నమ్మకం

(అంశం:: “అర్థం అపార్థం”)

నమ్మకం 

రచన:: నామని సుజనాదేవి

లేడీస్ కర్చీఫ్ భర్త పాయింట్ జేబులో చూసి నిర్ఘాంత పోయింది మాలతి. అప్పటికే భర్త ఆఫీస్ కి వెళ్లి పోయాడు. మనసు అల్ల కల్లోలం అయ్యింది. కాని ఆమెకు తెలుసు భర్త తనను ఎంతలా ప్రేమిస్తాడో! అందుకే ఆ విషయం మర్చిపోవడానికి ప్రయత్నించి సఫలం అయింది.
తెల్లవారి ఉన్న తమ పెళ్లి రోజు కోసం భర్తకు తెలియకుండా మంచి గిఫ్ట్ తీసుకోవడానికి మధు ఆఫీస్ కి వెళ్ళగానే పని తీర్చుకుని బయట పడింది మాలతి.
నాలుగైదు షాప్లు తిరిగి అతనికిష్టమైన రంగులో మంచి షర్ట్, గుడికి వేసుకు వెళ్ళడానికి లాల్చీ పైజామా తీసుకుంది.
ఆటో కోసం చూస్తూ నిలుచుంది . ఇంతలో అల్లంత దూరంలో వస్తున్నా కారు తమ కారులగానే అనిపించింది. బస్టాప్ లో చాలా రద్దీ ఉంది. పైగా రోడ్డు పై కూడా చాలా వాహనాలు ఉన్నాయి. అయినా కారులో డ్రైవింగ్ చేస్తున్న మధు, పక్కన నవ్వుతూ ఉన్న అందాల చుక్క కనపడింది. చటుక్కున కళ్ళల్లో ఆరోజు దొరికిన కర్చీఫ్ మెదిలింది. హడావుడిలో భర్త దగ్గర ఆ విషయం ఎప్పుడూ చర్చకు రాలేదు.
ఇప్పుడు ఎదో అనుమానం మనసును తోలిచేస్తుంటే అటువైపే చూసింది. ఆ కారు స్లో అవుతూ కుడి వైపు ఉన్న పెద్ద రెస్టారెంట్ ముందు ఆగింది. అందులో నుండి మధు , అందమైన మెరుపుతీగ లాంటి అమ్మాయి దిగారు. ఇద్దరూ నవ్వుతూ ఆ రెస్టారెంట్ లోకి వెళ్ళడం కనబడింది. మాలతి మనసు వికలమయింది. ఎలా ఇంట్లోకి వచ్చి పడిందో ఆమెకే తెలియదు.
రాత్రి చాలా పొద్దుపోయి వచ్చాడు మధు.
‘చాలా అలసిపోయానోయ్ ! చాలా వర్క్ అయిపోయింది. త్వరగా వడ్డించు నిద్ర ముంచుకొస్తోంది.’ అంటూ తినేసి పడుకుండి పోయాడు.
తన ముభావం చూసి అలా ఎందుకు ఉన్నావని అడుగుతాడని , తానూ అలిగి విషయం అడిగి రెడ్ హాండేడ్ గా పట్టు పడినందుకు కడిగేయాలని ఎన్నో అనుకుంది. హాయిగా నిద్ర పోతున్న భర్తను చూస్తూ , ఆ రాత్రంతా జాగారణే చేసింది మాలతి.
తెల్లవారి విషెస్ చెబుతూ ముద్దు పెట్టుకుంటున్న భర్తను కోపంగా తోసేసింది మాలతి.
‘ఏంటోయ్! పొద్దు పొద్దున్నే అంత కోపం? ఈ రోజు మన పెళ్ళి రోజు కాదా! అదేంటి కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి. ఆరోగ్యం బాలేదా? ‘ అంటూ ఆందోళన గ చేయి నుదుటి పై పెట్టి చూస్తున్న మధు చేయి విసురుగా తీసేస్తూ ,
‘ఇప్పటికి ఇంకా ఏమీ కాలేదు. మీ కొత్త ప్రేయసి తో చెట్టాపట్టాలు చూసి ఇక ఇప్పుడు కావాలి .’ అంటుంటేనే నిన్నటి నుండి పడిన మానసిక క్షోభ కన్నీళ్ళ రూపంలో వర్షించింది.
‘ఏయ్! నువ్వు నా బంగారం కదూ! ఏంటి ఈ కన్నీరు? కొత్త [ప్రేయసి ఏమిటి? నాకేం అర్ధం కావడం లేదు’
