పిల్లలు-పిడుగులు
రచన: సావిత్రి రవి దేశాయ్
గణ గణ గంటలు కొట్టేశారు..
బిల బిల పిల్లలు బడి కొచ్చారు..
మొదటి గంటలో తెలుగుసారు..
పాఠం పేరు సంధులు-సమాసాలు..
అల్లరి పిల్లలు గోలలు చేస్తూ
సందుల సంగతి తర్వాత చూద్దాం..
సమోసాల విందు చేద్దాం ముందు
అయ్యోరమ్మ చేసిచ్చారా..
బుజ్జమ్మ హోటల్ కెళ్ళొద్దామా..
చందాలేసి చెల్లిద్దామా..
జీతం డబ్బులు చెల్లిస్తారా..
అంటున్నారు గోలలు చేస్తూ…
తిండికి తిమ్మరాజులు-
చదువుకు పోతరాజుల..
సమాసాలంటే సమోసాలంటూ చొంగలు మొత్తం కార్చెస్తారు..
నువ్వెంటమ్మ.. సావిత్రమ్మ
కూర్చున్నావు ముంగి ముచ్చులా..
తెలుసా నీకు సంధులంటే..
చెప్పేసేయ్ గబగబా చకచకా..
తెలుసండి మాస్టారయ్యా..
ముచ్చటగా మూడే సందులు..
ఇంటి ముందర ‘గురవయ్య సందు’
ఇంటి పక్కన ‘దేవయ్య సందు’
మరి ఇంటి వెనకేమో ‘పుల్లమ్మ సందు’…
సందులు దాటితే వచ్చును బాజారు..
వెళితేనాకు బేజారు..
హమ్మో హమ్మో పిల్లలు కాదు పిడుగులు వీళ్ళు..
మూడు చెరువుల నీళ్లు తాపిరి…
అంతలో కొట్టిరి రెండో గంట..
పిల్లలందరూ తోక ముడిచిరి..
వచ్చిందెవరు లెక్కల మాస్టర్..
ఇప్పుడు అల్లరి చిల్లరి పిల్లలందరు
ష్.. గప్ చుప్.. చక్కగా చదివిరి
లెక్కల్.. ఎక్కాల్…