మీసం లేని పులి

మీసం లేని పులి

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

భర్త నవీన్ వంక చూస్తూ మురిసిపోతున్న రాధకి నవీన్ చాదస్తంగా ప్రవర్తించినా అదే గొప్పగా భావిస్తూ ఉంటుంది.మార్చాలని ప్రవర్తించదు సరికదా భర్త చేసే ప్రతీ పనినీ మెచ్చుకుంటూ పతియే ప్రత్యక్షదైవమంటూ ఎదుటి వారి ముందు నిరూపిస్తూ ఉంటుంది.భర్తను సమర్థిస్తున్న రాధను చూసి స్నేహితులు, బంధువులంతా ఆశ్చర్యపోయేవారు ఎందుకంటే నవీన్ చాలా అందరితో విసురుగా ప్రవర్తిస్తుంటాడు.రాధతో ఇంట్లో ఎలా ఉంటాడో తెలియదు కాని బయట మాత్రం పొగరెక్కిన కోడెగిత్తలా భయపెడుతూ ఉంటాడు.రాధ పొట్టిగా ఉన్నందువల్ల మొగుడికి భయపడుతూ వెనకేసుకొస్తుందిలే అని చెవులు కొరుక్కుంటుంటారు.
ప్రతిరోజూ ఆఫీస్ లో ఎక్కడ ఉన్నా ఫోన్ చేసి మాట్లాడే నవీన్ చాలా బిజీగా ఉండడంతో రాధకి ఫోన్ చేయడం మరచి పోయాడు.రాధ ఎందుకు ఫోన్ చేయలేదంటూ ఫోన్ చేసి అడగడంతో పక్కనే ఉన్న పి.ఎ పద్మ ని కసిరినట్టు రాధతో “ఆఫీసులో పనేం లేదనుకుంటున్నావా పెట్టెయ్ ఫోన్ “అన్నాడు. ప్రేమతో మాట్లాడుదామనుకున్న రాధ మనసు చివుక్కుమంది. కానీ భర్తంటే ప్రాణం కదా ఆయనే పరిస్థితిలో ఉన్నాడో అనుకుంటూ సోఫాలో కూర్చుని టి.వి చూస్తూ ఉండగా
పక్కింటి పరమేశ్వరి పరుగు పరుగున రాధ దగ్గరికొచ్చి “ఏం ప్రోగ్రాం చూస్తున్నావొదినా”అంటూ కూర్చుంది.హఠాత్తుగా వచ్చిన పరమేశ్వరిని చూసి ఏదో విశేషం లేకపోతే గాని రాధకి ఇది ఇక్కడికి రాదే అని అనుమానం వచ్చింది.కాళ్ళీడ్చుకుంటూ తాపీగా నవీన్ వచ్చాడు.ఏంటి అప్పుడే వచ్చేశారు అంటూ నవీన్ దగ్గరికెళ్ళి టై విప్పబోయింది.నవీన్ “ఏం లేదు ఫోనెత్తలేదు కదా అని”అంటుండగా రాధ పరమేశ్వరి ఉందని సైగ చేసింది.”అదే శ్రీమతి గారిని చూడాలనిపించి”అంటూ మాట మార్చేశాడు నవీన్.అయినా పరమేశ్వరి పోలీసు కుక్కకంటే డేంజర్ “ఫోనెత్తలేదా ఎవరు ? “అంది పరమేశ్వరి.దానికి రాధ “ఏం లేదొదినా నాకు ఫోన్ చేశాడంట.నేను చూసుకోలేదు .టెన్షన్ పడి వచ్చేశాడు అంతే ఇక నువ్వెళ్ళు “అంటూ తొందరచేసి పంపించేసింది. పరమేశ్వరికి అనుమానం కాస్త ఎక్కువవడంతో నవీన్ వాళ్ళ బెడ్ రూం కిటికీ దగ్గర కాపు కాసింది.

నవీన్ రాధని నేరుగా బెడ్ రూం లోకి తీసుకెళ్ళాడు.”రాధా సారీ..పక్కన పద్మ దగ్గర బిల్డప్ ఇద్దామని అలా చేశానంటూ” ప్రాధేయపడ్డాడు.రాధ కోపంతో నవీన్ చెంప చెల్లుమనిపిస్తూ వెళ్ళి బట్టలుతికి వంటచెయ్ అంటూ ఆదేశించింది.ఇదంతా వింటున్న పరమేశ్వరి ఆశ్చర్యంతో “నవీన్ ఇంట్లో పిల్లి వీధిలో పులి అన్నమాట రాధ ఎంత బాగా నటిస్తుంది అబ్బో ..నభూతో న భవిష్యత్..”అనుకుంటూ రాధ వాళ్ళింటికొచ్చి వదినా ఏం చేస్తున్నావ్ అంది.రాధ వంట చేస్తున్నా వదినా అనడంతో పరమేశ్వరి కి నవ్వాగలేదు.నవ్వుతూ అన్నయ్య చేస్తాడులే నువ్ రా పనుంది అంది.ఆ మాటతో రాధ షాక్ అయి ఏమీ తెలియనట్లుగా ఏందొదినా కొత్తగా మీ అన్నయ్య వంట చేయడమేంది అంటూ పరమేశ్వరి ముందుకు వచ్చింది.”నేనంతా విన్నా లే వదినా అసలిక్కడేం జరుగుతుందో చెప్పు లేదంటే అందరికీ అన్నయ్య మీసంలేని పులి అని చెప్పేస్తా”అంటూ పరమేశ్వరి బెదిరించింది.రాధ చేసేదేమీ లేక “ఏం లేదొదినా నాకు వంట రాదు పెళ్ళికి ముందే చెప్పా ఆయన లక్షల కట్నానికి ఆశపడి అన్నీ నేనే చేసుకుంటానంటూ బీరాలు పలికాడు.పెళ్ళయ్యాక మా నాన్న నాకొక మాట చెప్పాడు “ఏ భార్య అయితే తన భర్తని బయట మహారాజులా చూస్తుందో వారి కాపురాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు.భర్తను బానిసని చేసిందని తెలిస్తే ఆ భార్య గురించి చెవులు కొరుక్కుంటారు”అని చెప్పిన మాటకి కట్టుబడి ఆయన్ని అందరి ముందు మహారాజులా చేశా.ఆయనేమైనా పడేదాన్ని.ఇంట్లో సకలం ఆయనే చేసి పెడతాడు నేనేమో కాలు మీద కాలేసుకొని హ్యాపీగా తింటా “అంటూ అసలు విషయం కుండబద్దలు కొట్టేసింది.పరమేశ్వరి నిజమే వదినా నేనూ మా మీసం లేని పులి ని అదే మా ఆయన్ని కూడా మహారాజులా మార్చేస్తానంటూ రాధతో చేతులు కలిపింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!