కంచికి చేరని నా ప్రేమ కథ

(అంశం:: “అర్థం అపార్థం”)

కంచికి చేరని నా ప్రేమ కథ 

రచన:: శాంతి కృష్ణ

అప్పుడు నా వయసు పదిహేనేళ్ళు…. 10th క్లాస్ ఫెరివల్ పార్టీ చూసుకుని, సాయంత్రం ఏడు గంటలప్పుడు, చేతిలో ఉన్న కెమెరాను చూసుకుంటూ, ఆరోజు జరిగిన పార్టీ లో ఫ్రెండ్స్ తో పంచుకున్న సమయాన్ని ఆనందంగా నెమరువేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాను.
మా ఇల్లు ఇంకొద్ది దూరంలో ఉందనగా, హఠాత్తుగా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆనంద్…
లంగావోణిలో భలే ముద్దుగా ఉన్నావ్ బుజ్జమ్మా! ఇంటివరకు తోడు రానా అని అడిగాడు.
నాకు కూడా అప్పుడే ముసురుకుంటున్న చీకటి వల్ల భయంగా ఉండటంతో సరే అన్నాను.
ఇద్దరం మౌనంగా నడుస్తున్నాం. ఆలస్యం అవుతుందన్న కంగారులో నేను కాస్త త్వరగా నడుస్తుంటే, కొంచెం మెల్లగా నడువు బుజ్జమ్మా! దారి బాగోలేదు గా అని ఆనంద్ చెప్పడంతో నడక వేగం తగ్గించాను.
తను ఏమనుకున్నాడో తెలియదుగానీ హఠాత్తుగా నా ముందుకొచ్చి, నా చేతులు పట్టుకొని, *బుజ్జమ్మా… నీ పది పరీక్షలు అయిపోయాక నన్ను పెళ్లిచేసుకుంటావా??!* అని అడిగాడు.
నాకు చాలా కంగారొచ్చేసింది. ఇంట్లో ఇంతకుముందు ఇలాంటి గొడవల చూసిన కారణంగా వెంటనే అలాంటి ఆలోచనలుంటే మళ్ళీ నాతో మాట్లాడొద్దని మృదువుగా చెప్పినా స్థిరంగా చెప్పాను.
ఆనంద్ నా స్నేహితురాలి బావ. బాగా పల్లెటూరు వాళ్ళది. తను అస్సలు చదువుకోలేదు. కానీ సంస్కారం, స్వచ్ఛమైన మనస్సు ఉన్నవాడు. నా స్నేహితురాలి నాన్న ఇల్లు కట్టుకుంటున్నాం, సాయం రమ్మని కబురుపెడితే కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాడు.
ఒకసారి తనకి ఒంట్లో నలతగా ఉండి, వాళ్ళ ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి, నేను మా అమ్మని అడిగి తనకి మందులు వేసి, రోజంతా కాచుకుని ఉన్నాను.
అప్పుడు నాలో తనకు వాళ్ళ అమ్మ కనపడిందని, చేసుకుంటే నన్నే పెళ్ళిచేసుకుంటానని, లేకపోతే ఇలానే ఉంటానని, నన్ను పెళ్లిచేసుకోమని అడిగిన మరుసటిరోజు నేనంటే ఎందుకు ఇష్టమో వివరణ ఇచ్చాడు.
తను చాలా మంచివాడైనా, పెళ్లి చేసుకుంటే నన్ను చదువుకొనివ్వరని, నేను చదువుకోసం కన్న కలలన్నీ కల్లలైపోతాయని భయమేసి తనని దూరంపెడుతూ వచ్చాను.
నా పదోతరగతి అయ్యేసరికి తను వాళ్ళ ఊరువెళ్లిపోయాడు. కానీ ప్రతీ ఆదివారం నన్ను చూడటానికి వచ్చేవాడు.
ఇంటర్ సెకండ్ ఇయర్ చివరిలో ఉండగా నా స్నేహితురాలికి పెళ్లి కుదిరింది. ఆనంద్ నెలరోజులు ముందే వచ్చి అన్ని పనులు చూసుకుంటూ, నన్ను బ్రతిమాలడం మొదలుపెట్టాడు. నేనెమో తప్పించుకుని తిరిగేదాన్ని.
నా స్నేహితురాలి పెళ్లిలో, వాళ్ళ నాన్న నన్ను కట్నాల దగ్గర కూర్చోపెట్టాడు. అదేసమయంలో ఆనంద్ వాళ్ళ అమ్మని, వదినని, అన్నని తీసుకొచ్చి *నేను బుజ్జమ్మని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బుజ్జమ్మే నా పెళ్ళాం* అని చెప్పేసాడు.
