మంచి మనసులు

మంచి మనసులు

రచన:: సావిత్రి కోవూరు 

“ఏవండీ వీడు ఇంకా రాలేదు ఏమిటండి” అన్నది రమాదేవి.

“వస్తాడు లేవే ఎయిర్ పోర్ట్ మన ఇంటి పక్కన ఉందా ఏంటి? ఫ్లైట్ దిగి ‘లగేజ్’ తీసుకొని వచ్చేసరికి టైం పడుతుంది కదా.ఇప్పటికి మూడుసార్లు అడిగావ్.” అన్నాడు రవీందర్.

“మామూలుగా ఇప్పటికి రావాలి కదా” అంటుండగానే, ఇంటి ముందర టాక్సీ ఆగడం, దానిలో నుంచి విజయ్ దిగడం జరిగింది.

విజయ్ లోపలికొచ్చి “పిన్ని బాబాయ్ లకు ‘పాదాభివందనం’ చేశాడు.

“ఏరా ఎన్ని దేశాలు తిరిగినా, నీ పద్ధతి ఏమీ మారలేదురా” అన్నది రమాదేవి.

“లేదు పిన్ని మంచి పద్ధతులు ఎప్పటికీ మార్చుకోకూడదని చెప్పారు మా గురువుగారు” అన్నాడు విజయ్.

“సరే తొందరగా స్నానం చేసి రా వడ్డించేస్తాను.”

“సరే పిన్ని” అని లోపలికి వెళ్ళాడు.

ఇంతలోకే ఫోన్ మోగింది ఏదో తెలియని నంబర్ నుండి. “రమాదేవి ఫోన్ ఎత్తి “హలో” అనగానే,

“హలో బాగున్నారా అంటీ. నేను ప్రసన్నను. గుర్తించారా” అన్నది. అవతల వైపు నుండి కొత్త గొంతు.

“ప్రసన్నా ఏ ప్రసన్నానమ్మా?” అన్నది రమాదేవి.

“నేను ఆంటీ మీ ఇంటి ప్రక్కన ఉండేవాళ్ళం”

“ప్రసన్నా, నీవా అమ్మా? ఎన్నాళ్లయిందో నీ వాయిస్ విని. ఎక్కడి నుండి, బాగున్నావా? ఇండియా ఎప్పుడొస్తున్నావ్.” అన్నది.

“ఆ బాగున్నాను ఆంటీ మొన్ననే వచ్చానాంటీ. ఒక ఫ్రెండ్ మ్యారేజ్  ఉంటే. వాళ్ళ ఇంట్లోనే ఉన్నానాంటీ. మిమ్మల్ని ఒకసారి చూడాలని కాల్ చేశాను. వీలవుతుందా అంటీ” అన్నది ప్రసన్న.

“అయ్యో రామ మా ఇంటికి రావడానికి నీకు పర్మిషన్ కావాలా? చిన్నప్పుడు మా ఇంట్లో తిరిగిన పిల్లవు. నీవు ఎప్పుడు రావాలనుకున్న అప్పుడు హాయిగా రావచ్చు. ఎప్పుడు వస్తావు”అని అడిగింది రమాదేవి.

“రేపు సాయంత్రం వస్తానాంటీ” అన్నది ప్రసన్న.

“తప్పకుండా రా నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాము.” అన్నది.

“సరేనాంటీ ఉంటాను మరి” అన్నది.

“సరేనమ్మా” అని ఫోన్ పెట్టేసింది.

రమాదేవి, రాజారావు, విజయ్ ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ భోజనాలు ముగించి వాకిట్లో ఉన్న వేప చెట్టు కింద ఉన్న అరుగుపై కూర్చున్నారు.

“పిన్నీ, బాబాయి మీరు, మీ ఆప్యాయత, పద్ధతులు, చివరికి మీ ఇల్లు కూడా మారలేదు. కాకపోతే వాకిలి చాలా పెద్దది అయ్యింది. మామిడి చెట్లు వేపచెట్టు సపోటా చెట్లు మొదలైన పండ్ల చెట్లన్ని అలాగే ఉన్నాయి. ఈ రకరకాల పూల మొక్కలు, మల్లె తీగలు, కూరగాయల మొక్కలు, చేద బావి, దానిచుట్టూ చప్టా, పర్ణశాలను తలపించే ఈ వాతావరణము ఏర్పరుచుకోవడం ఎలా సాధ్యమా అని అనిపిస్తుంది నాకు. అందరూ ఇంటి స్థలాలన్నీ ఫ్లాట్స్ కి ఇచ్చేసి,  అగ్గిపెట్టె లాంటి ఇళ్లల్లో నివసిస్తుంటే, మీరు మాత్రం ఇంత పెద్ద స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణములో ఆనందంగా జీవిస్తున్నారు. మీ అభిరుచికి నా జోహార్లు” అన్నాడు.

