తొందర పడకే కోకిల

తొందర పడకే కోకిల

రచన::సావిత్రి కోవూరు

“ఏంటే ఇంటర్ కూడా కంప్లీట్ కాలేదు. అప్పుడే నీకు బాయ్ఫ్రెండ్స్ కావాల్సి వచ్చారా? బుద్ధుందా లేదా నోరు మూసుకొని బుద్దిగా చదువుకో. పిచ్చిపిచ్చి వేషాలు వెయ్యకు” అన్నది ప్రభ.

“పిచ్చి వేషాలు ఏంటి మమ్మీ? బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన చెడిపోయినట్టా” అన్నది అనన్య.

“బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పు లేదు. కానీ వాళ్లతో ఊరంతా తిరుగుతూ, లిమిట్స్ దాటితె భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. నీకు తెలియదు. పుట్టినరోజు నాడు తిట్లు తినకు. ఈ రోజు నీ కజిన్స్ ని, క్లోజ్ ఫ్రెండ్స్ ని పిలుచుకుని, సాయంత్రం కేక్ కట్ చేసిన తర్వాత బయట డిన్నర్ చేసి, ఆ తర్వాత సినిమాకి వెళ్దాం. అంతేగాని ఒక్క దానివి బాయ్ ఫ్రెండ్ తో సినిమాకెడతాను. డిన్నర్ బయట చేస్తానంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. నేను ఒప్పుకోను” అని గట్టిగా అరుస్తుంది కూతురు పైన నా శ్రీమతి ప్రభ.

“అదే ఎందుకు కుదురదు అంటున్నాను. నీవు చెప్పేది ప్రతి సంవత్సరం చేస్తున్నదేగ. ఈ సంవత్సరం నా ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తాను.”

“మళ్లీ అదే అంటావ్. నోరు మూసుకుని చెప్పినట్టు విను.”

“లేదు మమ్మీ నీవు ఇంకా పాత కాలం లోనే ఉన్నావు. సినిమాలు చూసి నాలెడ్జ్ పెంచుకో. సినిమాల్లో హై స్కూల్ నుండే బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లు ప్రేమించుకుని చక్కగా ఎంజాయ్ చేస్తారు.”

“చక్కగా ఎంజాయ్ చేయడం ఏంటి? మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటున్నారు. మరీ హైస్కూల్లో ప్రేమించుకోవడం ఏంటి? సినిమాలు తీసే వాళ్ళు కొంచెమైన ఆలోచించాలి. నీలాంటి పైత్యపు పిల్లలు కూడా ఉంటారని సినిమాలను చూసి అనుకరిస్తారని, మా ప్రాణాల మీదకు తెస్తారని వాళ్ళకు తెలియదు. కొందరేమో హైస్కూల్  లోనె ప్రేమ అంటారు, కొందరేమో అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా, వేధించి, వేధించి పెళ్లి చేసుకోవాలని చూపిస్తారు. కొందరేమో పుట్టినా, చచ్చినా, పాస్ అయిన, ఫెయిల్ అయిన, పండుగొచ్చిన, విషాదం వచ్చినా, పెళ్లి కుదిరినా , విడాకులొచ్చినా మందు పార్టీలే. పెళ్లికాకముందు బ్యాచ్ లర్స్ పార్టీలని, పెళ్లి అయినాక పెళ్లి అయిందని పార్టీ, అని ప్రెగ్నెంట్ అయిందని, పిల్ల పుట్టిందని, బారసాల జరిగిందని, బడికి వెళ్లిందని ప్రతి దానికి తాగుడు పార్టీలు పెడతారు. ఇంకా కొందరు ఫ్రెండ్స్ ని తాగమని బలవంతం చేసి అలవాటు లేనివాళ్ళకు కూడ నేర్పి తాగుబోతులను చేస్తారు. కొందరు తండ్రులే కొడుకులను కూర్చోబెట్టుకుని తాగుతారు. ఇంకా ఇప్పుడు ఆడపిల్లలు కూడ  క్లబ్స్ లో విపరీతంగ తాగినట్టు చూపిస్తున్నారు. ఇదేనా వినోదం అంటే. అవి చూసి ఎంత మంది యువత తాగుబోతులు అవుతున్నారు. అలా తాగడమే మన కల్చర్ అనే స్థితికి వచ్చారు యువత. పూర్వం ఇలాగే ఉండేవా? సినిమాలు. ఆ సినిమాలు సక్సెస్ కాలేదా? నీవు కూడా సినిమాలను చూసి ఇమిటేట్ చేస్తానంటే నా దగ్గర కూదరదు.” అన్నది ప్రభ.

