మనసున మాయని ఙ్ఞాపకం

(అంశం :మనసులు దాటని ప్రేమ)

మనసున మాయని ఙ్ఞాపకం

రచయిత:: సత్య కామఋషి  ‘ రుద్ర ‘

నీ జీవితంలో నువ్వు వదులుకోకూడదు అనుకుంటూనే.. కోల్పోయావు అనుకుంటున్న వ్యక్తి ఎవరు..?

ఈ ప్రశ్న కొంచెం టిపికల్..మనలోని చాలామందికి కూడా.. అలాగే ఎంతో మంది గతాన్ని అలా తట్టి లేపే ప్రశ్న…

కొంతమందికి మధుర ఙ్ఞాపకలను గుర్తు చేసి మైమరపించేది. గమ్మత్తైన లోకాలలో విహరింపజేసి, తెలియకుండానే తమ విరిసీ విరియని ముసిముసి నవ్వుల పువ్వులను పెదవులపై విరబూయింపజేసేది.

మరి కొంతమందికి..తాము కోల్పోయిన అమూల్యమైన,  మరపురాని ఙ్ఞాపకాలను, బంధాలను గుర్తు చేసేది. మానీ మానక కాలం మాటున కప్పబడిన పాత గాయాలను రేగ గోకి, బాధించి కళ్లవెంట కన్నీటి ధారలను జాలువారుస్తుంది.

నిజమే కదా మిత్రమా..!!

ఇక నా విషయానికొస్తే, నేను కూడా ఈ విషయం గురించిన తలంపులు అనేక సార్లు నెమరవేసుకుని, ఏవో  కొన్ని చిలిపి ఙ్ఞాపకాలతో ఒకింత మురిసి, ఒకింత బాధపడిన సందర్భాలు
చాలానే ఉన్నాయి.

ఇక విషయంలోకి వెళ్తే, ఇలా చెప్పడం ఎంతవరకు సబబో నాకు తెలియదు. సందర్భం వచ్చింది కనుక నా మనసులోని మాటలను ఇలా పంచుకుంటున్నాను.

ఎవరైనా సరే..ఎంతటి వారైనా, ఏదో ఒకానొక సందర్భంలో
ఫస్ట్ లవ్ లేదా ఫస్ట్ క్రష్, అనే ఓ ఫీల్ కు తప్పక లోనవుతారు. అలాగే నేను కూడా.

నేను నా కెరీర్ స్టార్ట్ చేస్తున్న తొలి రోజులవి. ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. ఒక సాధారణమైన సాదాసీదా జీవితానికి అలవాటుపడిన నాకు, ఆ కార్పొరేటు కంపెనీలో అడుగు పెట్టగానే, ఏదో ఒక ఇంద్ర భవనంలో అడుగుపెట్టిన ఫీల్. ఒకింత విస్మయం,మరో పక్కన ఒకింత భయం.

అలాగే బోయ్స్ కాలేజీలో చదువుకున్నాను. కనుక ఆడవాళ్ళ సావాసం కానీ, పరిచయం గానీ, పెద్దగా తెలియవు నాకు.  అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగాడుతున్న ఆ వాతావరణం కొంచెం కొత్తగా, అలవాటు పడాలేమో అనిపించింది. అది కూడా, సిటీ అమ్మాయిలు. హైఫైగా, పోష్ గా, మోడ్రైన్ గా.. అబ్బో, మనసు కేరింతలు కొడుతూనే కంగారు పడటం మొదలు పెట్టింది.

అలా నెమ్మదిగా కాలంతోపాటు నడుస్తూ ఆ వాతావరణానికి నేను కూడా బాగానే, త్వరగానే అలవాటు పడిపోయాను. కార్పోరేటు కల్చర్..పని ఒత్తిడి..టార్గెట్ లు ఇవన్నీ ఒకవైపు. అప్ప్రైసల్స్..ఓవర్ టైం లు..మరొకవైపు. ఇక వీటితో పాటు ఫ్రెండ్స్, వీకెండ్ పార్టీలు, సరదాలు సంబరాలు..అదేదో మత్తైన గమ్మత్తైన సరికొత్త ప్రపంచం.

ఆ స్పీడ్ అండ ఫాస్ట్ ప్రపంచంలో, ఆ కార్పొరేటు యంత్రపు ఒరవడిలో, ఒక్క విషయం మాత్రం నన్ను ఎప్పుడు తన వైపు ఆకర్షించ సాగింది. అది కూడా, నేను అక్కడ అడుగు పెట్టిన తొలినాళ్ల నుండి. నాకు తెలియకుండానే  నా కళ్లు ఓ మెరుపును అనునిత్యం వెదుకుతూ ఉండేవి. నా చూపూ, నా నడక…అటు వైపే లాగుతూ ఉండేవి.

అదే, నాతో పాటు వర్క్ చేసే ఒక అందమైన అమ్మాయి. తనను చూసిన తొలిచూపులోనే తనకు వశమైపోయాను. మరి అది ఏదైనా మాయో, లేక మంత్రమో తెలియదు. చాలా సీరియస్ గా, మనసారా ఇష్ట పడ్డాను. తనతోనే నా జీవితం పంచుకోవాలని చాలా ఆశ పడేంతలా.