“అదేమో రా మేము ఇద్దరం చిన్నప్పటినుండి ఇలాంటి వాతావరణంలో ఉండాలని కలలు కన్నాం. భగవంతుడి దయవల్ల రిటైర్ అయ్యే సరికి పిల్లల బాధ్యతలు తీరినవి. ఇద్దరు ఆడపిల్లలకు ఏ లోటు లేని సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాము నీకు తెలుసు కదా! ప్రశాంత్ కూడ అమెరికాకే వచ్చింతర్వాత బోలెడంత టైము. రిటైర్మెంట్ అప్పుడు వచ్చిన డబ్బులను ప్రక్కనే అమ్మకానికి వచ్చిన వెయ్యి గజాల స్థలానికి పెట్టి మా కలలు నెరవేర్చుకుంటున్నాము. ప్రశాంత్ వాళ్ళు వచ్చినప్పుడు నెల రోజులు ఆడపిల్లలు, అల్లుళ్ళు, పిల్లలు ఇక్కడే ఉంటారు. ఆ నెల రోజులు పండగలా గడిచిపోతోంది. ఆరుగురు మనవలు, మనుమరాళ్ళు ఈ చెట్లకు ఉయ్యాలలు కట్టుకుని ఆడుకుంటుంటే చూసుకుని ఆనందంగా గడిపేస్తాం. ఇక మీ బాబాయ్ కి బావి నుండి నీళ్ళు తోడి చెట్లకు పోయడం అంటే సరదా. అందుకని బోరు బావి  ఉన్నా, చేదురు బావిని తవ్వించారు.

ఇది మా జీవితం. నీ సంగతి ఏంటి? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు. చూడమంటావా చెప్పు. మంచి అమ్మాయిని చూస్తాను. ఇంకా ఎన్నిరోజులు ఇలా ఒంటరిగా ఉంటావు చెప్పు.” అన్నది రమాదేవి.

“నా సంగతి ఏమున్నది పిన్ని, మంచి ఉద్యోగము చేతి నిండా డబ్బు. కానీ అది చూసి ఆనందించడానికి గాని, అనుభవించడానికి గాని అమ్మానాన్నలు లేరని అనిపిస్తుంది. ఇక పెళ్లి అంటావా, చేసుకుంటాను పిన్నీ. దేనికైనా కాలం కలిసి రావాలి కదా.” అన్నాడు విజయ్.

“ఎప్పుడైనా ఊరికి వెళ్లి వస్తావా. మీ నానమ్మ తాతయ్యల దగ్గరికి” అన్నది రమాదేవి.

“ఏమో పిన్నీ, అమ్మ నాన్నలు ఆక్సిడెంట్ లో పోయిన తర్వాత, మా ఊరికి వెళ్లాలంటేనే బాధగా ఉంది. కానీ నానమ్మ వాళ్ళ కొరకు వెళ్ళాలి కదా” అన్నాడు విజయ్.

వీళ్ళ మాటలన్నీ వింటూ మౌనంగా ఉన్న రవీందర్ గారు, “ఇందాక ఫోన్ లో ఎవరితో మాట్లాడావు రమా” అన్నాడు.

“పక్కింటి ప్రసన్న అండి. అమెరికా నుండి ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిందట. రేపు మన ఇంటికి వస్తాను అంది పాపం ఆ అమ్మాయిని తలుచుకుంటే జాలేస్తుంది.” అన్నది.

“ఏమైంది పిన్ని” అన్నాడు విజయ్

“ముప్పై ఏళ్ల క్రితం మిల్ట్రీ లో జాబ్ చేసి రిటైర్ అయిన మారుతీరావు అనే అతను మన పక్కిల్లు కొనుక్కుని దిగాడు. మొదట్లో భార్యాభర్తలే ఉండేవారు. ఇక్కడ ఒక స్కూల్ పెట్టుకున్నాడు. పిల్లలు లేరు. కొన్నాళ్ళకు అనాధాశ్రమం నుండి ఒక అమ్మాయిని పెంచుకోవడానికి తెచ్చుకున్నారు. ఆ పాపకు “ప్రసన్న” అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. ఆ పాప మన శృతి ఓకే స్కూల్. మన ఇంట్లో శ్రుతితో ఆడుకోవడానికి వచ్చేది. హోంవర్క్ కూడ ఇద్దరు కలిసి చేసుకునే వాళ్ళు మన ఇంట్లోనే. ఆ విధంగా మన ఇంట్లో పిల్ల లాగా ఉండేది. మారుతీ రావు దంపతులకు ఆ అమ్మాయి అంటే పంచప్రాణాలు. ఆ అమ్మాయి కూడా చాలా చలాకీగా ఉంటూ మంచిగా చదువుకుంటూ తల్లిదండ్రులతో చాలా ప్రేమగా ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళకు పెంపుడు కూతురు అంటే, ఎవరు నమ్మేవారు కాదు.

