జీవితంలో విజయం

జీవితంలో విజయం

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

ప్రతీ యువతీయువకులు తమ జీవిత భాగస్వామి విషయంలో ఏవేవో ఆశిస్తూ, ఆశల సౌధాన్ని నిర్మించుకుంటారు. అది బీటలు వారిందా అంతే కన్న కలలు కల్లలాయెనని కన్నీరు నింపుకుంటారు. అది సరికాదు. ముందుగా మంచి పునాది వేసుకోవడమో లేక మంచిగా పునర్నించుకోవడమో చేసుకోవాలి కానీ ఆ కలలు దురాశ సౌధాలుగా మారకూడదు.

నా పేరు భరత్ కుమార్. నాది ప్రభుత్వ ఉద్యోగం. నా భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగే. దానితో మా ఇద్దరికీ చెప్పుకోదగిన ఆర్థిక సమస్యలు లేవు. నాకు ఆఫీసులో నలుగురు మంచి స్నేహితులు వున్నారు. వారితో కలిసే లంచ్ సమయంలో లంచ్ చేస్తాము. అందులో ముగ్గురికి ‘మందు’ బలహీనత. మిగిలిన యిద్దరిలో నాకు స్వీట్స్, ఈశ్వర్ కు మిర్చి బజ్జీ ఇష్టం. ఈ యిష్టాలు ఆఫీసులో కాదండి, మాలో ఎవరో ఒకరి యింటి దగ్గరే సుమండీ. మందు విషయంలో వారు మిమ్మల్ని ఎప్పుడూ వత్తిడి చేయలేదు. నేనెప్పుడైనా, ‘అది’ తియ్యగా వుంటుందా అంటే, ‘నోర్ముయ్, దీని దరిదాపుల్లో మీరిద్దరూ వచ్చారంటే చంపేస్తాం’ అని నవ్వుతూ బెదిరించేవారు.

మేమంతా ఆఫీసులో కష్టపడతాం, పైగా అవినీతికి దూరం. కీ పోస్టుల్లో వున్నాం. అందుకని మాకు కొంతమంది శత్రువులు లేకపోలేదు.
…..‌
నాకు పెళ్ళయ్యి పది సంవత్సరాలు దాటింది. ఇంతవరకూ నా జీవితంలో నెరవేరిన ఆశల సౌధంలో సంతోషంగా వున్నాను. మా ఇద్దర్నీ చూసి, మా బంధువులు కూడా అసూయ పడే వారు. తర్వాత తర్వాత నా సౌధానికి బీటలు పడుతున్నాయా అనిపించింది. దిష్టి తగిలిందో యేమో. మొదలైయ్యాయి ప్రకంపనలు.
……
నా భార్య కూడా ఉద్యోగే కాబట్టి ఇంటి పనులు కలిసే చేసుకునే వారం. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారి అంతా నేను చేసే పరిస్థితికి వచ్చాను. తను తొమ్మిది గంటలకు లేచి, రెడీ అయ్యేసరికి నేను టిఫిన్ చేసి, తనకి టేబుల్ పై పెట్టి, బాక్స్ లలో నాకు, తనకి అన్నం, కూర సర్ది పెట్టేవాడిని. తనని ఆఫీసులో దింపి, నేను మా ఆఫీసుకు వెళ్తాను.

సాయంత్రం ఇంటి పనులు వలన స్నేహితుల్ని కలిసే అవకాశాలు తగ్గాయి. తనకు మొదట్లో ఆఫీసు ఒత్తిడిలే అనుకునే వాడిని, తరువాత తెలిసింది తాను చేస్తున్నది పెద్దగా శ్రమ లేని డిస్పేచ్ విభాగమని.

ఇంటిలో తన పని యేమిటంటే రోజూ నన్ను కారణం లేకుండా సతాయించడం, విసుగు, కోపం, చిరాకు, సణుగుడు, నేనేమి చెప్పినా తడుముకోకుండా వ్యతిరేకించడం. నేనెప్పుడైనా కోపగించానంటే, నా పని అయిపోయిందన్న మాటే. ఈ మార్పుకు కారణం తెలియదు.

