మాయని మచ్చ

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారంగానూ”)
మాయని మచ్చ
రచన:: బండ్ల శ్వేత

మాయని మచ్చ ఇది అనుకుంటూ, తన కింది పెదవి పక్కన చెంప మొత్తం ఆక్రమించిన ఆ మాయని మచ్చని అద్దంలో చూస్తూ అలాగే జ్ఞాపకాల్లోకి జారిపోయింది స్నేహ.
ఆ మచ్చ తన జీవితాన్ని, గమనాన్ని మార్చివేసింది. అందానికే అసూయ పుట్టించేంత అందం స్నేహది. పాలరాతి శిల్పం లాంటి శరీర సౌష్టవం. తుమ్మెదలు భ్రమ పడేలా ఉండే సంపెంగ నాసిక. కలువల్లాంటి కళ్లు. నవ్వితే ముత్యాలు రాలిపడ్డాయేమోననిపించే మిలమిల మెరిసే పలువరుస.
స్నేహ శరీరం మాత్రమే కాదు మనసు కూడా అంతే అందమైనది.
స్నేహ ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ముగ్గురు ఆడపిల్లల్లో రెండవది. డిగ్రీ చదివి, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తండ్రికి అండగా ఉంటోంది. స్నేహ అక్కకు పెళ్ళైన ఏడాదికే తలచెడి, ఓ పసిగుడ్డుతో తిరిగి పుట్టింటికి చేరింది. స్నేహ చెల్లెలు ఇంటర్మీడియట్ చదువుతోంది. తల్లి గృహిణి. నాయనమ్మ ఇంట్లోనే ఉంటూ తల్లికి చేదోడుగా ఉంటుంది.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ఉన్నదాంట్లో గుట్టుగా సర్దుకుంటూ జీవితాన్ని గడుపుతోంది ఆ కుటుంబం.
సరిగ్గా అలాంటప్పుడే స్నేహను వెతుక్కుంటూ వచ్చింది ఓ సంబంధం. అబ్బాయి కూడా డిగ్రీ చదివి ఏదో ఉద్యోగం చేస్తున్నాడని, స్నేహను ఏదో పెళ్ళిలో చూసి ఇష్టపడ్డాడని, పెద్దగా కట్నకానుకలూ, లాంచనాలు అవసరం లేదని, కేవలం పెళ్లి చేస్తే చాలని అబ్బాయి తల్లిదండ్రులు అడిగారు.
ఓ మధ్య తరగతి ఆడపిల్ల తండ్రికి అంతకన్నా అదృష్టం మరొకటి ఉంటుందా? కాళ్ల దాకా వచ్చిన సంబంధం చేజార్చుకోవడం మూర్ఖత్వమే అవుతుందని, అందుకే మరో మాటకు తావు లేకుండా వెంటనే స్నేహ పెళ్లి చేసేసారు.
స్నేహ భర్త వికాస్. పెళ్ళయ్యాక స్నేహను ఉద్యోగం మాన్పించాడు వికాస్. ఇద్దరూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలూ పుట్టారు. స్నేహ ఇప్పుడు భర్త చాటు ఓ సగటు ఇల్లాలు. మూడు పువ్వులూ ఆరుకాయల్లాగా వారి సంసారం సాగిపోతోంది.
మెల్లగా వికాస్ ప్రవర్తనలో మార్పు రాసాగింది. ఇంటికి ఆలస్యంగా రావడం, ఫోన్లో రహస్యంగా మాట్లాడడం, స్నేహను నిర్లక్ష్యంగా చూడడం, రోజూ తాగి రావడం, ఇంట్లో అవసరాలను పట్టించుకోవడమే మానేసాడు.
ఇక చూస్తూ ఊరుకోలేక స్నేహ వికాస్ ను నిలదీసింది. సంపాదించిన జీతమంతా తాగుడుకే ఖర్చు చేసి, ఇల్లు ఎలా గడవాలి? పిల్లల స్కూల్ ఫీజులకు ఏం చేయాలని అడిగింది. అంతే ఇంతెత్తున లేచాడు వికాస్. ” నా జీతం నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాను. ఆడదానివి ఆడదానిలా పడి ఉండు. నోరెత్తావంటే నరికి పోగులు పెడతాను.” అంటూ స్నేహను కొట్టడానికి  చెయ్యెత్తాడు. పిల్లలు భయపడిపోయి, ఏడుస్తూ స్నేహను గట్టిగా పట్టుకున్నారు.
