ఒక రోజు అనుభవం

ఒక రోజు అనుభవం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

అమ్మా నేను వెళ్తున్నా. తలుపేసుకో అన్నది శ్రీదేవి. అదేంటే అప్పుడే రెడీ అయ్యావా. ఇప్పుడు ఎనిమిదేగ అయ్యింది. ఇంత తొందరగా వెళ్లి ఏం చేస్తావు అన్నది ప్రభావతి.తొందరగా లేచానమ్మా మా ఫ్రెండ్ వైజాగ్ నుండి వస్తుంది. స్టేషన్ కి వెళ్లి దాన్ని రిసీవ్ చేసుకుని వాళ్ళింట్లో కాసేపు ఉండి, అటునుండి అటే హోటల్ కెళ్ళి లంచ్ చేసి వచ్చేస్తాము. నా కొరకు ఎదురు చూడకు నీవు తినేసేయ్. నేను వెళ్తున్నా అన్నది శ్రీదేవి. నీకు ఎన్ని సార్లు చెప్పాలి, ఎప్పుడూ వెళుతున్నా అని చెప్పొద్దని, వెళ్ళొస్తాననాలి లేద వస్తా అనాలి తెలిసిందా అన్నది శ్రీదేవి తల్లి ప్రభావతి. పుట్టినరోజు నాడైన గుడికి వెళ్లాలి. గుడికి వెళ్ళకపోయినా కనీసం దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు. అనవసరంగా తిరుగొద్దు రోజులు బాగా లేవు అంటే అసలు వినవు. మీ నాన్న కూడా ఊర్లో లేరు తీసుకెళ్లడానికి టాక్సీలు, ఆటోల్లో తిరగకండి బస్సుల్లోనే వెళ్ళండి అన్నది ప్రభావతి. సాయంకాలం అందరం గుడికి వెళ్దామమ్మా ప్లీజ్ ఇప్పుడేమనకు” అని వేసుకున్న చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కొని దేవుడి గదిలోకి వెళ్లి, దేవుడికి దండం పెట్టుకుని తల్లి దగ్గరకు వచ్చి తల్లికి కూడా దండం పెట్టింది శ్రీదేవి. కొత్త దుస్తుల్లో మెరిసిపోతున్న కూతుర్నే పరీక్షగా చూసింది ప్రభావతి. తెల్లటి జార్జెట్ ఓణి గాలికి వయ్యారంగా ఎగురుతుంది. తెల్లటి దుస్తులు వేసుకుని, మెడలో సన్నని గొలుసు, చేతికి వాచీ, ఇంకొక చేతికి బ్రేస్లెట్, చెవులకి పెద్ద పెద్ద తెల్లరాళ్ళ హ్యాంగింగ్స్, రెండు కనుబొమ్మల మధ్య చిన్న బొట్టు, దానికింద దేవునిది చిన్నకుంకుమ బొట్టు పెట్టుకుని, రింగులు తిరిగిన నల్లని జుట్టుని జడల్లుకొని, కాళ్లకు పట్టీలు పెట్టుకుని చక్కగా రెడీ అయింది శ్రీ దేవి. బొమ్మలా ఉంది తన కూతురు అనుకున్నది ప్రభావతి. శ్రీదేవి రోజు ఎలా ఉన్నా పుట్టిన రోజు నాడు మాత్రము చక్కగా సాంప్రదాయంగా తయారవుతుంది. గులాబీ రంగు కలిసిన తెల్లని వర్ణంతో, కొటేరు పెట్టినట్టున సన్నటి ముక్కు, లేత గులాబీ రంగు పెదవులు, చిన్న నోరు కోల ముఖంతో బాపుగారి బొమ్మలా తీర్చిదిద్దినట్టున్న తన కూతురిని చూస్తూ నా కూతురికి నా దిష్టే తగులుతుందేమో అనుకున్నది మనసులో ప్రభావతి. వస్తానమ్మా అంటూ తనని పరీక్షగా చూస్తున్నా తల్లి బుగ్గపై మురిపెంగా ముద్దు పెట్టి కదిలి వెళ్లిన కూతురిని మలుపు తిరిగే వరకు గుమ్మంలోంచి చూస్తు నిలుచుంది ప్రభావతి.
