ద వాడైన రంగడు వెళ్ళడం, అటు పైన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపిక కావడం జరిగింది. నీతి కష్ట పడి పనిచేస్తూ దేవుని, సాటి వారిని నమ్ముకుని ఉంటే ఎప్పుడూ మేలు జరుగుతుంది. తెలిసీతెలియని వారు చెప్పే తప్పుడు సలహాలు ఎప్పుడూ ప్రమాదమే

You May Also Like

4 thoughts on “రంగడి జాతకాల పిచ్చి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!