పుడమితల్లి వేదన

పుడమితల్లి వేదన

పి. వి. యన్. కృష్ణవేణి

సంజు,  సంజీవ్ అంటూ ఎవరో పిలుస్తున్నట్టు వినబడి వెనుదిరిగి చూశాను.

ఎదురుగా మా అమ్మ.  చక్కగా కళకళలాడుతూ, తలంటుకుని విరబూసిన జుట్టుతో,  నీలిరంగు చీర పైన ఆకుపచ్చని కుట్టు పూలు ఉన్న చీర కట్టుకొని,  ఎప్పుడూ లేనంత అందంగా ఆనందంగా ఉంది మా అమ్మ.

ఏంటమ్మా అని అడిగాను.

ఒరేయ్ సంజు, నా మాట కొంచెం వినిపించుకో రా!!! నువ్వు  పుట్టిన దగ్గర నుంచి నిన్ను నా గుండెలపై నడిపించాను రా!!!  నీ పాద స్పర్శని, నేను ఒక ముద్దు గా భావించాను రా!!! నువ్వు ఆడుకుంటూ నన్ను తన్ని నప్పుడు కూడా నీపై కోపగించుకోలేదు. మురిసిపోయి, ఆనంద భాష్పాలు కార్చాను.

నువ్వు ఆడుకుంటూ పడిపోయినప్పుడు కూడా నిన్ను నా కౌగిలిలో పొదవి పట్టుకున్నాను. నువ్వు నా గుండెలపై తన్నినప్పుడు కూడా నేను ఏమాత్రం నిన్ను అపలేదు. అది నాకు బాధ అనిపించలేదు.

కానీ, ఈరోజు నా హృదయం ద్రవించి పోతోంది.  కన్నతల్లిని కాటికి పంపించే నీ నిర్ణయం సరి అయినది కాదు.  నా గుండెల్లో గుణపాలు గుచ్చవద్దు రా!!!

ఒక్కసారి నా ఓర్పును గమనించి,  నీ చిన్నతనం గుర్తు తెచ్చుకో.  ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్న నీ తల్లి పై నువ్వు ఇప్పుడు నెత్తురు వర్షం కురిపించటం భావ్యమా అంటూ ఏడుస్తుంది.

సంజీవ్,  సంజీవ్ అంటూ నిద్రలో కలవరిస్తున్న నన్ను నిద్ర నుంచి తట్టి లేపింది లాస్య. నిద్ర నుంచి మేల్కొన్న నేను, బాగా ఆశ్చర్యపోయాను.

ఏంటి,  అమ్మ …. మా అమ్మ అంత బాధ పడుతూ కలలోకి వచ్చింది. అని ఒకసారి మా ఊరిలో ఉన్న అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాను. చక్కగా మాట్లాడింది.  చాలా సంతోషంగానే ఉంది.

కానీ  ఈ కల యొక్క భావం ఏంటి? నాకు మనసంతా ఏదో అలా అయిపోయింది. బాధగా ఉంది.

అనుకోకుండా నా చిన్నతనం కళ్ళముందు కదలాడింది.  నేను పల్లెటూరి లో పుట్టడం చేత,,  ఆ పల్లెటూరిలో ఆనందాన్ని,  అంటే మట్టిలో ఇల్లు కట్టి ఆడుకోవడం,  పొలానికి వెళ్ళినప్పుడు ఆ మట్టితోనే చిన్న బొమ్మలు చేసుకోవడం,  సాయంత్రం పూట స్నేహితులతో చేరి, నా అల్లరి కుప్పిగంతులు అన్ని ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. ఎన్నోసార్లు కింద పడినా,  మట్టి నేల అవటంచేత,  పెద్దగా దెబ్బలు తగిలెవీ కావు.

నాన్న  వ్యవసాయం చేస్తూ ఉంటే, ఆ పంట తోనే మాకు జీవనం సాగేది. ఆ అందాలు,  ఆ ఆనందాలు ఇప్పుడికి చెక్కుచెదరకుండా,  నా మనసులో కదలాడుతూనే ఉంటే, ఆ  జ్ఞాపకాలు ఎంత మధురమో అర్థం చేసుకోవచ్చు.

ఆ జ్ఞాపకాల్లో నేను ఉండగానే ఆఫీసుకు బయలుదేరి వచ్చేసాను. నేను ఒక ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉండటం వల్ల,మా టీం మొత్తాన్ని పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను.

డియర్ టీం మెంబర్స్,  మనం కొత్తగా మొదలు పెట్టిన ప్రాజెక్ట్ పనులు నిలిపివేయండి.  దానివల్ల చాలా కుటుంబాలు పొలాలను కోల్పోతాయి.

అదీకాక మన నిర్మించే ఫ్యాక్టరీలో నుంచీ వచ్చే వ్యర్థాల వల్ల భూమి కూడా విషపూరితం అవుతుందని,  తరువాత చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలావరకూ,  పంటలకు గాని,  పశువుల సేద్యానికి గాని మంచిది కాదు అని విన్నాను.

ఆ ఫ్యాక్టరీ వల్ల కలిగే లాభం కంటే నష్టమే,  నాకు ఎక్కువగా కనబడుతోంది.  ఇది మన పుడమి తల్లి.  మన భావితరాల కోసం, ఈ పుడమి తల్లిని కాపాడడం అనేది నేను ఒక భారంగా కాక ఒక బాధ్యతగా భావించాను.

అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ ప్రాజెక్టు ఇంతటితో ఆపేయండి. పై అధికారులతో నేను మాట్లాడి, వేరే చోటుకి, ఆ ఫ్యాక్టోరి మార్చటానికి నేనే ఒప్పిస్తాను.  థాంక్యూ అని మీటింగ్ కంప్లీట్ చేశాను.

నేను బయటకి చూసేసరికి, అదే నీలి రంగు,  ఆకుపచ్చ కుట్టు పూలు ఉన్న చీర కట్టుకున్న మా అమ్మ చిరునవ్వులు చిందిస్తూ నాకు దీవెనలు అందిస్తోంది.

ఆమె ఎవరో కాదు, నా తల్లి లాంటి నా పుడమి తల్లి. నన్ను భారము అనుకోకుండా బాధ్యతగా తన గుండెలపై నడిపించుకుంటున్న,  నా పుడమి తల్లి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!