శ్రీదేవి వెళ్లేసరికే స్టేషన్లో తన కొరకు స్నేహితురాళ్ళు అనుపమ, తనూజ ఎదురుచూస్తున్నారు. శ్రీదేవి వెళ్ళిన ఐదు నిమిషాలకు ట్రైన్ వచ్చింది. ట్రైన్ లో నుంచి దిగిన తన్మయి రాగానే శ్రీదేవిని విష్ చేసింది.
థాంక్స్ తన్మయి మీ బంధువుల ఇంటి నుండి ఇంత తొందరగా వస్తావో రావో అనుకున్నాను అన్నది శ్రీదేవి. అదేంటే మన ఆనవాయితీ ఎలా మర్చిపోతాను. మనము ముందు అనుకున్నట్లు మన నలుగురిలో ఎవరి బర్త్ డే అయినా ఎక్కడున్నా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాం కదా. నేనెలా మరిచిపోతాను. అయినా మా బంధువుల అమ్మాయి పెళ్లి నిన్ననే అయిపోయింది. అందుకే వచ్చేశాను అన్నది తన్మయి. అందరూ కలిసి లగేజ్ తీసుకుని తన్మయి ఇంటికి వెళ్లారు. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుని, ఆటలు, పాటలు, మాటలతో మూడు గంటలు గడిపి మెల్లగా లంచ్ కి బయటకి వెళ్లారు. లంచ్ అయిన తర్వాత అందరూ గలగలా మాట్లాడుతూ బయటకు వచ్చేసరికి తనుజ వాళ్ళ నాన్న వచ్చి అందర్నీ ఇళ్ళ దగ్గర డ్రాప్ చేస్తానన్నారు. శ్రీదేవి “వద్దు అంకుల్ మాది, తన్మయి వాళ్ళ ఇళ్ళు గచ్చిబౌలి వైపు మీరేమో దిల్ సుక్ నగర్ వైపు వెళ్ళాలి. మీకు లేట్ అవుతుంది మీరు వెళ్ళండంకుల్. మాకేం పరవాలేదు ఎలాగైనా వెళ్తాము అని వాళ్ళని పంపించేసి, తన్మయి, శ్రీదేవి క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరారు. నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెట్టి అదే క్యాబ్ లో నేను మా ఇంటికెళ్ళి పోతాను” అన్నది తన్మయి. అదేంటి ఇంత వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా పోతె మా అమ్మ ఊరుకోదు. మా ఇంటికెళ్ళి హాయిగా సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుందాము. ఈ లోపల మా నాన్న వచ్చేస్తారు. నేను మా నాన్న నిన్ను మీ ఇంటి దగ్గర దింపేస్తాం” అన్నది శ్రీదేవి. అది కాదే ఇప్పుడు ఒకటిన్నర అయింది. మా బావ మా ఇంటికి పన్నెండింటికే వస్తానని చెప్పాడు. నేను లేకపోతే బాగుండదు” అన్నది. అలాగైతే సరే కాబోయే భర్త వస్తాడని చెప్పి తప్పించుకుంటున్నావు. ఇప్పుడు వదిలేస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం” అన్నది శ్రీదేవి. ఇక్కడ ఆపేయమని డ్రైవర్ తో చెప్పు ఇక్కడి నుండి షార్ట్ కట్ లో వెళ్తే మా ఇల్లు పది నిమిషాల్లో వచ్చేస్తుంది. నేను ఒక్కదాన్నే వెళ్లి పోగలను. మీ బావ ఎదురుచూస్తుంటాడు. నీవు వెళ్ళు. నాకు ఏం పర్వాలేదు అని తన్మయిని పంపించేసి నడక ప్రారంభించింది