ఆ ముగ్గురు తమ ఆప్యాయత, ప్రేమ అనే తీగలతో అల్లుకున్న ఆ అనుబంధాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో. ప్రసన్న ఇంటర్ లో ఉన్నప్పుడు తల్లి హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయింది. ఆమె చావుతో మారుతీ రావుకి, ప్రసన్నకి లోకమే చీకటై పోయింది. అమ్మ అవసరము ఎక్కువగా ఉండే యుక్తవయసులో తల్లిని కోల్పోవడం కోలుకోలేని దెబ్బ అయింది.

అప్పుడే బంధువులంతా మారుతీరావు ఆస్తిపై కన్నేసి ప్రసన్నని తల్లి లేకుండ పెంచడం కష్టమని మళ్లీ అనాధాశ్రమంలో చేర్పించమని మారుతీరావుని పోరసాగారు. కానీ మారుతీరావు మన పక్కన ఉన్న బిల్డింగ్ తో సహా అన్ని ఆస్తులను ఆ పిల్ల పేరున రాసేసి బంధువులకు తెలియజేశారు. ఆ వార్త విన్న చుట్టాలంతా ఆయన భార్య పదో రోజు కాకముందే కోపమొచ్చి వెళ్లిపోయారు.

ఒక సంవత్సరం గడిచింది. ఎప్పుడు భార్య ధ్యాసలో ఉన్నా మారుతీరావు, తిండి సరిగ్గా తినకుండ, తాగుడికి అలవాటు పడి, తన ఆరోగ్యాన్ని అంతా పాడు చేసుకుని, ఒకరోజు తెల్లవారేసరికి ప్రాణాలు వదిలేసారు. మారుతీరావు మరణవార్త తెలిసి కూడా బంధువులు ఎవరూ రాలేదు.

తల్లిదండ్రులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు పోయే సరికి ప్రసన్న పూర్తిగా పిచ్చిదానిలా అయిపోయింది. ఆమె పరిస్థితి తెలిసి ప్రసన్నను మీ బాబాయే హాస్టల్ లో చేర్చారు. హాస్టల్లో ఉండి డిగ్రీ పూర్తి చేసుకొని, తన ఇంటిని అనాధ ఆశ్రమానికి ఇచ్చేసి అమెరికాలో జాబ్ వెతుక్కుని వెళ్ళిపోయింది. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు మన ఇంటికి వస్తుంది” అని చెప్పింది రమాదేవి.

“పిన్ని ఎవరి జీవితాలు ఎలా ఎలా మలుపు తిరుగుతాయో కదా” అన్నాడు విజయ్.

“అవునురా. దీనినే విధి ఆడుతున్న నాటకం అంటారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మానాన్న దగ్గర ఉంటే ఒకలా ఉండేది. లేదా పెంచుకున్న మారుతీ రావు దంపతులు ఇంకా కొంతకాలం బ్రతికుంటే ఒక లా ఉండేది. కానీ ఆ అమ్మాయి బ్రతుకు అలా అయినా చాలా ధైర్యంగా నిలబడి జీవితాన్ని ఎదుర్కొంటుంది రా. చాలా మంచి అమ్మాయి” అన్నాడు బాబాయ్.

“సరేలే చాలా లేట్ అయింది అలసిపోయి ఉంటావు పడుకో. ఉదయం మాట్లాడుకుందాం.” అని నిద్ర లోకి జారుకుంది రమాదేవి.

ఉదయం లేచే సరికి, పిన్ని బాబాయ్ చెట్లకి పాదులు చేస్తూ, నీళ్ళు పెడితూ కనిపించారు.

విజయ్ ని చూసి” బ్రష్ చేసుకో కాఫీ తెస్తాను” అని లోపలికి వెళ్ళింది రమాదేవి. పొందికగా నీటుగా ఉన్న ఇంటిని చూస్తూ బాత్ రూం లోకి వెళ్ళాడు. విజయ్ వచ్చేసరికి చెట్టుకింద కూర్చుని అతని కొరకు ఎదురు చూస్తున్నారు. ముగ్గులు కాఫీలు తాగారు.