ఆఫీస్ పనిలో యిదివరకటి ఉత్సాహం చూపలేక పోతున్నా. ఇంటికి వెళ్ళాలంటే భయం. తనతో యెలా మాట్లాడాలో తెలియడం లేదు. తప్పనిసరిగా మాట్లాడాలంటే తడబాటు, మరుపు వస్తోంది. ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడాలంటే నిబంధనలు. నేనంటే లెక్క లేనితనం, నిర్లక్ష్యం. నాకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా పోయింది. ఎవరితోనైనా ముఖ్య విషయాలు మాట్లాడాలంటే ముందుగా నన్ను ప్రెపేరు చేస్తుంది. నా స్వరంతో నా పెదాలు కదులుతాయంతే, తానే డబ్బింగ్.

ఏదో మానసిక అలజడి. ఆఫీసులో ఎదుటి పక్షం వారితో చేతులు కలిపి తాగుడుకు బానిసయ్యాను. నా స్నేహితులు చెప్పిన మంచి మాటలను డామినేట్ చేస్తూ, నా బాధలు తాగుడుకే ఓటు వేసాయి.

ఎవరో చెపితే చిక్కడపల్లిలో జరిగిన భార్యా భాధితుల సంఘం సమావేశానికి హాజరై, వారి ఉపన్యాసాలకు ముగ్ధుడునై, ఆ సంఘంలో అప్పటికప్పుడు మెంబర్షిప్ తీసుకున్నాను. అక్కడే పరిచయం అయిన సభ్యులకు నా సమస్య చెప్పగానే, విడాకులకు ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే సలహా నా మొహాన్న పాడేసారు.
..‌‌….
నాకు ఒక పాప వుంది. పాప అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాపను చూసే బతుకుతున్నా. తను కూడా అమ్మతో యిబ్బందులు పడుతోంది. నా భార్యకు ‘భార్యతనం’ యెలానూ లేదు, ‘అమ్మతనం’ లేకపోవడం కూడా ఆశ్చర్యంగా వుంది.
……
నా తాగుడు బలహీనత, నా భార్యకు బలమైనది. దాన్ని క్యాష్ చేసుకుని, పదిమందిలో నన్ను అల్లరిపెట్టడం, సానుభూతి పొందడం, అలవాటు అయ్యింది.

రాద్దాంతం చెయ్యకూడదని భరిస్తూ వస్తున్నా. దేనికీ నేను రెస్పాండ్ కావడం మానేసా. రెస్పాండ్ అయితే ఎలావుంటుందో తెలుసు.

మందు తాగడంతో ఆకలి చచ్చిపోయింది. ఆఫీసులో మాత్రం అక్కడ దొరికేదేదో తినడం అలవాటు చేసుకున్నా. ఆరోగ్యం సన్నగిల్లింది. ఇరుగుపొరుగు ఒత్తిడితో, తను ‘నన్ను బయట వాళ్ళతో చెడ్డ చేయకండి’ అంటూ బలవంతంగా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది.

డాక్టర్, వారు సూచించిన ప్రకారం చేయుంచుకున్న మెడికల్ రిపోర్టులు చూసి, అన్నీ దాదాపు నార్మల్ గా వున్నాయి, సరియైన ఆహారం తీసుకుంటూ ఈ మందులు వేసుకోండి, తాగుడు మాత్రం పూర్తిగా మానకపోతే మాత్రం యిబ్బందులు పడతారు’ అంటూ నేను చూచాయగా చెప్పిన మాటలను బట్టి, డాక్టర్ తో తను మాట్లాడే తీరును బట్టి, మీరిద్దరూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ కు వెళ్ళండి అనే సూచన చేసారు.
……

ఈ కాలంలో భార్యాభర్తలకు మానసిక సంఘర్షణలు, ఒత్తిడులు, ఒకరిమీద ఒకరికి అపనమ్మకం, సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవడం, అహంకారం, సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లు ఎక్కువగా వుండటంతో, వారి మధ్య సత్సంబంధాలు దెబ్బ తింటున్నాయి.
……

పూర్వం ఉమ్మడి కుటుంబాలు వుండేవి. కుటుంబ సభ్యులు మధ్య ఏమైనా పొరపొచ్చాలు వస్తే, మిగిలిన కుటుంబ సభ్యులు నచ్చచెప్పి, రాజీ చేసేవారు. కుటుంబం రోడ్డున పడకుండా చూసుకునే వారు.

