నవ వసంతం

నవ వసంతం

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

కోమలి ఎంత అపురూపమైన పేరు.  అంతే అపురూపమైన మనసు తనది. అంతే అపురూపమైన కన్నులు.  ఆ సుకుమారమైన అందాన్ని, అంతకు మించి సుకుమారంగా చూసుకోవాలి.

మా ప్రేమను చూసి ఆ ప్రేమకి కూడ కళ్ళు కుట్టాలి.  అంతలా మా ప్రేమ మధురిమలు మా జీవితాలలో వెల్లివిరియాలి.

మా జంటను చూసి, పెళ్లి కాని యువతీ,యువకులకు  జీవితం పై ఆశ పుట్టాలి. పెళ్లి అయిన భార్యాభర్తలకు మా జంట ఆదర్శం అవ్వాలి.

నేను కలలు కన్న ఆ సంతోషం ఇంకాసేపట్లో నా సొంత మవుతోంది.  కోమలి నా సొంతం అవుతుంది.  అంటే,  కోమలి,  కైలాశ్ ల పెళ్లి వేడుక కాసేపట్లో అంగరంగ వైభవంగా  జరుగబోతోంది.

ముహుర్తం టైం దగ్గర పడింది. కోమలిని దేవకన్యలాగా ముస్తాబు చేసి, పెళ్లి పీటల మీదకు నడిపించుకుని వస్తున్నారు ముత్తయిదువులు.

నా ప్రేమ పెళ్లి పెద్దల సమక్షంలో, నా స్నేహితుల సమక్షంలో,   అందరి ఆశీర్వాదంతో జరగటం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను.  నవ్వుతూ కోమలి మొహం వైపు చూశాను.

నేను కోరుకున్న ఆనందం కోమలి ముఖంలో కనిపించలేదు ఏదో వెలితి మొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

ఏమైంది అని కళ్ళతో నేను అడిగితే ఏం లేదంటూ మాట దాటివేసింది. ఆ నిమిషంలో ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి నాది.

పెళ్ళి తంతు అంతా ముగిసింది. నా ప్రేమ విజయం సాధించింది.  కానీ, ఆ ప్రేమలో భయం కూడా ఉందని కోమలి మాటల ద్వారా అర్ధం అయింది. పెళ్లిలో తను బాధ గా ఉండడం చూసి సమయం చూసుకుని అడిగాను.

ఇప్పటివరకు మనం ప్రేమికులం.  ప్రేమించుకోవడానికి రెండు హృదయాలు చాలు.  ఇప్పుడు మనకి పెళ్లి జరగబోతోంది.  కానీ, ఈ పెళ్లికి రెండు కుటుంబాలు కావాలి. మనలో,  ఏ చిన్న తప్పు జరిగినా మన ఇద్దరి వల్ల రెండు కుటుంబాలు అ భాదను ఎదుర్కోవాలి అందుకే భయం అని చెప్పింది.

కోమలికి ముందు నా పైన నమ్మకం కలిగించుకోవాలి. ఆ భయం తగ్గించాలి.  అనుకుని చిన్న చిరునవ్వుతో సమాధానమిచ్చాను తనకి.

ఆడపిల్లలు ఎక్కువగా భయపడేది ఫస్ట్ నైట్ కి. కనుక ఆ రోజే మనసు విప్పి మాట్లాడుకుంటే సరిపోతుంది అనిపించింది. ఆ సమయం కూడా దగ్గరలోనే ఉంది.

ఎదురు చూసిన సమయం రానే వచ్చింది ఇంకా అరగంటలో కోమలి వస్తుంది అనుకుంటూ ఎదురు చూడసాగాను ఆ రూంలో.

ముగ్ధ మనోహర రూపంతో,  అమాయకమైన కన్నులతో మొహంలో భయం కదిలాడుతుండగా కోమలి నా రూమ్ లోకి అడుగుపెట్టింది.

ముందుగా తనకిష్టమైన ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజికల్ హిట్స్,  నా సెల్ ఫోన్ లో ఆన్ చేసి,  చిన్న సౌండ్ పెట్టి తన పక్కన కూర్చున్నాను.

చూడు కోమలి,  నేను నీకు కొత్త కాదు.  మన అలవాట్లు అభిరుచులు ఒకటే అవడం వల్ల,  మనం దగ్గర అయ్యాము.

ఇంకా ఒకరి కుటుంబంతో ఒకరికి చక్కటి బాంధవ్యం ఏర్పడింది. కనుక, నువ్వు అసలు భయపడనక్కర్లేదు. పెళ్లి అయ్యాక చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అవ్వచ్చు. కానీ,  ఆ చిన్న తప్పులను కూడా అడ్డుకుంటే మన ప్రేమ ఎన్ని సంవత్సరాలు అయినా,  నవ వసంతమే అవుతుంది.

నువ్వు నాకు పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నావో,  నా కుటుంబంతో అలాగే ఉండొచ్చు.  నీకు పరిమితులు ఏమి ఉండవు.  కనుక లేనిపోని భయాలు విడిచిపెట్టు అని వివరించాను.

తన కళ్ళల్లో ఒక వెలుగు చూడగలిగాను.  చిన్న చిరునవ్వుతో నా చేతిని తన చేతిలోకి తీసుకుని, తన పెదవులతో చిన్న ముద్దు ఇచ్చింది.

ఆహా, నా ఈ చెయ్యి ఎంత అదృష్టం చేసుకుందో, తొలిముద్దు దీనికి దక్కింది అని నేను అంటుంటే, కోమలి నన్ను చూసి, నవ్వుతోంది అపురూపంగా….మనోహరంగా.

తను అలాగే ఇంకెప్పటికీ నవ్వుతూ ఉండాలని ఆశిస్తూ…. తన వైపే చూస్తున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!