ఉన్నాడంతే

ఉన్నాడంతే

రచన: పద్మజ రామకృష్ణ.పి

కుమారి.నారాయణల ఏకైక పుత్రిక లక్ష్మీ..ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే కలిగిన సంతానం.లక్ష్మీ.. ఉన్నతమైన విలువలు ఉన్న చిన్న కుటుంబం కుమారి వాళ్ళది…లేకలేక కలిగిన సంతానం కావడంతో పిల్లను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆ దంపతులు…

లక్ష్మీ పేరుకు తగినట్లుగానే చాలా చక్కగా ఉండేది.బంగారు ఛాయతో మెరిసిపోతూ చూసేవారి కళ్ళు చూపు మరల్చుకోలేనంత అందంతో. ఆడవాళ్ళకు కూడా అసూయ పుట్టేలా ఉండేది లక్ష్మీ చక్కదనం…

అబ్బా ఏ ఇంట అడుగుపెడుతుందో కాని అక్కడ దీపాలతో పని లేదు తనే ఒక దీపంలా వెలిగిపోతోంది అని చెప్పుకునేవారు చుట్టుప్రక్కల వాళ్ళు….

లక్ష్మీ కి చాలా పెద్దింటి సంబంధాలే వచ్చాయి.. అన్ని సంబంధాల వాళ్లకీ కూడా లక్ష్మీ నచ్చింది…వచ్చిన అన్ని సంబంధాల్లో ఆస్తి కంటే కూడా గుణగణాలు.ఈడూ జోడూ కలిగి అందరికంటే ఆస్తి తక్కువ ఉన్న సురేష్ ని ఎంచుకున్నారు లక్ష్మీ తల్లిదండ్రులు…

ఓ మంచి ముహూర్తం చూసి వివాహం జరిపించారు ఇరువైపులపెద్దవాళ్ళు…

అప్పగింతల సమయం రానే వచ్చింది.మనసంతా భారంగా మారిపోయింది కుమారి.నారాయణ దంపతులకు..నారాయణ చిన్నపిల్లాడిలా కూతుర్ని హత్తుకుని ఏడుస్తున్నాడు..కుమారి తన కళ్ళను పవిట తో తుడుచుకుంటూ కూతురు బుగ్గ మీద ముద్దుపెడుతూ జాగ్రత్తలు చెబుతుంది..

లక్ష్మీ ని ఎంత గారాబంగా పెంచారో వియ్యలవారికి లక్ష్మీ బంధువులు చెప్పగా విన్నారు. ఇప్పుడు కళ్లారా చూస్తున్నారు..

లక్ష్మీ అత్తగారు ఒక్కడుగు ముందుకు వేసి వియ్యపురాలు అయిన కుమారి దగ్గరకు వెళ్లి…చూడండి వదిన గారు.లక్ష్మీ ఇంక మీదట మీకే కాదు మాకు కూడా ఇంటి ఆడపిల్లతో సమానమే. ఆడపిల్లలు లేని నాకు కోడలే కాదూ కూతురు కూడా అని చెప్పింది..

కుమారి ఆ మాటతో చాలా సంతోషపడి.మా బిడ్డను మీ బిడ్డగా అప్పచెబుతున్నాము వదినగారు తెలియక ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో మన్నించండి అంటూ వచ్చే దుఃఖాన్ని అపుకుంటూ అప్పగింతలు చెప్పింది.

ఇదంతా చూస్తున్న అల్లుడు సురేష్ నారాయణ దగ్గరకు వెళ్లి..మామయ్యగారూ మీరు ఎప్పుడు లక్ష్మీ ని చూడాలి అనుకుంటే అప్పుడే నాకు ఒక్క ఫోన్ కాల్ కొట్టండి వెంటనే నేను తీసుకుని వస్తాను. లేదా లక్ష్మీ ని చూడాలి అనుకుంటే మీరే వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.అని మామగారి కి భరోసా కల్పించి బయలుదేరారు అక్కడి నుండి…

పుట్టింట్లో ఎంత గరాబంగా పెరిగిందో. అత్తింట్లో కూడా అంతే గారాబంగా జరిగిపోతుంది లక్ష్మీ కి…చూస్తూ ఉండగానే పెళ్లై ఒక సంవత్సరం గడిచిపోయింది.

ఒక్క నిమిషం కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా లక్ష్మీ.సురేష్ ల దాంపత్యం పెనవేసుకుంది.

