ప్రణతులు
రచన: సావిత్రి కోవూరు
ప్రథమ ప్రణతులు అర్పింతు నన్ను కన్న వారికి, జన్మనిచ్చి,నాకు బంగారు బాల్యం గూర్చి,
జీవితంబులోన జీవించు మార్గం చూపి, చేయి పట్టి మంచి నడక నేర్పి,
సుఖదుఃఖములు లోన తోడుగా నిలిచి,
తమ సుఖాలను త్యాగంబు గావించి
నా ఆనందమునకు జీవితం అంకితంబిచ్చిన
నా జననీ జనకుల స్మరిస్తూ ప్రథమ ప్రణతి.
పిదప ప్రణతులు అర్పింతు నా ప్రగతికి బాటలు వేసి,
నా తప్పొప్పులు ఎరిగించి, స్వార్థమెరుంగక,
సమాజమును నాకు ఒక స్థానం కూర్చి,
రాయిని రత్నముగ సానపట్టి, రాజ మార్గాన్ని చూపి, నా రాతనే మార్చిన గురువర్యులకు శిరస్సు వంచి ప్రణతి ప్రణతి.
ప్రణతులర్పింతు ప్రాణ విభునకు, ప్రసన్న వదనాన ప్రశాంతత గూర్చి, నా ప్రగతికి సోపానమందించి, ఆలనా పాలనా అన్ని తానై ఆదరించి,
స్థైర్యాన్ని కలిగించి, చేయూతనిచ్చి,
సర్వ వేళల యందు కనురెప్పలా కాపాడి,
గౌరవంబిచ్చి, గారవించి,
ఆత్మాభిమానాన్ని పెంపు చేసి అలసిన నా మదికి సేదతీర్చి, నిస్వార్థంబుతోడ,ప్రణతులిత్తు నా ప్రాణ విభునకు.
ప్రణతులర్పింతు ఆ సర్వేశ్వరునికి సంబరంగా సుందరంబైన జగతిన మానవ జన్మనిచ్చి,
జన్మంబులన్నిట మనిషి జన్మ ఉత్కృష్ట జన్మంబని ఎరుకపరచి,
సార్థకంబు చేయ సన్మార్గమున నడవ పంపె
మహమాన్వితుడైన ఆ మహాదేవనికి మళ్ళీ మళ్ళీ ప్రణతులిత్తు.
