సామాజిక స్ప్రహ 

సామాజిక స్ప్రహ 

రచన : తిరుపతి కృష్ణవేణి

ఈ మధ్యనే కొత్తగా ఇంట్లో దిగిన కళ్యాణి దంపతులకు ఆ వీధిలోని వారు, వింతగా ప్రత్యేకంగా కనిపించారు. ప్రక్క ప్రక్క ఇండ్లలో ఉంటున్న వారు మాట్లాడుకోవటం, ఒకరితో ఒకరు సరదాగా ఉండటం గానీ,పిల్లలు కలసి ఆడుకోవటంగాని,బయట తిరిగినట్లు గానీ,వచ్చి ఇన్ని రోజులు అయినా అటువంటి దృశ్యం కనిపించలేదు.
ఈ వీధిలోఎవరికి వారే యమునాతీరే అనే విధంగా ఉంటున్నట్టున్నారు.
మనం కాస్త పలకరింపుగా నవ్వుతూ ముఖం పెట్టినా పొరపాటున కూడా వాళ్ళ ముఖాలలో నవ్వు మచ్చుకైనాకనిపించదు. నవ్వితే వారి నోటి ముత్యాలు ఎక్కడరాలి పోతాయో! అన్నంతగా వుంటుంది వాళ్ళ ప్రవర్తన! వెంటనే తలదించుకొని నేల చూపులు చూస్తుంటారు.ఏమీ తెలియనట్లు! పోనీలే! మనల్ని సరిగా చూసి వుండరులే! అని సరిపెట్టుకుని రేపు ఎదురయి నప్పుడు మరలా నవ్వినా! అదే పరిస్ఠితి. అలా రోజూ చూస్తూనే,మనకి మనమే పిచ్చి వాళ్ళలా, నవ్వు కోవటం తప్ప వారి నుండి ఏ రకమైన స్పందన కనిపించేది కాదు. ఏమీ, వీధిరా బాబూ!
ఓ మంచీ లేదు చెడూ లేదూ? ఇరుగు పొరుగు అన్న తరువాత ఓ,నవ్వొ! పలకరింపో! అనేది లేకపోతే ఎలా? ఎప్పుడూ మొహం మీద పేలాలు పోస్తే వేగుతాయా! అన్నట్లుగా వుంటారు ఎందుకో? ఏమో? అని భర్తతో అంది కళ్యాణి.కొందరు అంతేలే? డబ్బు హోదా చూచి స్నేహం చేస్తారు. పోనీలే! వారు మాట్లాడి నప్పుడే మాట్లాడితే పోలే! నీకెందుకు అంత బాధ అని నవ్వుతూ అన్నాడు.
అది కాదండీ! ఇదేమైనా పెద్ద సిటీనా! ఎవరింట్లో వారు తలుపులు వేసుకొని వుండటానికి, అలా ఒకరి కొకరూ పలకరించుకోకుంటే కాలక్షేపం ఎలా అవుతుంది. పరిచయాలు ఎలా