అనుకోని ప్రయాణంతో లక్ష్మీ వాళ్ళ ఇంటికి వచ్చారు.లక్ష్మీ తల్లిదండ్రులిద్దరూ.అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం ఆనందం ఒక్కసారే కలిగాయి వాళ్ళకు.

సురేష్ వాళ్ళ అమ్మ ఒక పెద్ద వెండి పళ్ళెంలో వేడివేడి అన్నంలో ఒత్తుగా నెయ్యి వేసి ముద్దలు కలిపి కోడలికి పెడుతూ సురేష్ తో చెబుతోంది. రాత్రి కూడా సరిగ్గా అన్నం తినలేదు రా ఇది. ఇలా చేస్తే ఎలా వాళ్ళ ఇంటికి పంపేద్దాం అంటుంది జోక్ గా నవ్వుతూ.సురేష్ తల్లి.

అత్తమ్మా మనం ఇంకో ఇల్లు కూడా కట్టామా.? ఎక్కడ అది అంటూ ఎదురు పంచ్ వేస్తూ అత్తగారి భుజం మీద వాలిపోతూ నవ్వుతుంది లక్ష్మీ..

అత్తమామలు రాక గమనించి గబగబా ఎదురు వెళ్ళి రండి రండి అత్తయ్య మామయ్య గారు అన్నాడు సురేష్.

సురేష్ తల్లి కూడా రండి అన్నయ్య గారు.వదిన గారు అంటూనే తన నెయ్యి కారుతున్న చేతిని మరో చెయ్యి నెయ్యి బొట్లు క్రింద పడకుండా అడ్డు పెట్టుకుని హ్యాండ్వాష్ ఏరియా వైపు నడిచింది.

చెయ్యి కడుక్కుని వచ్చి కుమారి పక్కనే కూర్చుంది వియ్యపురాలు…రెండు రోజులుగా పిల్ల అన్నం సరిగ్గా తినడం లేదు వదినగారు.హాస్పటల్ కి రేపు తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అంది ఏదో సంతోషాన్ని దాచి దాచనట్లుగా.

ఎలాగూ వచ్చాం కదా వదినగారు.లక్ష్మీ ని మాతో తీసుకుపోయి హాస్పటల్ లో చూపించి రెండు రోజులు ఉంచుకుని పంపిస్తాము అంది కుమారి.

అయ్యో అలాంటి ఫార్మాలిటీస్ ఏమి అవసరం లేదు వదినగారు.మీరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి రేపు మన ఇద్దరం దగ్గర ఉండి చూపిద్దాము సరేనా అంది సురేష్ తల్లి.

కుమారి కి అర్థం అయ్యింది. మాట వరుసకు కాదు అప్పగింతలు నాడు వియ్యపురాలు చెప్పిన మాట..లక్ష్మీ మీకే కాదు.మాకు కూడా కోడలు కాదు కూతురే అన్నమాట.

కూతురి కాపురం చూసి చాలా మురిసిపోయారు లక్ష్మీ తల్లిదండ్రులు.

తెల్లారి.హాస్పటల్ కి తీసుకువెళ్లారు లక్ష్మీ ని..ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేశారు డాక్టర్ గారు.

ఈ వార్త ఆ రెండు కుటుంబాల్లో కూడా సంతోషాలకు వారధి వేసింది.

లక్ష్మీ ని మంచినీళ్లు గ్లాసు కూడా మోయనియకుండా ఎక్కడ కందిపోతుందో తన కోడలు.కూతురు అనట్లుగా చూడసాగారూ ఇరుకుటుంబాల వాళ్ళు.

లక్ష్మీ కి నెలలు నిండాయి.నెలలు నిండడంతో నిద్ర కష్టంగా మారింది తనకి.

నిద్ర పోతున్న భర్తను మెల్లిగా లేపింది లక్ష్మీ..

సురేష్ చిన్నగా నవ్వి కళ్ళు తెరుస్తూ భార్య వంక చూసి ఏమ్మా అన్నాడు ప్రేమగా.

ఎందుకో భయంగా ఉంది నాకేదైనా అవుతుందేమో అని అంది లక్ష్మీ.

అవేం మాటలు అంటూ భార్య నోరు మూసాడు సురేష్..అప్పటికే సురేష్ కళ్ళల్లో కన్నీటి సుడులు తొంగి చూశాయి.

పడుకొమ్మా చాలా టైమ్ అయింది అని భార్య తల నిమురుతూ చిన్న పిల్లను నిద్ర బుచ్చినట్లే నిద్ర బుచ్చాడు సురేష్.