ప్రస్తుతం ఆలోచనా ధోరణి మారింది. బాధలను పంచుకునే ఆత్మీయులు కరువైనారు. తల్లిదండ్రులను అర్థం చేసుకుని, వారితో కలిసి వుండే పరిస్థితులు కూడా లేవు. అందుకే బయటినుంచి కౌన్సెలింగ్ లు, సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు అవసరమైనారు.
…..‌

నా స్నేహితుడు అంటూవుండే వాడు ‘భార్యాభర్తలు కొంచెం ఎక్కువ తక్కువలో బలహీనతలు వుంటాయి, వారిలో వున్న పాజిటివ్ తత్వాన్ని గమనించి, వివాహ బంధాన్ని, ప్రేమ తత్వాన్ని పెంచుకుంటే జీవితం ఎంతో ఆనందదాయకంగా వుంటుంది. ఆకాశంలో ఆనందపుటంచులు చూడవచ్చు’ అని. కానీ ఎంతవరకూ సాధ్యం. జీవిత భాగస్వాములు యిద్దరూ
కూడా అలాగే అనుకోవాలి కదా!
…..‌

నా స్నేహితులు ఇంటికి వెళ్ళినప్పుడు వారి భార్యలు అన్యోన్యంగా వుండటం చూసి, అనిపించింది మేము కూడా యిదివరకటిలా వుండగలగాలని. ఇద్దరం ఫ్యామిలీ కౌన్సెలింగ్ కు వెళితే మా జీవనం బాగుపడుతుంది అనిపించింది. తనకు చెప్పే ధైర్యం లేదు. మద్యం తాగడం ప్రారంభించిన తర్వాత మద్యం మద్యాన్నే కోరుకుంటుంది. చివరకు అదే మనల్ని దహించి వేస్తుంది అనేది నిజం అనిపించింది.
…‌..‌

నేను బాగా ఆలోచించాను. నా ఆశల సౌధం ఇలా కావడానికి నావంతుగా నేనూ కారణమే. ఎలాగైనా నా ఆశల సౌధాన్ని పునర్నించుకోవాలి.

ఈశ్వర్ ఇల్లు నాకు దగ్గరే. పైగా నా భార్య, ఈశ్వర్ భార్యా మంచి స్నేహితులు. ఈశ్వర్ ఇంటికి వెళ్ళి నా సమస్య చెప్పాను.

‘నువ్వేమీ కంగారు పడకు అన్నయ్యా, తనకు నేను చెప్పి తీసుకుని వస్తాను’ అని భరోసా యిచ్చి, ఏమి చెప్పిందో ఏమిటో మరుసటి రోజే, వారికి తెలుసున్న ఫ్యామిలీ కౌన్సెలర్ దగ్గరకు మమ్మల్ని తీసుకుని వెళ్ళారు ఈశ్వర్ దంపతులు.

ఆయన ఇద్దరికీ విడి విడిగా ప్రశ్న పత్రం యిచ్చి, ఎవరికి వారే పూరించి ఇవ్వాలన్నారు. తరువాత మా ఇద్దరినీ విడి విడిగా రెండుసార్లు, కలిపి ఒకసారి కౌన్సెలింగ్ చేసారు. మానసిక సంబంధమైన ఎక్సర్సైజ్ లు ఇచ్చారు. ఇద్దరూ తమ ప్రవర్తనలు బేరీజు వేసుకున్నారు. రెండురోజులు వరుసగా కౌన్సెలింగ్ చేసారు. చాలా మార్పు వచ్చింది. ఈ కౌన్సెలింగ్ కు నా భార్యకు కూడా నా మీద ప్రేమ వుండటంవల్ల సహకరించి, నాకు ఎంతో బలాన్ని యిచ్చింది.

చివరి రోజు కౌన్సెలింగ్ అయిన తరువాత ఇద్దరం చేతులు కలుపుకుని, కౌన్సెలింగ్ రూం నుంచి నవ్వుకుంటూ వస్తుంటే, ఈశ్వర్ దంపతులు వాళ్ళ జీవితంలో విజయం సాధించినంతగా ఫీల్ అయ్యారు.

పడిపోతున్న నా ఆశల సౌధంలో మా మధ్య వున్న కనిపించని ప్రేమ దీపాన్ని వెలిగించారు. వాళ్ళకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా.
……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!