శ్రీదేవి. దగ్గరి దారి లో వెళ్లాలంటే సమాధుల మధ్య నుండి వెళ్ళాలి. సామాన్యంగా అటువైపు నుంచి ఎవరు నడవరు. అంతేకాకుండా సమ్మర్ ఎండలు మండిపోతున్నాయి అందుకని రోడ్లపైన ఒక్క మనిషి కూడా కనబడటం లేదు. తన్మయిని వెళ్లి పొమ్మన్నది కానీ, ఆ దారిలో వెళ్లాలంటే తనకు భయమే. కొంతదూరం వెళ్ళగానే ఎదురుగుండా పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని దగ్గరకు శ్రీదేవి రాగానే ఒక్కసారిగా విపరీతమైన గాలి, దుమారం మొదలైంది. గుబురుగా ఉన్న ఆ చెట్టు కొమ్మలు అటుఇటు విపరీతంగా ఊగుతున్నాయి. ఆ కదలికకు చెట్టు పైన ఉన్న పక్షులు కిచకిచ మని అరుస్తూ ఎగురుతున్నాయి. ఇంతట్లోకే భయంకరంగా ఎక్కడినుండో నక్కల ఊళలు వినిపించసాగాయి. చెట్టు పైకి చూసేసరికి ఒక పెద్ద గుడ్లగూబ శ్రీదేవినే చూస్తూ భయంకరంగా అరుస్తున్నది. శ్రీదేవి కాళ్ళు భయంతో నేలకు అతుక్కు పోయి కదలమంటున్నాయి. ఇంతకుముందు ఈ దారిలో తను ఎప్పుడూ వెళ్ళలేదు. అమ్మ ఎన్నోసార్లు ఆ దారిలో వెళ్లొద్దని చెప్పినా వినకుండా పిచ్చి ధైర్యంతో ఈ రోజు వచ్చింది. చెట్టును ఎవరో పట్టుకుని గట్టిగా ఊపుతున్నట్టు ఊగుతోంది. ఇంతలోనే వెనక ఎవరో ఉన్నట్లు సన్నగా నవ్వుతూ ఉన్నట్టు, తనను తాకుతున్నట్లు అనిపించింది. అంత భయంలో కూడా ‘శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం’ అంటూ నాన్న నేర్పించిన ఆంజనేయ దండకం చదవాలని ప్రయత్నించింది. కానీ అదేంటో ఆ సమయంలో ఆంజనేయ దండకం కూడా జ్ఞాపకం రావడం లేదు. కళ్ళ ముందర ఎన్నో తెల్లని ఆకారాలు అటు ఇటు తిరుగుతూ భయంకరంగా నవ్వుతున్నాయి. మధ్య మధ్య రోమాలతో కూడిన స్పర్శ శరీరాన్ని అక్కడక్కడ  తడుముతుంటే జుగుప్స కలుగుతుంది. చెవుల దగ్గర ఏదో అర్థం కాని భాషలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత వేసవిలో కూడా ఒళ్లంతా ఒణికి పోతున్నది. చెమటలు దారాపాతంగా కారుతున్నాయి. అంతలోనే చిమ్మ చీకటి ఆవరించింది. నోరు పిడచ కట్టుకు పోతుంది అరుద్దామంటే నోరు పెగలడం లేదు. శరీరంలో ఒక్క అవయవం కూడా తన అధీనంలో లేదు. మధ్య మధ్య చెవులు చిల్లులు పడేలా గుడ్లగూబ అరుపులు వినబడుతున్నాయి. తనకు తెలిసిన దేవుళ్ళనందర్నీ తలుచుకుంటూ, ఆంజనేయ దండకం చదువుతూ బలాన్నంతా కూడదీసుకుని కాళ్ళని తన స్వాధీనంలోకి తెచ్చుకుని పరిగెత్తడం మొదలు పెట్టింది./ఎటెళ్ళుతుందో తెలియట్లేదు. అయినా పరుగు ఆపకుండా మసకగా కనిపించే దారివెంట సందులు గొందులు పరుగెత్తుతూనే ఉంది. ఎంత పరిగెత్తినా తిరిగి తను నిలుచున్న చోటేకే