‘అర్ధం కాదు లేండి. నాకు తెలియకుండా హోటల్స్ వెళ్ళడం కలిసి తిరిగడం మాత్రం తెలుసు’
‘ఎవరి గురించి నువ్వు మాట్లాడేది’
‘ఈ కర్చీఫ్ ఎవరిదీ చెప్పండి’
‘అది అర్చన ది. తను మొన్న ఆఫీస్ లో తల తిరిగి పడిపోతే, స్వాతి తో కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. ఇద్దరూ పరిక్ష కోసం డాక్టర్ దగ్గరకు లోపలకి వెళ్ళినప్పుడు పొరపాటున తను కూర్చున్న చోట ఉన్న కర్చీఫ్ వచ్చాక వారికి ఇవ్వవచ్చని జేబులో పెట్టుకుని మర్చిపోయాను.’
‘కధలు బాగా నేర్చారు. అలాగే సరదాగానే ఆఫీస్ ఎగ్గొట్టి రెస్టారెంట్ లలో పార్టీలు చేసుకున్నాం అనికూడా చెప్పండి’
‘అరె! మాలా! నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఈ రోజు మన పెళ్లిరోజు అని నీకు మంచి చీర తీసుకోవడానికి ఆడవారికి బాగా తెలుస్తాయని అర్చన ను షాపింగ్ కి తీసుకెళ్ళాను. అక్కడ చీర కొన్నాక మరీ అలా వస్తే బావుండదని తనను కాఫీ ఇప్పించడానికి రెస్టారెంట్ కి తీసుకెళ్ళాను. కావాలంటే ఇదిగో ఈ చీర చూడు ‘ అంటూ పాకెట్ చూపించాడు మధు. ఇంతలో మాలతి సెల్ మోగింది. తెలియని ఫోన్ నెంబర్.
‘వదినా! నా పేరు అర్చన. మధు సార్ దగ్గర క్లర్క్ ని. మీకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు. మీకు సారీ మా సార్ చూపించారను కుంటా కదా! అది, ఆ డిజైన్ బ్లౌజు రెండూ నా సెలెక్షనే బావున్నాయా ? మీరంటే మాసార్ కి ఎంత ప్రేమో? చివరకు తన పాస్ వర్డ్ కూడా మీ పేరే పెట్టుకున్నారు తెలుసా! అది నాకెలా తెలిసిందనా మొన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వర్క్ విషయం లో సార్ చెప్పాల్సి వచ్చింది. అంత మంచి భర్త ప్రేమ పొందడం ఒక అదృష్టం వదినా! ఎందుకంటే అది కోల్పోయిన వారికే దాని విలువ తెలుస్తుంది. అలాంటి ఒక విధి వంచితను నేను. సారీ మొదటి పరిచయం లోనే ఏదో ఏదో వాగేస్తున్నాను. మీకు గుడికి వెళ్ళడానికి సమయం అయిపోతుందేమో! అన్నట్లు నేనే స్వయంగా మీ అభిప్రాయం తెలుసుకోవడానికి , సార్ దగ్గర మీ సెల్ నెంబర్ తీసుకున్నా! ‘
‘థాంక్ యు సో మచ్ అమ్మా! చాలా బావుంది. ఒక సారి ఇంటికి రామ్మా’ అంది మాలతి.
‘ఒకే. ఉంటానేం ‘ అంటూ పెట్టేయగానే , ఆర్తిగా భర్తను చుట్టేసింది మాలతి.
అయోమయంగా చూస్తున్న మధుతో , ‘సారీ నండి. నన్ను క్షమించండి. మిమ్మల్ని అర్ధం చేసుకోక అపార్ధం చేసుకున్నాను’ అంది.
‘ప్రేమకు నమ్మకం పునాది రా! నన్ను అనుమానించావన గానే బాధేసింది. కలలోనైనా, ఇలలో నైనా నా ప్రేమ దేవత నువ్వే!’ అంటూ ఇంకా దగ్గరగా పొదవుకున్నాడు మధు. దూరంగా జేగంటలు శుభమంటూ మోగాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!