ముకుందమాల(ఇష్టపది మాలిక)

ముకుందమాల(ఇష్టపది మాలిక)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: డా.అడిగొప్పుల సదయ్య

భక్త జన యిడుములను పాములకు గరుడమణి
ముల్లోకముల గాచు ముఖ్య రక్షామణీ!
వ్రేత కన్యల నయన చాతకాంబుద మణి
జగన్మోహన హార సౌరు ముద్రామణీ
రుక్మిణీ కుచద్వంద్వ రుక్మ భూషామణీ
బ్రహ్మేంద్ర రుద్రాది పరమసుర శిఖామణి
గోప చూడామణీ! పాప గంగామణి!
గోవింద! ముకుందా! గోకులానందా!!

భాషాంశములు:
ఇడుములు+అను = కష్టాలు అనెడు
గరుడమణి = గరుడ మంత్రం
వ్రేత కన్యలు= గొల్లెతలు
చాతకం= చాతకపక్షి
అంబుదమణి= మేఘమణి
సౌరు=సౌందర్యం
రుక్మము=బంగారం

23.
శత్రువుల ఛేదించు శక్తియుత మంత్రంబు
శృతులన్ని కీర్తించు సంపూజ్య మంత్రంబు
తక్కు సంసారమును దాటించు మంత్రంబు
గాఢాంధకారమును కడతేర్చు మంత్రంబు
సకలైశ్వర్యములకు స్థానమౌ మంత్రంబు
వ్యసనభుజగము నుండి పాలించు మంత్రంబు
జపియించవే జిహ్వ! జన్మ ఫలమంత్రమగు
శ్రీ కృష్ణ మంత్రమును చిరకాలమై యెదను

భాషాంశములు:
శృతులు = వేదాలు
తక్కు = అల్పమైన
కడతేర్చు = రూపుమాపు
స్థానము = నెలవు
వ్యసన భుజగము= దురలవాటను పాము
పాలించు= రక్షించు
జిహ్వ= ఓ నాలుక
చిరకాలము=ఎల్లప్పుడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!