మౌనరాగం

మౌనరాగం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మక్కువ. అరుణకుమారి

మాటలన్నీ మూగబోయిన వేళ
మౌన వీణలు మోగేదెలా!
నా గానమంతా నీ ధ్యానంలోనే సాగేవేళ
నా ప్రాణాలన్నీ నీకై మూగ రాగాలాపనలు చేసే వేళ
గున్నమావి తోటల్లో తీపిరాగాలు తీసే ఎలకోయిల
నా దరికి చేరి నను మురిపించేదెన్నడో!
వెన్నెల చిదిమి దీపాలు పెట్టుకొనే
ఆ లేలేత నవ్వులు నా సొంతమయ్యేదెన్నడో!
ఆ రాగాలు పలికేవికావు
ఆకాశ దేశాన జాబిలి అందేది కాదు
ఛైత్రమాసాన కూసే గండుకోయిల రాగాలు
ఏనాటికైనా గ్రీష్మాన్ని రంజింపచేసేనా!
నీ నీరీక్షణలో వేసారిన గుండెగాయాలు చూడు
మధుర గేయాలై పల్లవిస్తున్నవి నేడు
కొమ్మచాటు అందాలు చూడడం కాదు తప్పు
అవి అందుకునేందుకు చూడడమే తప్పు
కూడని వానితో జతకూడితే మండుతుంది నిప్పు
నింగి, నేల కలవాలనుకోవడం అవుతుంది ఎప్పటికైనా ముప్పు
అందరాని వాటికి ఆశపడడం అదెంతో తప్పు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!