ప్రేమ సంకెళ్ళు!

ప్రేమ సంకెళ్ళు!

రచన:: కవి రమ్య

“ఆరాధ్య!” అని తన వెంట పరిగెత్తుకొస్తున్న ఆనంద్ కి వెన్ను చూపుతూ నడుస్తోంది ఆరాధ్య.

“బన్నీ! ఆగు” అంటున్న అతని పిలుపు ఆమె చెవికి వినపడలేదు. ఆమె గుండెలోని అలజడి నింగికెగసి మేఘాలు కమ్ముకున్నాయి. పెళపెళ ధ్వనులతో ఉరుములు ఉరుముతూ చినుకులని వెంటేసుకొచ్చాయి. తొలకరి చినుకులు ఆమె మేను తాకగానే ఆమె హృదయంలో పొంగుతున్న ఆవేదన కన్నుల ద్వారం దాటి జల జలా జారుతూ కురుస్తున్న వానతో జతకట్టాయి.

ఆనంద్ ఆతృతగా ఆమెకేసి పరిగెత్తాడు. అందనంత దూరంలో నడుచుకుంటూ వెళుతూ ఉన్న తన ప్రాణ సఖిని చేరుకునే ప్రయత్నం రెట్టింపు చేసాడు. ఫలితంగా ఆమెని చేరుకోగలిగాడు.

“బన్నీ! దయచేసి ఒక్క నిమిషం నేను చెప్పేది విను” అని రొప్పుతూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అయినా ఉలుకూపలుకు లేకుండా శిలలా నిలబడింది.

“బన్నీ! సారీ రా. వేరేవాళ్ళు నిన్ను అలా చూస్తే నాకు నచ్చదు. అందుకే వాడిని కొట్టాను. పైగా నీ ఫ్రెండ్ అలా చేయడం తప్పు” అంటూ ఆరాధ్య మనసులో ఏర్పడిన అలజడిని శాంతపరిచేందుకు ప్రయత్నించాడు.

ఆరాధ్య చేయి విదిలించుకునే ప్రయత్నం చేయబోగా ఆమె నడుముని పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. ఆరాధ్య గుండె వేగంగా కొట్టుకుంది. ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా కలుసుకున్న స్నేహితుడు ఆనందంలో చేతులు పట్టుకున్నాడని ఆనంద్ అలా దారుణంగా కొట్టడం జీర్ణించుకోలేకపోయింది.

“నా కళ్ళు చూసి చెప్పు బన్నీ నేను తప్పు చేసానా?” అని దీనంగా అడిగాడు ఆనంద్

అయినా చలనంలేని తన మనసుని చూసి ఆనంద్ కి దుఃఖం పొంగుకొచ్చింది. ఆమెని బలవంతంగా ముద్దాడి “నువ్వు నాదానివి!” అని ఆమెని బలవంతంగా ఎత్తుకుని కారెక్కీ తన ఇంటికి తీసుకెళ్ళాడు.

“ఆనంద్! నన్ను వెళ్ళనీ ప్లీజ్” అని ఆరాధ్య మొదటిసారి ఆనంద్ ప్రేమ వ్యక్తపరిచేది చూసి భయపడింది.

“బన్నీ! నువ్వూ నా ప్రాణం. నన్ను క్షమించు. మరోసారి ఇలా చేయను. ప్లీజ్. కానీ నీ ఫ్రెండ్ కి చెప్పు పెళ్లైన ఆడవాళ్లతో ఎలా నడుచుకోవాలని. ఎంత నీ ఫ్రెండ్ అయితే మాత్రం వాడు నీ చెయ్యి పట్టుకుంటాడా” అనేసి ఎత్తుకొచ్చి గదిలో పడుకోబెట్టాడు.

“గుడ్ నైట్ ఆరాధ్య! రేపు మాట్లాడుకుందాం. ఇద్దరం అలిసిపోయి ఉన్నాం” అని తనకి వెన్ను చూపిస్తూ పడుకున్నాడు.

“హ…మిసెస్ ఆరాధ్య ఆనంద్! ఈ పేరు వినాలని లేదు. నిన్ను ప్రేమించడంతో మా కన్నవాళ్ళకి దూరం అయ్యాను. నిన్ను పెళ్ళి చేసుకుని నా కెరియర్ కి దూరం అయ్యి అసమర్థురాలిలా ఇంట్లో పడున్నాను. నీ ప్రేమ ఒకప్పుడు నాకు ప్రాణం పోస్తే, ఇప్పుడు నీ మితిమీరిన ప్రేమ నాకు ప్రాణం పోయేలా ఊపిరాడకుండా చేస్తోంది. ఆనంద్! నేను నీతో ఉండలేను. హద్దులులేని ప్రేమ హృదయానికి హానికరమైనది, అది ఎవరి మీద అయిన సరే” అని ఆరాధ్య దుఃఖాన్ని దిగమింగి కిటికీ అద్దం మీద జారుతున్న వర్షపు నీటిని చూసింది.

