రాంబాబు సంసారం

రాంబాబు సంసారం

రచన:దోసపాటి వెంకటరామచంద్రరావు

రాంబాబు ఇండియన్ బ్యాంకులో అధికారి. అతనికి విశాఖపట్నం లో వున్న శాఖకి బదిలి అయ్యింది. మూడేసి సంవత్సరాలకొకసారి ఈ బదిలితంతు తప్పదు.బ్రహ్మచారులకైతే ఇదేమి సమస్యకాదు. పెళ్ళైన వాళ్ళకి అందులో పిల్లలున్నవాళ్ళకి ఎన్ని పాట్లో చెప్ఫలేము.మూడేళ్ళకు ఒకసారి ఇల్లుమారడం చదువుకుంటున్న పిల్లలైతే అదీ చిన్నతరగతులలో వారైతే మరి సమస్యలే. సంవత్సరమధ్యలో పాఠశాలలను మార్చడం ఒక తలనొప్పి వ్యవహారం.
ఆ చదువు సంతకెళ్ళడమే.బండెడు సామాన్లతో ఇల్లు మారడం కూడా మరో సమస్య. బ్యాంకు వాళ్ళేదొ కొంత బదిలిఖర్చులు ఇచ్చి చెయ్యి దులిపేసుకుంటారు. మిగతాది చేతిచమురు వదిలించుకోవడమే.
విశాఖపట్నం శాఖలో తనతోపాటే బ్యాంకులో చేరిన రమేశ్ కి ఇల్లు చూడమని చెప్పాడు. బదలి అయితే వారంరోజులు సెలవు ఇస్తారు కనుక ఆ వారంలో ఇంట్లో చేరిపోవచ్చని నిర్ణయించుకున్నాడు. రమేశ్ ఇల్లు కుదిరిందని చెప్పడంతో ఒకసారి భార్య సుమని తీసుకొని వెళ్ళాడు రాంబాబు. ఇల్లు బాగా నచ్చింది ఇద్దరికి. వెంటనే ఆద్దె ఆడ్వాన్సు చెల్లించేశాడు రాంబాబు. ఇంటి యజమాని చెప్పిన షరతులన్ని గుర్తుంచుకున్నాడు. ఇంటి సమస్య తీరింది. ఇక పిల్లలు ఇద్దరిని హస్టల్ లోచేర్పించక తప్పలేదు. వారంరోజులసెలవు పూర్తికాకముందే మంచిరోజు చూసుకొని ఇంట్లో దిగిపోయాడు రాంబాబు.ముఖ్యమైన వస్తువలన్నీ సర్దుకొని మిగతావి తీరికసమయంలో సర్దుకొవచ్చని అనుకున్నారు రాంబాబు సుమ.ఒకరోజు వెంకమ్మ అనే మధ్యవయస్కురాలు వచ్చింది రాంబాబు వాళ్ళింటికి. ఆవిడ ఇంతకుముందు అద్దెకున్ళవాళ్ళ పనిమనిషట. పనిమనిషిని పెట్టుకుంటే తననే పెట్టుకోవాలని మరి వేరేఎవరూ ఇక్కడికి రారని
చెప్పింది. తను చేయాల్సిన పనులేమిటో కూడా చెప్పింది.అంతకుమించి అదనంగా ఏమి చేయనని ఖచ్చితంగా చెప్పింది. ఆమె మాటతీరుకు రాంబాబు సుమలు ఖంగుతిన్నారు. రమేశ్ తో చెబితే ఇక్కడ అంతే అన్నాడు. ఇక్కడ పనివాళ్ళు,పాలవాళ్ళు,చాకలి మంగళి ,కూరగాయల వాళ్ళు అందరు కట్టుగా ఉంటారని వారిని కాదని వేరేవారిని పెట్టుకొనే అవకాశం ఉండదని రమేశ్ చెప్పాడు.అది విని రాంబాబు సుమలు విస్తుపోయారు.రమేశ్ చెప్పినవిధంగానే ఒకొక్కరుగా పాలవాడు , చాకలి మరియు మంగళి కూరగాయలవాళ్ళు వచ్చి తమ సేవలు తప్పక వినియోగించుకోవాలని ఖరాఖండిగా చెప్పేసి వెళ్ళిపోయారు. రాంబాబు సుమలకు మరో అవకాశం లేదు మరి . ఇక అప్పటినుండి రాంబాబు
సంసారంలో సరిగమలు కాదు కాదు సేవకులతో పాట్లు ప్రారంభం.
ఆరోజు ఆదివారం . రోజు ఉదయం ఆరుగంటలకే రావాల్సిన పనిమనిషి వెంకమ్మ ఎనిమిది గంటలకు వచ్చింది. ఇంతాలస్యంగానా రావడమని సుమ అడగటంతో వెంకమ్మ ఏమందో వినండి.
“ఈరోజు ఆదివారం కదండి.మరి అయ్యగారికి సెలవే కదండి. రోజులా కాకుండా మీరు అన్నీ తీరుబాటుగా చేసుకుంటారు కదండి. వంటవార్పులు లేకుండా అలా బయటకెళ్ళే చేస్తారు కదండి. అందుకే నేను ఈ టైముకి వచ్చానండి.” వెంకమ్మ రీజనింగుకి ఏం మాట్లాడాలో తోచలేదు సుమకు.
మరో అరగంటకు చాకలి వచ్చి బట్టలు వేయమంది.
ఏమిలేవని చెప్పిన వినకుండా దివాన్ కాట్ కవర్లు, హాలులో సోఫా సెట్టు కవర్లు ఎన్నో లెక్క గట్టి రాసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. సుమకు మరో అవకాశం ఇవ్వలేదు. ఆ వెంటనే మంగలి వచ్చి “అయ్యగారు వచ్చి ట్రిమ్మింగు, షేవింగు చేయించేసుకొండి మళ్ళి వచ్చేవారం వరకు నాకు వీలవదండి”అని ఆర్డరు వేశాడు.
బయటకూరగాయలవాడొచ్చి అరపు. వారంరోజులకు సరిపోయే కూరగాయలు బయట పెట్టేసి వెళుతున్నాని. ఈలోగా పాలకుర్రాడు వచ్చాడు.
“అమ్మగారు !అర్జంటుగా ఊరెళ్ళాలి డబ్బులేమైనా సర్ధండి. ఓ నాలుగురోజులు పాలపేకట్లు కొనేసుకొండి”
అని చెప్పసాగేడు. రాంబాబు సుమలకు ఈ సేవకుల ధాటికి తట్టుకోలేక మాటలు రాని మూగవాళ్ళైపోయారు. ఎలాగుందంటారు రాంబాబు సుమల సంసారం? మీకూ ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ!అంతేగా!అంతేగొ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!