పెరుగుతాయి! అదేకదా! అందరూ కలసి మెలసి ఉంటేనే కదా!ఏదైనా కష్టమొస్తే ఒకరికొకరు సహాయంగాఉంటారుకదా! ఏమి మనుషులు? ఎప్పుడు తెలుసుకుంటారో! ఏమో? అని మనసులోనే అనుకొని తనపనిలో నిమగ్నమయి పోయేది కళ్యాణి.వచ్చిన కొన్ని నెలలకే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో విలయతాండవం చేయటం మొదలు పెట్టింది. మా ఎదురింట్లో ఉన్న రవి దంపతులు
ఇంతకు ముందు ఒకరితో ఒకరు మాట్లాడక పోయినా! కాస్త అటూ, ఇటూ అయినా చూసేవారు. పాపం! ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఎటు వైపు చూస్తే ఏమీవస్తుందో! అనే భయంతో ! ఇంటి బయటకు రావటం మాని వేశారు.కళ్యాణి రాధా,గార్లు వుదయం లేచింది మొదలు ఎదురు బొదురు ఇల్లులు అవటం వలన ముఖ, ముఖాలు చూసుకోవటం తప్పని పరిస్థితి. వరండాలో కూర్చుంటారు, అయినా ఏమిటి లాభం? ఓ మాట! మంచా?
పాపం కళ్యానికి మాత్రం దూరం నుండి అయినాఏదో ఒకటి మాట్లాడాలని ఉండేది, కాని రాధ గారు నోరు తెరవందే ఎలా?రోజులు భారంగా గడుస్తున్నాయి. గడచిన సంవత్సర కాలంగా కరోనా భయంతో జనం ఎవరింటికి వారే పరిమితమై పోయారు. ప్రతీ ఒక్కరూ ఆందోళనతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఎవరి జాగ్రత్తలు వారుపాటిస్తూ ఉన్నారు. ఇరుగు, పొరుగువారు కూడ ఒక మాట ముచ్చట అన్నది లేకుండా ఉండటం కళ్యానికి ఏ మాత్రం నచ్చేది కాదు. దూరం నుండి అయినా కాస్త పలుకరిoపులు ఉంటే మనసుకు కాస్త ఉప శాంతి అయినా లభిస్తుంది కదా! అనుకునేది కళ్యాణి.ఒక్కొక్కసారి ఎదురింటి వారు తీసుకునే జాగ్రత్తలు చూస్తుంటే భయం కూడా వేసేది. ఎందుకంటే! వారిలా జాగ్రత్తలు మనం పాటించటం లేదేమో అని! వారు మాత్రం మేము ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము కావునా మాకు కరోనా సోకదు. అని చాలా ధైర్యంగా ఎంతో ధీమాగా వుండేవారు. లాక్డౌన్ పేరుతో ఊరు వాడా నిర్మానుష్యంగా ఉంది అలాంటి సమయంలో వున్నట్టుండి ఎదురింట్లో వున్న రవి గారికి జ్వరం రావటంతో హుటాహుటిన హాస్పటల్ కు తీసుకొని వెళ్లారు.