బోజనాలు చేసి ఆ కబురు ఈ కబురు మాట్లాడుతుండగానే సాయంత్రం అయ్యింది. టాక్సీ తీసుకుని ప్రసన్న వచ్చింది.

వస్తూనే “బాగున్నారా ఆంటీ, అంకుల్” అని పలకరించింది.

“మేము బాగానే ఉన్నాము. మీ సంగతేంటి ఎక్కడున్నావ్? ఎలా ఉంటున్నావు?” అన్నది రమాదేవి.

“అమెరికాలో ఆంటీ, ‘మేరీల్యాండ్’ స్టేట్ లో ‘గ్రీన్ బెల్ట్’ అనే ప్లేస్ లో ఉంటున్నాను ఆంటి” అన్నది ప్రసన్న.

“ఎన్నేళ్లయినా ఒక్కసారైనా మేము జ్ఞాపకం రాలేదా” అన్నారు రాజారావు.

“అంకుల్, మీరు ఎప్పుడూ జ్ఞాపకం వస్తారు. కానీ రావాలంటేనే వీలు కాలేదు. అందుకే ఈసారి ఎలాగైనా మిమ్మల్ని కలవాలి అనుకున్నాను. ఇంకా నా గురించి చెప్పడానికి ఏముంది అక్కడ మంచి జాబ్ చేస్తున్నాను. ఇల్లు కొన్నాను.ఫ్రెండ్స్ తో లైఫ్ బిజీగా గడుస్తుంది” అన్నది ప్రసన్న.

“మరి పెళ్లి చేసుకున్నావా” అన్నాడు  రాజారావు.

“లేదంకుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. చేసుకుంటే మిమ్మల్ని పిలవనా” అన్నది ప్రసన్న.

“అవును శ్రావ్య, శృతి ఎలా ఉన్నారు. మీ బాబు ఎలా ఉన్నాడు. వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు.”

“బాగానే ఉన్నారు. శ్రావ్య, శృతి హైటెక్ సిటీ దగ్గర, బాబు అమెరికాలో ఉన్నాడు. అందరు బాగున్నారు. రేపు ఆదివారం నీవు ఉంటానంటే, వాళ్లకి కాల్ చేస్తాను వస్తారు. అన్నట్టు వీడి పేరు విజయ్. మా వదిన వాళ్ళ బాబు. వీడు కూడా అమెరికాలోనే జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి నా దగ్గరకు వస్తుంటాడు. ఇవీ సంగతులు” అని ముగించాడు రాజారావు.

“మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నాకు కిచెన్ లో పని ఉంది.” అని రమాదేవి లేచింది.

“నేను కూడా లోపలికి వస్తానాంటీ” అంటూ ప్రసన్న కూడా రమాదేవి వెనకే వెళ్ళింది. ఇద్దరు కలిసి డిన్నర్ ఏర్పాట్లలో మునిగిపోయారు. వంట పని అంతా అయింది.

“ప్రసన్న ఇందాక మీ అంకుల్ పెళ్లి గురించి మాట్లాడడం విన్నాను. నేను ఒక మంచి సంబంధం చెప్తాను. నీకు నచ్చితే ఓకే. లేదా మొహమాటపడకుండా  ‘నో’ చెప్పేయ్ ఎందుకంటే పెళ్ళి అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవలసిన విషయం” అని అన్నది రమాదేవి.

“చెప్పండి ఆంటీ. నా బాగు కోరే వాళ్ళు మీరు తప్ప ఇంకెవరున్నారు. మీరు ఆ అబ్బాయి వివరాలు చెప్తే నా నిర్ణయం చెబుతాను. ఎందుకంటే నా తరఫున మాట్లాడటానికి నేను తప్ప, ఎవరు లేరు” అన్నది ప్రసన్న.

“అబ్బాయి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాడు. బాగానే సంపాదిస్తున్నాడు. చెడు అలవాట్లు ఏమీ లేవు. బాధ్యత గల వాడు. తల్లిదండ్రులు లేరు. ఇవి నాకు తెలిసిన విషయాలు” అని ముగించింది రమాదేవి.

“నాకు అతను సరిపోతాడనుకుంటే సరే అంటీ. మీరు వాళ్ళని రమ్మనండి. ఆ అబ్బాయికి నేను, నా పరిస్థితులు కూడా నచ్చాలి కదా” అన్నది ప్రసన్న.

