(అంశం :: “విమర్శించుట తగునా”)
గురివింద గింజ
రచన::చంద్రకళ. దీకొండ
నిజాయతీ,నమ్మకాలే…
పెట్టుబడి అయితే…
పదిమందిలో మంచి పేరే రాబడి…!
మంచితనం,మానవత్వంతో…
నిండైన వ్యక్తిత్వమే నీదైతే…
శాంతి, సంతృప్తులతో
నిండిన హృదయమే…
బదులుగా వచ్చే బహుమతి…!
నీవు అవినీతిని అంటిపెట్టుకుని…
ఎదుటివారిలో నీతిని…
ఆశిస్తే ఎలా…?!
పచ్చ కామెర్ల వాడి చందంగా…
అందరూ నమ్మకద్రోహులే
అని భావిస్తే సరా…?!
నీవు ఇతరులకు ఏమి ఇస్తావో…
అదే నీకు తిరిగి దక్కేది…!
మనసులోని భావనలే…
చేతలలో తేటతెల్లమయ్యేది…
నీ మనసులోని కల్మషమే…
లోకమంతా వెదజల్లబడేది…
దృష్టిని బట్టే కదా సృష్టి …!
తప్పులెంచుటే తప్ప
నీ తప్పులెరుగక…
గురివింద గింజలా
గొప్పలకు పోక…
మనసులో పేరుకున్న
మాలిన్యాన్ని తొలగించు…
మహిలో మనిషి పుట్టుకకు…
బాధ్యత వహించు…!!!