“అమ్మ నీ స్పీచ్ ఆపుతావా? విని విని విసిగి పోయాను”అని అనన్య గట్టిగా అరుస్తూ ఉండగా

ఇదంత వింటున్న సుధీర్, ఇక వీళ్ళ వాదన ఆగేది కాదని “నువ్వు ఊరుకో ప్రభ కాలం మారింది. పిల్లలకు కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. చూసీ చూడనట్టు వదిలేయ్యాలి. అవునా అనన్యా” అన్నాడు సుధీర్.

“అలా చెప్పండి నాన్న. అమ్మ చూడండి రోజు ఇదే గోల చెబితే వినిపించుకోదు” అన్నది అనన్య.

“మీరు కూడా ఏంటండీ అలా మాట్లాడుతారు. అది అడ్డమైన తిరుగుళ్ళు తిరిగితే, దాని భవిష్యత్తు ఏం కావాలి.దానిపైనే ప్రాణాలు పెట్టుకున్నా మనమేవ్వాలి.”అన్నది ప్రభ.

సుధీర్ కళ్ళతోనే నువ్వాగు అన్నట్టు చూసి,
“అనన్య ఈరోజు నీకు సరితక్క డ్రెస్సు కొన్నాదట వాళ్ళింటికి రమ్మన్నది. వెళదామా?” అన్నాడు సుధీర్.

“సరే నాన్న ఒక్క పది నిమిషాలు” అని వెంటనే రెడీ అయి వచ్చి  నాన్నతో కలిసి వాళ్ళ పెద్దన్నాన్న ఇంటి కెళ్ళింది అనన్య.

“సరితా! అనన్యకి ఇంట్లో చాల బోర్ కొడుతుందట చూడు” అన్నాడు.

“సరే చిన్నాన్న” అని అనన్యని లోపలికి తీసుకువెళ్ళింది సరిత.

అక్కడ  సరితా వాళ్ళమ్మకి సాయం చేస్తున్న వినుతను చూసి “ఈ అమ్మాయి మీ క్లాస్మేట్ వినుత కదా అక్కా.మీ ఇంట్లో ఉందేంటక్కా”అన్నది అనన్య.

“అవును నా క్లాస్మేట్ వినుత నీక్కూడ తెలుసు కదా. ఇంటర్లోనే ఎవరో అబ్బాయిని ప్రేమించి దాన్ని జీవితం అదే నాశనం చేసుకుంది. ఇంట్లోంచి పారిపోయి ఫ్రెండ్స్ సహాయంతో పెళ్లి చేసుకున్నారు. ప్రాణాలన్నీ దీనిపై పెట్టుకున్నా తల్లిదండ్రులు అది అలా వెళ్ళి పోవడం తట్టుకోలేక కొన్ని రోజులకే స్లీపింగ్ పిల్స్ తిని ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ బాబాయ్ లు పంచుకున్నారు. తీసుక పోయిన పైసలన్ని ఐపోగానె బాయ్ ఫ్రెండ్ ఒకరోజు చెప్పా పెట్టకుండా తనని వదలిపెట్టి, వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి పోయాడు.

తనకు దిక్కుతోచక ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళితే “మా అబ్బాయి కి మొన్ననే పెళ్లయింది. నీలాంటి లేచిపోయిన పిల్ల ఎప్పటికీ మా కోడలు కాలేదు. అసలు నువ్వు చేసిన ఘనకార్యానికి నీ తల్లిదండ్రుల ముఖమెవ్వరికి చూపలేక చనిపోయారు. మళ్లీసారికి మా వాకిట్లో కొస్తే మనుషులను పెట్టి కొట్టిస్తాం. మా అబ్బాయి చదువు అంత పాడు చేసి, వాడికి భవిష్యత్తు లేకుండా చేసావు. నీకు దిక్కున్న చోట చెప్పుకొపో” అని ముఖం మీదనే తలుపు వేసారట.

