అంశం : మనస్సాక్షి
మనస్సాక్షి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: మాధురి మేక
నీతో అడుగేస్తే సాగదు జీవనం
ప్రతి చోట చేయాలి ఎదో ఒక రణం
బాధ్యతలు, బంధాలు
బాహ్య ప్రపంచపు నియమాలు
ఇవేవీ పట్టవు నీకు
అందుకే వేరు నీ నీతి, వేరు నీ సూక్తి
తప్పు అని తెలిసినా తలవంచుకు పోతాను
నోరు ఉన్నా తెరవకుండా నాకెందుకు అంటాను
పెదవంచున నీ మాటను బంధిస్తాను
లోకం తీరు నీకు తెలియదని నిందిస్తాను.
నాలోనే ఉంటూ నిత్యం నాతో సంఘర్షణ
నువ్వే నా నిజం, అయినా నీకు తప్పదు మౌనం
ప్రతి రాత్రి నీకిస్తా ఓదార్పు,
ఉదయానికి రాదు నాలో ఏ మార్పు.
నే చేసే ప్రతి పనికి నువ్వే సాక్షి
నన్ను తట్టి నిజాలు చూపే మనస్సాక్షి!