మెల్లగా నిద్ర లోకి జారుకుంది లక్ష్మీ…..

నాకేదైనా అవుతుందేమో అన్న భార్య మాట గుర్తు వచ్చి చాలా బాధతో. నిద్రపోతున్న భార్య వంక చూస్తూ తన మనసులో భావం ఇలా వ్యక్తపరిచాడు.
నువ్వు రానప్పుడు నాకు నేను గుర్తు లేను.నువ్వు వచ్చాక నువ్వు తప్ప ఏదీ గుర్తు రాదు.నువ్వు లేని నాడు నేనూ లేను అంతే అని చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నారు సురేష్….

ఆ తెల్లారి…లక్ష్మీ ఉదయాన్నే నిద్ర లేచి శుక్రవారం కావడంతో తలస్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకుని తల నిండా ఎర్రని కనకంబరాలు పెట్టుకుని. ఎర్ర చీరలో లక్ష్మీదేవిల కళకళలాడిపోతుంది…

నెలలు నిండిన లక్ష్మీ ని పురుడుపోసుకోవడానికి పుట్టింటికి పంపడం ఇష్టం లేక.లక్ష్మీ ని వదిలి ఉండలేని సురేష్.అత్తమామలు కూడా కుమారి ని ఇక్కడే ఉండు అమ్మాయికి పురుడు వచ్చేవరకు అని చెప్పి ఇంట్లోనే ఉంచుకున్నారు….

లక్ష్మీ ఇంట్లో అందరికి ఎంతో కొత్తగా కనిపించింది. తన నవ్వు. మాట తీరు ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి ఆ రోజంతా…

నైట్ 11 గంటలు దాటింది సన్నగా లక్ష్మీ కి నొప్పులు మొదలయ్యాయి..

అందరిలో ఒకటే కంగారు..పేరున్న ఒక పెద్ద హాస్పటల్ లో జాయిన్ చేశారు లక్ష్మీ ని..

కాన్పుల రూమ్ లోకి తీసుకుపోయారు లక్ష్మీ ని..

నర్స్ బయటకు వచ్చి ఎవరమ్మా లక్ష్మీ తాలూకా అంది..

మేమే మేమే అని ఒక్క అంగలో ముందుకు వెళ్లారు లక్ష్మీ తల్లిదండ్రులు. అత్తమామలు.భర్త..

కాన్పు కష్టంగా మారింది సిజేరియన్ పడొచ్చు సిద్ధంగా ఉండండి అని లోపలికి వెళ్ళిపోయింది నర్స్…

మరల కాసేపు తర్వాత బయటకు వచ్చారు ఇద్దరు నర్సులు.ఆ అమ్మాయి కి బ్లెడ్ ఎక్కించాలి అన్నారు.

సురేష్ హడావుడిగా బ్లెడ్ సేకరించి రెడీ చేసి ఇచ్చాడు..

కాసేపటి తర్వాత పసిబిడ్డ ఏడుపు వినిపించింది ఆపరేషన్ థియేటర్ నుండి లక్ష్మీ కుటుంబ సభ్యులకు..హమ్మయ్య అని అందరూ గట్టిగా గాలి పీల్చుకున్నారు…

నర్సులు పాప పుట్టింది అని చెప్పి వెంటనే తలుపులు వేసుకున్నారు…

లక్ష్మీ గురించి తను ఎలా ఉంది అని కుటుంబ సభ్యులు అడగాలి అనుకునే లోపే నర్సులు తలుపులు బిగించారు…

కాసేపటి కి నర్సులు బయటకు వచ్చి లక్ష్మీ చనిపోయింది అని చెప్పారు

సురేష్ ఒక్కసారిగా వణికిపోయ్యాడు..
ప్రపంచం మొత్తం శూన్యంగా మారిపోయింది సురేష్ ఆలోచనలకు…

అల్లారుముద్దుగా పెంచుకున్న వాళ్ళ ఇంటి దీపం ఆరిపోయి తల్లిదండ్రులు అయోమయ పరిస్థితి లో ఉండిపోయారు…

మరో అందమైన పాపను పెంచే బాధ్యత అత్తమామల మీద పెట్టింది లక్ష్మీ…

సురేష్ పిచ్చివాడుగా మారిపోయి లక్ష్మీ జ్ఞాపకాలతో గడుపుతున్నాడు..తను లేని అతను ఉన్నాడంటే ఉన్నాడంతే.మరణం కోసం ఎదురుచూస్తూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!