“సరే నేను కనుక్కొని రేపు చెప్తాను. అంతటితో ఆ సంభాషణ ఆపేశారు. భోజనాలు అయిన తర్వాత అందరు మాట్లాడుతూ కూర్చున్నారు. ప్రసన్న వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే లోపలికి వెళ్ళింది. ఆ సమయం కొరకే ఎదురుచూస్తున్నా రమాదేవి.

“విజయ్ ఈ అమ్మాయి గురించి నీకు అంతా చెప్పాను కదా. మంచి అమ్మాయి మనలో ఈజీగా కలిసిపోతుంది. నీకు నచ్చితే పెళ్లి ఏర్పాట్లు చేస్తాం. చెప్పు.” అన్నది.

“అది కాదు పిన్ని, ఆ అమ్మాయికి  నేను కూడ నచ్చాలి కదా. ఈ కాలం అమ్మాయిలకు ఏవేవో కోరికలు ఉంటాయి. కలలు ఉంటాయి.”అన్నాడు.

“ఆ అమ్మాయిని అడిగిన తర్వాతనే, ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే నిన్ను అడుగుతున్నాము” అన్నది.

“ప్రసన్న నిన్న నీతో చెప్పిన అబ్బాయి మరెవరో కాదు. ఈ విజయ్, మా అక్కవాళ్ళబ్బాయి. నీకు నచ్చితే చెప్పు. తొందర ఏమి లేదు మీరిద్దరూ కలిసి సినిమాకో, షాపింగ్ కో, పార్క్ కో వెళ్లి మాట్లాడుకోండి. రెండు రోజులు మీ అభిప్రాయాలు ఒకరికొకరు పంచుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. అప్పుడు మీ ఇద్దరు కలిసి ఎల్లకాలము జీవించగలము. అని నమ్మకం కుదిరితేనే, ఇద్దరికీ పొత్తు కుదురుతుంది అనిపిస్తే, ఇద్దరికీ ఒకరితో ఒకరికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలుగవు అని నమ్మకం ఏర్పడితే మాకు చెప్పండి. ఇద్దరికీ నచ్చితేనే మేము ప్రొసీడ్ అయి మిగతా ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాము. దీనిలో ఎవరు రాజీ పడాల్సిన అవసరం లేదు” అన్నది రమాదేవి.

“పార్కు షాపింగ్ ఏం వద్దు అంటీ. మన తోటలోనే కూర్చుని మాట్లాడుకుంటాం” అన్నది ప్రసన్న.

విజయ్ కూడా ప్రసన్న చెప్పిన మాటనే చెప్పాడు. వాళ్ళిద్దరు ఏకాంతంగా మాట్లాడుకోవాలని దూరంగా ఉన్న మామిడి చెట్టు కింద రెండు కుర్చీలు వేయించారు.

సాయంత్రం విజయ్ వచ్చి “పిన్ని నాకు కూడా ప్రసన్నను చేసుకోవడం ఇష్టమే. కానీ చాలా సింపుల్ గా యాదగిరి గుట్ట పైన పెండ్లి ఏర్పాట్లు చేయించండి. తాతయ్య నానమ్మ వాళ్లకు ఫోన్ చేసి రమ్మని చెప్పండి. నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వస్తారు. ఎలాగు శృతి, శ్రావ్య వాళ్ళ కుటుంబాలు ఉంటాయి.” అన్నాడు విజయ్.

విజయ్ చెప్పిన విషయాలన్నీ రమాదేవి ప్రసన్న తో చెప్పింది. “నీవు ఏమంటావు చెప్పమ్మా” అన్నది.

“నేనేం చెప్పను ఆంటీ విజయ్ లాంటి మంచి వ్యక్తిని పరిచయం చేసి, జీవితాంతం నాకు తోడుగా ఉండేలా చేశారు. ఏకాకినై నిస్సారంగా, గమ్యం తెలియని బాటసారిలా జీవిస్తున్న  నాకు పెళ్లి చేసి గమ్యాన్ని చూపుతున్నారు. నా తల్లిదండ్రుల స్థానంలో ఉండి నా పట్ల ఇంత బాధ్యత చూపుతున్న మీకు, అంకుల్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను.” అన్నది ప్రసన్న.

అప్పుడే వచ్చిన విజయ్ “ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా జీవితాంతం కలిసి మెలసి ఉండాలని దీవించండి మమ్మల్ని” అంటూ ఇద్దరు రమాదేవి,రాజారావు దంపతులకు పాదాభివందనములు చేశారు విజయ్ ప్రసన్న.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!