ఎప్పుడూ తననే చూస్తూ ఉండాలనిపించేది. తన గురించి తెలుసుకుందామని, ఇష్టాయిష్టాలు, అలవాట్లు వగైరా.. తననే  గమనిస్తూ ఉండేవాడిని. తను క్యాంటీన్  వెళితే, కాస్త అటూ ఇటూ చేసి, నేను కూడా వెనకాలే పరుగెత్తేవాడిని.

రోజు ఆఫీస్ కి టంచనుగా అటెండ్ అయ్యేవాడిని. జాబ్ మీద ఇంటెరెస్ట్ అనుకునేరు, కాదు. అది తన మీద నాకున్న ఇంటెరెస్ట్. తను ఎప్పుడూ నా కంటికి అందుబాటులో ఉండేలా నా వర్క్ స్పాట్ అరేంజ్ చేసుకునేవాడిని. తనను చూస్తూ, ఆడుతూ పాడుతూ నా వర్క్ చేసుకుంటూ, చాలా ఆక్టివ్ గా ఉండేవాడిని.

తను కూడా నన్ను  ఓరకంట చూస్తుందేమోనని అనిపించేది .ఒక్కోసారి. వర్క్ లో భాగంగా ఏవో డౌట్స్ అని, టీం మీటింగ్స్ అనో, ఆ వంకా ఈ వంకా అంటూ ఏదో ఒక సందర్భంలో తనతో మాట కలిపి, ముచ్చటించిన చిన్న చిన్న ఞ్ఞాపకాలు ఈనాటికీ నేను మరచిపోనేలేదు.

ఇక మా ఫ్రెండ్స్ అందరం సరదాగా కలిసిన సందర్భాల్లో.. వాళ్ళు తన పేరున నన్ను కవ్వించడం,ఆట పట్టించడం చాలా సరదాగా, మనసుకు ఎంతో సంతోషంగా అనిపించేది. నిత్యం తన ఆలోచనలతో, ఊహలలో నాదైన ప్రపంచంలో విహరిస్తూ ఉండేవాడిని.

తనకి ఇండైరెక్ట్ గా నా ప్రేమను పలుమార్లు వ్యక్తపరచడానికి  ప్రయత్నించాను కూడా. మనసులోని ప్రేమను చెప్పటం  పక్కన ఉంచితే, తనతో మామూలుగా మాట్లాడటినికే దైర్యం చేయలేకపోయాను ఆ రోజుల్లో.

       మాటరాని మౌనమే నా భాషగా,
మనసు మాటున తన ఆరాధనే
ధ్యాసగా, కనుల ముందు కదలాడే
నిండైన తన రూపమే నా లోకంగా,
తన పెదవులు విచ్చుకున్న చిరునవ్వు
పువ్వులే నాకు ఆలంబనగా, తన
ఊపిరిలోని వెచ్చదనాన్ని మోసుకొస్తూ
నా మేను తడిమిన చిరుగాలి చెలిమిలో,
ఈ ప్రపంచాన్ని మరచి, కాలాన్ని మరచి
తన్మయాన తేలుతూ గడిపిన ఆ క్షణాలు
ఎన్నెన్నినాళ్లకైనా నేను మరువగలనా..!

కానీ,అనుకోని కొన్ని పరిణామాలు, అనివార్య పరిస్థితుల రిత్యా కొన్నాళ్లకు అక్కడ జాబ్ మానివేయవలసి వచ్చింది. అలా మానివేశాక  కూడా చాలా రోజులు అక్కడున్న నా స్నేహితుల ద్వారా తన గురించిన విశేషాలు ఆరా తీస్తూ గడిపాను.

అప్పటి నా పిరికతనమో, వేరేదైనా కారణమో, ఏమో కూడా తెలియదు. మనసులో పుట్టి, మనసులోనే వికసించి, ఆ మనసును మైమరపించీ, ఓలలాడించిన ప్రేమ చివరికి..
ఆ మనసు గోడలు దాటలేక, దీనంగా మౌనంగా, విఫలమైన భగ్న ప్రేమగా అక్కడే శిధిలమైపోయింది.

అప్పటి ఆ ఙాపకాలు గుర్తొచ్చినప్పుడు, ముఖ్యంగా ‘ఆ పేరు ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో నా చెవిని తాకినా ఇప్పటికీ ఆ శిధిలాల తాలూకు గాయాలు, నా ఈ పిరికి గుండెను పిండేస్తూ, వేధిస్తూనే  ఉంటాయి.

ఎవ్వరికైనా కూడా ప్రేమించడం చాలా సులభమైన పని. కానీ ఆ ప్రేమను బహిర్గతం చేసి, దాన్ని నిలుపుకొని గెలుపు తీరాలకు చేర్చి సఫలమవ్వమే  చాలా కష్టం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!