మేమందరం కప్పల్లా నోర్లు తెరుచుకుని అలా ఉండిపోయాము. కాసేపటికి తేరుకుని నేను ఏం చెయ్యాలో తెలియక వాళ్ల ఇంట్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చుండిపోయాను (నాకు వాళ్ళ ఇల్లు బాగా అలవాటు).
కాసేపటికి ఆనంద్ లోపలికొచ్చి “సోరి బుజ్జమ్మా!! అమ్మవాళ్ళు రోజూ పెళ్ళి పెళ్ళి అని తినేస్తుంటే నా మనస్సులో మాట చెప్పేసాను. నిన్ను బాధ పెట్టాలని కాదు” అని నా చేతులు పట్టుకొని తల వంచుకున్నాడు.
అదే మొదటిసారి, చివరిసారి కూడా నన్ను తాకడం.
ఈ విషయం తెలిసి నా స్నేహితురాలు కూడా నన్ను బ్రతిమాలడటం మొదలుపెట్టింది ఆనంద్ మంచివాడు పెళ్లి చేసుకోమని. తనకి నేను నాకు చదువుమీదున్న ఆశ కోసం చెప్పాను.
నా స్నేహితురాలు నా మాటలు, ఆశలు ఆనంద్ కి వివరంగా చెప్పేసారికి తను నా చదువు అయ్యేవరకు దూరదేశాలు వెళ్ళిపోయాడు.
రోజులు మంచిగా సాగుతున్నాయి. నా ఆనందం లో తోడు లేకపోయినా, నాకు చిన్న కష్టం వచ్చేసరికి వాళ్ళ అక్కకో, నా స్నేహితురాలికో ఫోన్ చేసి నాతో మాట్లాడేవాడు, ధైర్యం చెప్పేవాడు.
నేను మామూలుగా మాట్లాడినా మనసు తనవైపు మగ్గుచూపటం మొదలు పెట్టింది. చదువు లేకున్నా సంస్కారం ఉండాలి అనుకునే నాకు తనలో ఏ లోపం కనిపించలేదు.
నా చదువు చివరి సంవత్సరానికి వచ్చింది. మావాళ్ళతో మాట్లాడి, పెళ్లికి ఒప్పించి, తనకి చెప్పి సర్ప్రైజ్ చెయ్యాలని ఫోన్ చేసిన నాకు తనకు ఆ తర్వాత రోజే పెళ్లి అనే షాకింగ్ వార్త వినపడింది.
కాసేపు మైండ్ పనిచేయలేదు. అసలు నన్ను అంత పిచ్చిగా ప్రేమించి, ఇలా హఠాత్తుగా వేరే అమ్మాయిని ఎలా పెళ్లిచేసుకుంటున్నాడో అర్ధంకాలేదు.
ఇప్పుడు మావాళ్ళకి కూడా ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మెల్లిగా ఒక వారానికి మా వాళ్ళకి చెప్పాను. పోనీలే అని వాళ్ళు ఊరుకున్నారు కానీ, నా మనసు ఇంకా అంగీకరించలేకపోతుంది.
ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కోసం నా స్నేహితురాలికి ఫోన్ చేసాను. ఊరిలోనే ఉన్నాను ఇంటికి వచ్చి కలువు అని ఫోన్ పెట్టేసింది. దాని మాటలో కూడా ఒకరకమైన వ్యంగ్యం, కోపం, చిరాకు ధ్వనించటం తో, వెంటనే కలవాలని అమ్మకి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లాను.
వెళ్ళగానే, అప్పటివరకు ఉన్న ఆవేశాన్ని అణచుకోవడానికి అన్నట్టు నన్ను లాగిపెట్టి ఒక్కటిచ్చింది. అది ఎందుకు కొడుతుందో తెలియక చెంపమీద చేతితో దానివైపు అయోమయంగా అలాగే చూస్తూ నిల్చున్నాను.
