నేలపై నెలవంక

నేలపై నెలవంక

రచన: చంద్రకళ. దీకొండ

నుదుటిపై కాసంత బొట్టు…
నెత్తి మీద ముంతంత కొప్పు…
కొప్పు మీద గుప్పుమనే
నాగమల్లి పువ్వు…
ఘల్లుఘల్లుమనే కాళ్ళ కడియాలతో నడిచొచ్చే నా యెంకి అందం…
నవనవలాడే నల్లకలువ సందం…!
కళ్ళెత్తితే సాలు కదులు పూబాణాలు…
పలుకాడితే సాలు దొరలు ముత్యాలు…!
చెంగు చెంగున ఎగిరేటి జింక
నా యెంకి…
ఇరగబడి నవ్వేటి సేలో పాలకంకి…!
మునిమాపు ఏళల్ల,
ముసిరేటి సీకట్ల…
నవ్వినాది నా యెంకి,
నేలపై నెలవంకయి…!
పగలంత ఎదటున్న…
కన్ను మూత్తే సాలు
కలలోకి వస్తాది…
దోరనవ్వులు నవ్వి దొరవు నీవేనంటది…!
ఓర చూపులతోటి గుండెకు గాలమేత్తాది…
కంటి సూపు తోటి కనికట్టు సేత్తాది…
కోటిమందిలో ఉన్నా
సూటిగా తగిలేటి సురుకు
సూపుల యెంకి…!
నా కంటి అద్దంల బొట్టు దిద్దుకుంటాది…
ఏటి ఇసుకలోన నా బొమ్మే గీస్తాది…!
ఎదురొస్తదేమోనని ఎదురుసూస్తా ఉంటె…
ఎనకాలనుంచొచ్చి కళ్ళు మూస్తాది…
ఎవరో సెప్పుకోమంటు…
కిలకిలా నవుతాది నా పిల్ల యెంకి…
ఎదను గిల్లేసి నన్ను అల్లేత్తాది
నా పిల్ల యెంకి…!
కీసులాడుతాది…
అలిగి కూసుంటాది…
నా పానమే నువ్వంటే…
అలకంతా మరిసి
మురిసి కలిసిపోతాది…!
ఎన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు…
ఎన్నేళ్ళకీ ఒడవని తీపి అచ్చట్లు…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!