(అంశం: ” పెంకి పెళ్ళాం”)
ముద్దుల పెళ్ళాం
రచన :: కమల ముక్కు (కమల’శ్రీ’)
పొద్దున్నే కాఫీ అంటే
కాదు కాదు కషాయం అంటూ
చేదు చేదు కషాయాన్ని
చేతిలో పెడుతుంది
దోసో పెసరట్టు ఉప్మానో
చేస్తుందంటూ చూస్తే
రాగి జావ చేతిలో పెట్టి
తాగమంటుంది
మధ్యాహ్నానికైనా
మంచి భోజనం
పెడుతుందంటే
ఆకుకూరలే రోజూ దిక్కూ
సాయంత్రం అలసిసొలసి వస్తే
అప్పుడైనా కాఫీ ఇస్తుందంటే
లేదూ అంటూ రాగి సంకటి
చేతిలో పెడుతుంది
రాత్రి కైనా కోడి కూర
వండుతాదేమో అనుకుంటే
ముద్ద పప్పు తో
భోజనం పెడుతుంది
ఇదేవిటే ఈ వంటా
నాలుక్కి రుచీ పచీ లేదంటే
నీ ఛాదస్తంతో వేగలేకున్నాను
చెప్పినా వినని మొండిదానివి
నాకే తగిలావేంటే
ఇన్నాళ్లూ బాగే ఉంటివి
ఈ మధ్యనే నేర్చావు
పెంకి తనం
అంటూ తలపట్టుకున్నా
మన్నించు పెనివిటీ
నీకారోగ్యం బాగులేనప్పుడు
డాక్టరు బాబు అలానే
చేయమని చెప్పాడు
అలా చేస్తేనే నీ ఆరోగ్యం
కుదుటపడుతుందన్నారు
ఇంకో రోజే పెనిమిటీ
ఆ తర్వాత కోరింది వండుతా
అడిగింది ఇస్తా
నువ్వు బాగుంటేనే
నేనూ బాగుంటాను
కదా పెనిమిటీ
అంటూ అసలు నిజం చెప్పింది
నా ఆరోగ్యం మీద శ్రద్ధతో
ఇదంతా చేసావా
ఎంత ప్రేమే నీకు
అంటూ దగ్గరకు తీసుకొని
ముద్దు చేస్తే
సిగ్గుల మొగ్గైయ్యింది
నా ముద్దుల పెళ్లాం