వస్తుంది. కనుచూపు మేరలో ఒక ఇల్లు కానీ, ఒక్క మనుషి కానీ కనిపించట్లేదు. పరిగెత్తి పరిగెత్తి పూర్తిగా అలసి పోయింది. దేవుళ్ళను ధ్యానించు కుంటూనే ఉంది. చివరికి పరుగెత్తే శక్తి లేక ఏడుస్తూ నేలపై వాలిపోయింది. అమ్మా ,నాన్న అని పిలుస్తు ఏడుస్తూనే మళ్ళీ పరుగెత్తడం మొదలు పెట్టింది. ఎంత పరిగెత్తినా ఇల్లు మాత్రం కనిపించలేదు. అమ్మ ఎంత వద్దని చెప్పినా వినకుండా వచ్చినందుకు తనకు తగిన శాస్తి జరిగింది. అయినా ఇక అమ్మానాన్నలను చూస్తానన్న ఆశ కూడ లేదు. అలా అనుకోగానే కళ్ళల్లోంచి ధారాపాతంగా కన్నీళ్లు రాసాగాయి. వెక్కి వెక్కి ఏడుస్తూ పరిగెత్తుతూ ఉంది. కొంత సమయం గడచిన తర్వాత చివరికి గాలిలో తేలుతున్నట్టు తేలిపోసాగింది. కొంత దూరము అలా ఎగిరిన తర్వాత ఒక్కసారిగా కింద పడిపోయింది. పడిపోయేటప్పుడు భయంతో “అమ్మా నాన్నా” అని గట్టిగా అరవడం మొదలు పెట్టింది. అరుపులు విని ముందు గదిలో టీవీ చూస్తున్న తల్లిదండ్రులు ప్రభావతి, నాగేశ్వరరావు పరిగెత్తుకొని వచ్చి “శ్రీదేవి ఏమైందమ్మా ఎందుకలా అరుస్తున్నావు. లే లే సాయంత్రం అయింది. గుడికి వెళ్దామన్నావు కదా, అదేంటి ఒళ్ళంత  చెమటలు పట్టాయేంటే. శ్వాస అలా తీసుకుంటున్నావేంటి. ఏంటే ఏమైంది. లే, లే” అని తట్టి లేపారు. కళ్ళు తెరిచిన శ్రీదేవికి ఒక్క క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు. తల్లిని, తండ్రిని చూసి బిగ్గరగా పట్టుకుని ఏడవడం మొదలు పెట్టింది. “ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు. ఏమైనా పిచ్చి కల వచ్చిందా” అని దగ్గరకు తీసుకుంది తల్లి. ఎండలో ఒక్క దానివి ఆ చెట్టు కింద నుంచి ఆ సమాధుల మధ్య ఉండి రావద్దంటే వినవు కదా. మంచినీళ్లు తాగు” అని చెప్పేసరికి కొంత తేరుకుని అంత భయంకరమైనదంతా కలనేనా అనుకుంది. ఆ అనుభవం తలుచుకుంటె ఇంకా ఏడుపు వస్తుంది
ఏమైంది ఎందుకు ఏడుస్తున్నది అని నాగేశ్వరరావు ప్రభావతిని అడిగాడు. ఏమోనండి ఎవరో ఫ్రెండ్ ట్రైన్ లో వస్తుందని ఉదయమే వెళ్ళింది. బయటే లంచ్ చేసి రెండున్నరకు వచ్చి పడుకుంది అంతే” అన్నది ప్రభావతి. ఏమయ్యిందిరా అంటు తండ్రి తలపై చెయ్యివేయగా ఆ చెయ్యిని ఆసరగా పట్టుకునే సరికి పూర్తిగా తేరుకున్నది. తల్లి తండ్రి తలపై నిమురుతుంటే తనకొచ్చిన కలనంతా చెప్పింది. అదంతా కలనే కద ఇంక భయపడకు లేచి మొహం కడుక్కో గుడికి వెళ్దాం” అని చెప్పినా ఎంత సేపటి వరకు వాళ్ల చేతుల్ని వదలలేదు శ్రీదేవి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!