మానవీయులు
రచన: మక్కువ.అరుణ కుమారి
పారిశుద్ధ్య కార్మికులారా
సఫాయి వీరుల్లారా
తడిచెత్త, పొడిచెత్త
పశువుల పేడ,పక్షుల రెట్ట
మనుషుల వ్యర్థాలు కాలువల కుళ్ళు ,సకల కల్మషాలను రోతపడక తొలగించి
రాదారులను పరిసరాలను
అద్దంలా మెరిపించే సోదరుల్లారా!
ఆరోగ్య స్వర్గాన్ని చేర్చేందుకు
అపారిశుధ్ధ్య వైతరణిని దాటించే దేవదూతల్లారా!
శ్లాఘనీయం మీ సేవలు
మానవీయం మీ విలువలు.
గడ్డుకాలంలోనూ గొడ్డుచాకిరి చేసారు
కరోనా కల్లోలంలోనూ కడగండ్లు పడ్డారు
ప్రాణాలను ఫణంగా పెట్టారు
పారిశుధ్ధ్యానికి పెద్దపీటేసారు
ప్రాణులందరిని పరిరక్షించారు
ఏమిచ్చి తీర్చగలం మీ ఋణం?
ఎవరితో పోల్చగలం మీ త్యాగం?
కుష్ఠురోగులను కన్నతల్లిలా సాకిన మథర్థెరిస్సాలా?
పాప పంకితుల ప్రక్షాళనకు
శిలువ మోసిన క్రీస్తులా?
శ్లాఘనీయం మీ సేవలు
మానవీయం మీ విలువలు
***