వాడికి చదువులేదు అని నీకు వాడు పరిచాయమైనప్పుడే తెల్సు కదా! సిటీలో హాస్టల్ లో ఉండి చదువుకొని, అక్కడివాళ్లను చూసేసరికి కొత్త ఆశలు పుట్టుకొచ్చాయా?? వీడిని మర్చిపోయి అక్కడ ఎవరినో ప్రేమించి పెళ్లికి కూడా రెడి ఐపోయావంటగా!! అక్కడ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటగా!!! ఇంకా నాతో ఏం మాట్లాడటానికి వచ్చావ్?! మా బావ ఎంత ప్రేమించాడు నిన్ను!! నువ్వు ఇలాంటిదానివానుకోలేదు… అంటూ ఆపకుండా మాట్లాడుతూనే ఉంది.
ఇంకా చాలు ఆపు! ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా?? నేను ఎవరినో ప్రేమించటమేంటి అని దానిమీదికి చాలా ఆవేశంగా వెళ్ళాను. దానిలా కొట్టలేదు కానీ కొట్టినంత పనిచేశాను.
మా అమ్మ వాళ్ళతో మా పెళ్ళికొసం మాట్లాడటం, తనకోసం ఫోన్ చేస్తే, తనని మాట్లాడనివ్వకుండా ఎవరో తన పెళ్లి కోసం చెప్పడం…… అన్ని చెప్పి బోరుమని ఏడ్చాను.
అది కూడా నాతో పాటు బాధపడినా జరిగినదాన్ని మార్చలేమని, బాధపడొద్దని నన్ను ఓదార్చడానికి ప్రయత్నించింది. ఈ విషయాలేవి ఆనంద్ కి చెప్పొద్దని, చెప్తే నా మీద ప్రేమతో చేసుకున్న అమ్మాయిని సరిగా చేసుకోలేడని నా స్నేహితురాలి దగ్గర మాట తీసుకొని వచ్చేసాను.
మర్చిపోవడానికి సమయం పట్టినా అన్ని గాయాలను మాన్చగల శక్తి కాలానికి ఉందిగా!
మెల్లగా మా డైలీ రొటీన్ లో పడిపోయాను.
నన్ను ప్రేమించే వ్యక్తితో నా వివాహం జరిగింది. నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఆనంద్ కి కూడా ఇద్దరు పిల్లలు.
నాలుగు రోజుల క్రితం ఆనంద్ కనిపించాడు. తన పెళ్లి అయ్యాక చాలాసార్లు కనిపించినా ఆ చూపులో ఒకరకమైన ఛీత్కారం కనిపించేది. కానీ ఇప్పుడు అదేమి లేదు!! పైగా నన్ను మొదటిసారి పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు ఉన్న అదే ప్రేమ! *ఎలా ఉన్నావ్ బుజ్జమ్మా* అని ఒక తియ్యని ప్రేమపూరిత పలకరింపు. ఆ మాట వినగానే ఏడుపొచ్చేసింది. చాలా కష్టపడి తమాయించుకొని, తల ఊపి మ్మ్ అని మాత్రం అనగలిగాను.
నాకు అనుమానమొచ్చి నా స్నేహితురాలికి ఫోన్ చేస్తే, ఏదో సందర్భంగా నా గురించి మాట్లాడుతూ ఆనంద్ నన్ను తిడుతుంటే, తట్టుకోలేక, ఇప్పుడైనా అర్ధం చేసుకుంటాడాని జరిగిన విషయం చెప్పేశానని చెప్పింది.
ఇప్పుడు అర్ధం చేసుకుంటే ఏం లాభం?! ఎవరో నేనంటే కిట్టనివారు ఏవో చెప్తే నమ్మేసాడు. అలా నన్ను అపార్ధం చేసుకోకుండా అప్పుడే నిలదీసి ఉంటే ఇప్పుడు బాధపడాల్సిన అవసరమొచ్చేది కాదు కదా!!!
అయినా దేవుడు నాకు అన్యాయం చెయ్యలేదు. గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్తని, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లల్ని ఇచ్చి నా జీవితాన్ని సంపూర్ణం చేసాడు.

You May Also Like

One thought on “కంచికి చేరని నా ప్రేమ కథ

  1. Chala bagundhi Shanthi Garu. Oko sari అయిన వాళ్ళే మోసం చేస్తుంటారు. ఎది జరిగినా మన మంచికే అని అనుకునే వాళ్ళకి దేవుడు మంచే చేస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!