అది మొదలు స్నేహ వికాస్ ను ఏది అడిగినా గొడవే, అవసరమైతే కొట్టడం కూడా చేసేవాడు. ఇంట్లోకి అవసరమైన వస్తువులు అడిగితే మీ పుట్టింటి నుండి తీసుకురమ్మని వేధించేవాడు. వికాస్ పెట్టే కష్టాలు తట్టుకోలేక, మౌనంగా ఏడ్చేది స్నేహ. పుట్టింటివాళ్ళతో కూడా చెప్పుకోలేదు. పుట్టింటి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అదీగాక ఇంకా పెళ్ళి చేయాల్సిన చెల్లెలు. ఇలాంటప్పుడు తను పుట్టింటివాళ్ళకు చెప్పుకొని, వాళ్ళను మరింత బాధ పెట్టడమే గానీ మరొకటి కాదని, పిల్లల కోసం మౌనంగా వికాస్ పెట్టే చిత్ర హింసలను భరించసాగింది.
ఆరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక, వాళ్ళతో హోం వర్క్ చేయిస్తూనే వంట పూర్తిచేసింది. పప్పు పోపు పెట్టడానికని పొయ్యి మీద కాడ ఉన్న చిన్న ఇనుప మూకుడులో నూనె పోసి, పోపు గింజల కోసం డబ్బా మూత తీస్తుండగా వచ్చాడు వికాస్. ఒంటరిగా కాదు జంటగా.. పక్కనే ఎవరో మోడ్రన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఉంది. హాల్లో  పిల్లల ముందే వాళ్ళిద్దరి ఇకఇకలూ.. పకపకలూ వంటింటి దాకా వచ్చాయి. ఇక అంతే స్నేహకు పట్టరాని ఆవేశం వచ్చింది. “ఏమండీ?.. ఏంటి మీరు చేస్తున్న పని, ఎవరో పరాయి అమ్మాయితో భార్యాపిల్లల ముందు ఏంటాపనులు, కాస్తైనా ఇంగితం ఉండక్కర్లేదా? మనిషిలాగా ప్రవర్తించండి కాస్త..” అని గట్టిగా అరిచింది.
అప్పటికే తాగినట్టున్నాడు వికాస్. స్నేహ మాటలకు అతనిలోని పురుషహంకారం బుసలు కొట్టింది. ఒక్క ఉదుటన లేచి స్నేహను లాగి కొట్టాడు. అంతే స్నేహ చెయ్యి ఒక్కసారిగా పొయ్యి మీద ఉన్న నూనె మూకుడును తగిలి, అందులోని వేడి నూనె స్నేహ ముఖంలో ఒక పక్క కాస్త ఎగిసింది. క్షణాల్లో స్నేహ ముఖం బొబ్బలెక్కింది. మళ్లీ స్నేహ మీదకి దాడి చేయబోయిన వికాస్ ను, ఆత్మరక్షణ కోసం స్నేహ అదే మూకుడు కాడను పట్టుకుని అతని తలపై గట్టిగా కొట్టింది. ఆ మూపెద్దగా బరువు లేకపోయినా, బాగా వేడిగా ఉండడం వల్ల, ఆ వేడి ఓర్చుకోలేక గావు కేకలు పెడుతూ బయటకు పరుగెత్తాడు. ఈ హంగామా అంతా చూసి వికాస్ తో వచ్చిన అమ్మాయి ఎప్పుడో పారిపోయింది.
కాలిన ముఖంతోనే స్నేహ పోలీసు స్టేషన్ కు వెళ్లి, వికాస్ మీద కంప్లైంట్ ఫైల్ చేసి, పుట్టింటికి పిల్లలతో సహా వెళ్ళిపోయింది.
అందమైన స్నేహ ముఖాన్ని భయంకరంగా బొబ్బలతో చూసి బామ్మ, అమ్మ భయపడిపోయారు. స్నేహ బతుకు ఇలా అయిందేమని బాధ పడినా, కనీసం తన కూతురు బతికున్నందుకు సంతోషించి, స్నేహను ఆదరించారు ఆమె తల్లిదండ్రులు.
స్నేహ మళ్లీ ఉద్యోగంలో చేరి తన పిల్లలను పెంచుకుంటూ, తల్లిదండ్రులు, బామ్మతో కలిసి ఉంటోంది. ఇప్పుడు తన కంపెనీలో తను ఉత్తమ ఉద్యోగిగా అవార్డు తీసుకోబోతోంది. ఇవాళ ఆ ఫంక్షన్.
ఆ మచ్చ స్నేహ అందానికి వికారంగా మారింది. అందరూ ఆ మచ్చను తొలగించడానికి రకరకాల సలహాలు ఇచ్చారు. కానీ స్నేహకు ఆ మచ్చను చూసుకున్నప్పుడల్లా తనలోని ధైర్యం, తెగింపు గుర్తుకువచ్చి, రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తుంది.
స్నేహ ఇంకా అద్దం ముందే ఉండడం చూసిన బామ్మ “ఓసి నీ ఇల్లు బంగారం గానూ! ఇంకా తెమల్లేదా నువ్వు? అవతల ఫంక్షన్ టైం అయిపోతోంది. త్వరగా కానీ..” అంటూ తొందర పెట్టేసరికి ఈలోకంలోకి వచ్చింది స్నేహ.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!