మరునాడుదయం…

“బన్నీ! నేను నిద్ర లేచాను. కళ్ళు తెరవచ్చా? నా ముందే ఉన్నావా?” అని ఆతృతగా అడిగాడు ఆనంద్. నిశ్శబ్దం రాజ్యమేలింది. తన సమాధానం కోసం అలానే మంచం పై కూర్చున్నాడు.

రెండు గంటల తరువాత గదిలోకి వచ్చి “వంట అయింది సార్! మేడం కనిపించడం లేదు. అందుకే మీకు చెప్పి వెళదామని” అని వంటమనిషి చెప్పగానే

“ఉదయ్! నా బన్నీ ఇంటిలో లేదా? ఎక్కడికి వెళ్ళింది? నాకు తను కావాలి” అని మూడేళ్ళ తర్వాత మొదటిసారి పొద్దునే లేచి ఆరాధ్య మొహం చూడకుండా వేరేవారి మొహం చూసాడు ఆనంద్

“ఉదయ్! సెక్యూరిటీకి ఫోన్ చేయి! నా బన్నీని ఎవరైనా కిడ్నాప్ చేసారేమో? తన ఫ్రెండ్ అయ్యుండాలి. నిన్ననే వాడిని కొట్టాను. అదేమైన మనసులో పెట్టుకుని నా బన్నీని…నో! పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి” అని హడావుడి చేసాడు.

అదే సమయంలో ఓ అనాధాశ్రమంలో…

“మీ పేరు” అని అక్కడి నిర్వహకురాలు లక్ష్మీ అడిగింది.

“నా పేరు ఆ…ఆకాంక్ష అండి” అని తడబడుతూ మారుపేరుకి స్వాగతం పలికింది ఆరాధ్య.

“మీకు పెళ్లి అయ్యిందా?”

“అయింది అండి కానీ భర్త అతిప్రేమ తట్టుకోలేక వచ్చేసాను” అని నిజం చెప్పింది

ఆవిడ ఒక్క నిమిషం కంగుతిని “అమ్మా! ఈ కాలంలో ప్రేమ చూపించడమే అరుదు. అతి ప్రేమ చూపిస్తున్నాడని వదిలేసావా?” అని వాపోయింది.

“అతి ప్రేమ ప్లాస్టిక్ కవర్ లో మొహం పెట్టి బంధించినట్టు ఉంటుంది మేడం. మా వారు ఎంత ప్రేమ కురిపించారు అంటే మాటల్లో చెప్పలేను. ఎవరో మాకు బిడ్డ పుడితే ఆయనకీ నాకూ మధ్య సమయం గడిపేందుకు, ప్రేమగా ఉండేందుకు అవకాశం తక్కువ అవుతుందన్నారని నా కడుపులో పెరుగుతున్న బిడ్డని సైతం మింగేసారు. ఇలాంటి ప్రేమ దొరకడం నిజంగానే దౌర్భాగ్యం. రక్తమాంసాన్ని పంచుకుని పేగు తెంచుకుని పుట్టిన మన బిడ్డకి పంచడం తప్పా మేడం” ఆగని కన్నీళ్ళ ధారతో అడిగింది.

ఆవిడ లేచి నిలబడి నేల చూపులు చూసి “ఈ ఒక్క సంఘటన చాలమ్మ నీ బాధ అర్ధం కావడానికి” అని కన్నీళ్లపర్యంతమైంది.

“ఇక్కడున్న పిల్లలని నా పిల్లలుగా చూసుకుంటాను మేడం. మీకు చెడ్డ పేరు రానివ్వను. నాకు దూరమైన సంతోషాన్ని ఈ విధంగా వెతుక్కుంటాను” అంది ఆరాధ్య.

కాలం గాయాలని మానేల చేస్తుంది అంటారు. బహుశా అది కొంతవరకు నిజమేనేమో! ఆరాధ్య పిల్లల సాంగత్యంలో తన చేదు జ్ఞాపకాలను మరిచిపోతూ తియ్యని జ్ఞాపకాలను పొగుచేసుకోవడం మొదలెట్టింది. అందులో ముఖ్యంగా అలకనందవి. తనంటే ఆరాధ్యకి ప్రాణం.

——————
ఆనంద్ ఆరాధ్యకి దూరమైన కొన్ని గంటలకే పిచ్చోడిలా తన నామజపం చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. ఆయన పేరు రంగారావు.

“ఆనంద్! వచ్చావా? నేనే నిన్ను కలుద్దాం అని అనుకున్నాను. ఆరాధ్య విషయంలో తప్పు చేసావని అనిపించలేదా” అని కటువుగా అనేసరికి తల దించుకున్నాడు ఆనంద్.