అసలే భయస్తులైన రవి దంపతులకు వారు భయపడుతున్నట్టుగానే టెస్టింగ్ లో ఆయనకు కరోనా ఉన్నట్లు పాజిటివ్ రిపోర్టు వచ్చింది.ఒక్కసారిగా వారికి నెత్తిమీద పిడుగు పడినంత పనైంది. కరోనా రావటం ఒక ఎత్తుఅయితే! చుట్టు పక్కల వారు తమని ఎలా చూస్తారో! ఏమో! అనే భయం మరో వైపు! ఎంతో జాగ్రత్త గా ఉన్న మాకు రావటమేమిటి? అని బాధ పడసాగారు.
ఇక రోజూ తమ ఇంటికి హెల్త్ వాళ్ళు, పంచాయితీ సిబ్బంది రావటం, పోవటం ఆలోచిస్తేనే వాళ్లకు ఆందోళన పట్టుకుంది. ఒక ప్రక్క ప్రాణభయం. క్యారంటైన్ లోఉండాలి. అసలు బయటకు కదిలే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితి లో సహాయం చేయటానికి మా బంధువులు కూడ ఎవరూరారు. ఇంక బయట వారు ఎవరు సహాయం చేస్తారు. సరుకులు అవసరమైన మందులు ఎవరు తెస్తారు. ఒకవేళ తన భార్యకు కూడ కరోనా సోకితే మా పరిస్థితి దారుణంగా ఉంటుంది అని రవి తర్జన భర్జన పడుతున్నాడు. అప్పుడే రెండు రోజులు గడచి పోయాయి. అంతకు ముందు తెచ్చిన కూరగాయలు, సరుకులు అయిపోయాయి. ఎవరిని సహాయం అడగాలి. ఈ వీధిలో మొదటినుండి ఎవరితో కూడ సఖ్యతగాలేము. సరిఅయిన పరిచయాలు పెంచుకోలేక పోయాము. ఈ కష్టకాలంలో ఎవరు చొరవ తీసుకొని మన దగ్గరకు వస్తారు.
అని బాధపడసాగారు.రవి దంపతుల కష్టాన్ని గమనిస్తున్న, కల్యాణి దంపతులు వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. సాటి మనుషులు బాధ పడుతుంటే చూస్తూ కూర్చోవటం మనిషి లక్షణం కాదు! వారికి సహాయం చేయాలని చొరవ తీసుకుని తగుజాగ్రత్తలతో కూరగాయలు, పళ్ళు, కావలసిన పదార్థాలు తీసుకొని వారి ఇంటికి వెళ్ళి పలుకరించి వారికి అందచేశారు. అంతే కాదు అవసరమొచ్చినప్పుడల్లా వారికి కావలసిన వస్తువులు అందించారు. రవి కుటుంబ సభ్యులు అందరికి కరోనా సోకటం వలన తప్పని సరి పరిస్థితుల్లో వారి సహాయాన్ని తిరస్కరించలేక పోయారు.
ఎంతోబాధ్యతతో, క్యారంటైన్ కాలం పధ్నాలుగు రోజులు రవి కుటుంబానికి కావలిసిన సహాయం అందిస్తూ వచ్చారు. పధ్నాలుగు రోజుల తరువాత చేసిన కరోనా టెస్ట్ ల్లో అందరికి నెగిటివ్ రిపోర్టులు వచ్చేసరికి ఎంతో సంతోషపడ్డారు. ఇంతకాలం ఇతరుల అవసరం మనకు ఏర్పడదు అనుకున్నాము.కాని ఇప్పుడు అర్దం అయింది.
కరోనా వచ్చిన వారి దగ్గరకు సొంత వాళ్ళు కూడా రాలేరుఅని!చుట్టు పక్కల వారు మాత్రమే ఎంతో కొంత సహాయం చెయ్యగలుగుతారు. వారితో స్నేహంగా వుండటం ఎంత అవసరమో, తెలిసింది. ఇరుగు పొరుగు అన్నాక ఎప్పుడో అప్పుడు ఒకరితో ఒకరికి అవసరం తప్పక ఏర్పడుతుంది. తనదాక వస్తే గానీ తెలియదు. అంటారు.ఇదేనేమో! నిజంగా మన ఎదురింటి వారు లేక పోతే మన పరిస్ఠితి ఎలా వుండేదో? కనీసం మాట సహాయం చేసే వారు కూడా కరువయ్యే వారు.
ఇలాంటి కష్ట సమయంలో వారు భయపడ కుండా ఎంతో శ్రమ తీసుకొని మనకు కావలసినవి సహాయాన్ని అందించడం చాలా గొప్ప విషయం. ఎంత డబ్బు హోదా వున్నా ఏమీ ప్రయోజనం ? ప్రతీ మనిషీ సామాజిక స్పృహ కలిగి అందరితో కలసి మెలసి వుండాలి. సాటి మనిషి కష్టంలో వున్నప్పుడు ఆదుకోవాలి. అది మనిషి కనీస ధర్మం.ఇంత కాలం ప్రవర్తించిన తీరుకు వారు మనసులోనే సిగ్గుపడ్డారు.
ఆరోగ్యం కుదుట పడిన కొన్ని రోజుల తర్వాత, కల్యాణి దంపతులకు కృతజ్ఞతలు తెలియచేయడానికి వారి ఇంటికి వచ్చిన రాధా,రవీ దంపతులను చూసి కళ్యాణి దంపతులు ఎంతో సంతోషించారు.
వారు అందించిన సహాయానికి కృతఙ్ఞతలు తెలియ జేశారు.
ఆనాటినుండి ఆ వీధిలో ఉన్న అన్నీ కుటుంబాలవారు కలసి మెలసి స్నేహాభావంతో ఉండ సాగారు.

You May Also Like

One thought on “సామాజిక స్ప్రహ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!