వినుత దగ్గర డబ్బు లేదు, చెప్పుకోవడానికి మనిషి లేడు.ఎటు వెళ్ళాలో తెలియక బస్టాప్ లో రోజంతా కూర్చుని, కూర్చుని తిండి కూడా తిననందు వలన స్పృహ తప్పి పడిపోయింది. నేను షాపింగ్ నుండి వస్తూ గుంపుగా జనాలు మూగివుంటే ఏంటాని చూస్తే అక్కడ వినుత స్పృహ తప్పి పడిపోయి ఉంది. వెంటనే  హాస్పటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాను. ఎన్నో రోజులుగా తిండి లేనందున అలా అయిందని, డాక్టర్, బలానికి మందులు రాసి, మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు.

అడ్రస్ చెప్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాననేసరికి, తన కథ అంతా చెప్పి నన్నెందుకు బ్రతికించావు సరితా, నాకెవ్వరు లేరు. అమ్మ నాన్న చనిపోయారు. బాబాయ్ లు ఆస్తి అడుగుతానేమోనని ‘ నీ వల్లనే మా అన్నయ్య వదిన చనిపోయారు. నీ పాపపు ముఖం మళ్ళీ మాకు చూపెట్టకు. నిన్ను చూస్తే మా పిల్లలు కూడా నీ లా తయారవుతారు.మళ్ళీ ఎప్పుడు మా ఇంటికి రాకు’ అని తలుపులేసుకన్నారట. తన అమ్మానాన్న గారాబం చేసి స్వేచ్ఛని ఇచ్చినందుకు తను వాళ్లకు మనశ్శాంతి లేకుండా మరణించేలా చేసినందుకు ఇంక తను ఎవరి కొరకు బ్రతకాలి. ఏం చూసుకొని బ్రతకాలి అని ఏడుస్తూ ఉంటే, మా ఇంటికి తీసుకు వచ్చాను. అమ్మ వాళ్ళు తన కథంతా విని “పోనిలే ఏదైన  జీవనోపాధి దొరికేవరకు మన ఇంట్లో ఉండని” అన్నారు. వచ్చినప్పటినుండి వద్దంటున్నా వినకుండా, వంటపని, ఇంటిపని చేస్తూ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చదవడానికి ఫీజు కట్టింది. ఇది వినుత కథ” అన్నది సరిత.

“మరి ఆ అబ్బాయి మీద కేస్ వేయలేదా అక్కా?” అన్నది అనన్య

“కేసా? ఎవరేస్తారు? తనకు ఎవరు సపోర్ట్ లేరు. ఆ అబ్బాయి వాళ్లు బాగా పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు, వాళ్లపై కేసు వేస్తే డబ్బు, టైం అని వేస్ట్ తప్ప న్యాయం జరగదు.ఇంకా ఏ కేసులనో ఇరికించి మనశ్శాంతి లేకుండా చేస్తారు.తనకు సపోర్ట్ చేసిన వాళ్లను కూడా వేధిస్తారు. అంత రిస్క్ తీసుకోవడానికి తనకు ఎవరూ లేరు. అందుకే చేసిన తొందరపాటు, అనాలోచిత పని వల్ల తల్లిదండ్రులను పోగొట్టుకోవడమే పెద్ద శిక్ష తనకు. ఇంకా కేసు వేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవడమెందుకని ఊరుకుండి పోయింది.” అన్నది సరిత.

అనన్యకు మెల్లగా జ్ఞానోదయం అవసాగింది. ఇంటికొచ్చాక తల్లితో “అమ్మ సారీ, ఇప్పటినుంచి ఈ ఫ్రెండ్షిప్ లన్ని  మానేసి చదువు పైన నా మనసు లగ్నం చేస్తాను. నన్ను క్షమించు” అని రూమ్ లోకి వెళ్ళిపోయింది.

సుధీర్,  వినుత జీవితం అల్లరిచిల్లరిగా తిరగడం వల్ల ఎలా అయ్యింది, ప్రత్యక్షంగా చూపెట్టడం వల్ల తన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని సంతోషించాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!