“ఏమయ్యా! ప్రేమ జీవితంలో సగభాగం కావాలి లేదా ముప్పావు అంతే కానీ నువ్వూ నీతో పాటు మీ ఆవిడని కూడా ముంచేలా ఉండకూడదు. కడుపులోని బిడ్డని ఎవరో ఏదో అన్నారని చంపేస్తావ? బుద్ధి గడ్డి తిందా? నేను చనిపోయిన మీ నాన్న క్లోస్ ఫ్రెండ్ కాబట్టి నీ మీద కేసు పెట్టకుండా వదిలేసాను. నా జూనియర్ అశ్వత్ అన్నీ చెప్పాడు. ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాలేదు. నీ వల్ల, నీ అతి ప్రేమ వల్ల నరకయాతన పడుతోంది” అని కసిరాడు.

“ప్రేమించడం తప్పా బాబాయ్! బిడ్డని చంపాను అంటున్నావు! ఎందుకు చంపాను? తనకోసం కాదా? తను ఎక్కడ నొప్పులు పడుతూ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందో, ఎక్కడ బిడ్డ వల్ల తన ప్రాణానికి అపాయం కలుగుతుందో, ఎక్కడ తనని జీవితంలో కోల్పోతానో అని అనుక్షణం కుమిలిపోయాను. ఆ బాధ నేను భరించలేక అలా చేసాను. తనే నా బిడ్డ, నా భార్య, నా సర్వస్వం. చిన్నప్పుడే అమ్మానాన్నలకి దూరమైన నన్ను తను ఎంతగానో ప్రేమించింది. అన్నీ అయి నన్ను చూసుకుంది. అలాంటి తను నన్నెందుకు వదిలి వెళ్లిపోవాలని అనుకుంది?” అని ఆలోచనలోపడ్డాడు.

“ఎందుకంటే తన జీవితం కూడా నువ్వే జీవిస్తున్నావు కాబట్టి? తనకేది కావాలో అడిగే అవకాశం నువ్వు ఇవ్వలేదు. అన్నీ నువ్వే నిర్ణయించేసావు. తనకంటూ ఓ విషయంలో అయినా స్వేచ్ఛ ఇచ్చావా నువ్వు? తన బిడ్డ దూరమయ్యిందని కూడా అంతా అయిపోయాక చెప్పావు. రేయ్ ఆడదాని మనసు విశాలమైనది. తన మనసులో ఎంతమంది మీద అపారమైన ప్రేమ ఉన్నా, భర్తది ఎప్పుడూ మొదటి మరియు ఉన్నత స్థానం రా వెధవ! బిడ్డ పుడితే ప్రేమ తగ్గిపోతుంది అని చెప్పిన సన్నాసి ఎవర్రా? బిడ్డ పుడితే మీ మధ్య ప్రేమ బంధం ఇంకా బలపడుతుంది. మీ ప్రేమకి ప్రతీరూపాన్ని నువ్వే చేజేతులా దూరం చేసుకున్నావు. ఇక నొప్పులు అంటావా! ప్రతీ తల్లీ ఆనందంగా భరిస్తుంది. కొన్ని కష్టాలు ఎనలేని సంతోషాన్ని ఇస్తాయి. ఆడదానికి తల్లి అవ్వడం గొప్ప వరం” అని తిట్టిపోసాడు.

తనేంత తప్పు చేసాడో తెలుసుకున్న ఆనంద్ ఆరాధ్య జ్ఞాపకాలతో కాలం గడపసాగాడు. ధార్మికంగా బ్రతకాలని నిర్ణయించుకుని ఎన్నో సంస్థలకి దానాలు చేసాడు. ఆఖరికి ఆరాధ్య ఉంటున్న శరణాలయానికి కూడా దాతగా మారి అప్పుడప్పుడు వాళ్ళని కలిసి మాట్లాడేవాడు. కానీ ఆరాధ్య మాత్రం తన ఉనికిని కనిపెట్టనివ్వకుండా జాగ్రత్తపడింది.

అలకనంద అంటే ఎనలేని అభిమానం చూపించేవాడు ఆనంద్. ఎందుకని ఎవరైనా అడిగితే ఆరాధ్యకి మరో రూపం అంటే అలకనందనే అనేసేవాడు. ఆరాధ్య ఈ మాటలు విని పొంగిపోయినా ఎక్కడ కనిపిస్తే మళ్ళీ అతని అతిప్రేమకి బలవుతానేమో అన్న భయంతో చాటుగా చూసేది.

ఆరాధ్యకి తెలియని నిజం ఏంటంటే ఆనంద్ కి ఆరాధ్య అక్కడే ఉందని ఎప్పుడో తెలుసు కారణం తను పేరు మార్చుకున్నా మారని సంతకం. అలకనంద తన టీచర్ పుస్తకం కరెక్ట్ చేసి సంతకం చేసింది చూపించగానే కనిపెట్టేసాడు. కానీ తనంతట తానే అజ్ఞాతం వీడి తన చెంత చేరేవరకు ఓపికగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. ప్రేమ అనేది ఇవ్వడమే కానీ అతిగా ఆశించడం కాదని, తన ప్రేమ ఆరాధ్య జీవితానికి సంకెళ్ళు వేయకూడదని మౌనంగా తన ప్రేమని ఆస్వాదించాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!