కార్పొరేట్ సంత

కార్పొరేట్ సంత

రచన: కృష్ణకుమారి

“కూరలు బిగ్ బాస్కెట్ నించీ తెచ్చుకోటం‌ లేదా? ఇప్పుడు ఎందుకు ఆ సంతకి?” కూరలసంచీ, బేగ్ తీసుకొని మాస్క్
ముఖానికి వేసుకున్న భార్య భవానీని చూస్తూ అన్నాడు మనోహర్.

“కరోనా గోల వచ్చిందగ్గరనించీ విసుగు వస్తున్నాది ఆ బిగ్ బాస్కెట్ రూల్సుకి ఆ కార్పోరేట్ వాళ్ళు అన్నీ ఎక్కువలు కొంటేనే ఇస్తారు”

“నిజమే గానీ.. ఎక్కువ కొంటేనేం?

“అరకేజీ కూర ఎక్కడ తినగలం? మీరా ఒక గరిటెడే.. మిగుళ్ళు పనమ్మాయి తీసుకెళ్ళదు. నా కళ్ళముందే చెత్తబుట్టలో వేస్తుంది. ఆ ఆన్ లైన్ వాళ్ళు ఎక్కువెక్కువ అదీ, ఎక్కువ రకాలు కొంటేనే ఇంటికి తెస్తారు. ఆ శనగపిండి ఇంకా పడుంది. ఇద్దరికి ఎంత కావాలండీ… నేను పక్కింటి సుమతి కలిసి వెళ్తాం”

“నీ ఇష్టం, పోనీ నేను తెస్తానంటే వినవు….” రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది భవానీ.

“మహానుభావా..‌ మీరా కూరలు తేడమా? దొండకాయలు తెస్తే అన్నీ పళ్ళే. వంకాయలకి నావయసు
ఉంటుంది. కర్మకాలి ఒక్కసారి ‘రెండు కొత్తిమీర కట్టలు తెండి’ అంటే ఎలా తెచ్చేరు? ఒకొక్క కట్టనీ‌ పదేసి చిన్న
కట్టలతో కట్టేసాడు. అలాటివి రెండు తేడమే కాక, ‘నువ్వు అడిగినట్టు రెండే తెచ్చేను కదా’ అని సమర్థించుకోడం
ఒకటీ…..”

“బాబో వెళ్ళు వెళ్ళు….” మనోహర్ చెవులు మూసేసుకున్నాడు.

సుమతీ భవానీ కలిసి బయలుదేరేరు.

కూరల బజారులో తిరుగుతూ కావలసినవి ఎంచుకొని తెచ్చుకోడం భవానీకి చాలా ఇష్టం. కరోనా భయానికి అంతకన్నా ఎక్కువ అమెరికా నించీ సింగపూర్ నించీ‌ పిల్లలు చెప్పే జాగ్రత్తలకి ఎక్కువ భయపడి సంతకి వెళ్ళడం మానేసింది.

కూరల బజార్ సందడిగా ఉంది. కూరలు ఎంచుకుందాం అని ఇద్దరూ నిలబడ్డారు. “టొమాటలు కేజీ యాభై అరకేజీ ముఫై” నిక్కచ్చిగా చెప్పింది అమ్మే ఆవిడ. వంకాయలూ అంతే. అరకేజీ ముఫై పావుకేజీ అయితే ఇరవై”

ప్రతీ చోటా ధరలు ఇలాగే చెప్తున్నారు. అరకేజీ ధరలో సగం పావుకేజీ కాదుట. ఆకుకూరలూ అంతే. ‌”ఇరవైకి నాలుగు
కట్టలు. ‌పదికయితే ఒకటే” నిక్కచ్చిగా చెప్పేసింది.

ములక్కాడ ఒక్కటి అమ్మరట. కట్టలో అయిదు ఉంటాయి. రెండు పాడయినవే ఉంటాయి. పళ్ళు ఏపిల్స్ యాభైకి మూడు. ఒక పండు అయితే ఇరవై. బొప్పాసిపండు కేజీ యాభై. కేజీకి తక్కువ అమ్మరు. తప్పదు కేజీన్నర కొనాల్సిందే..

భవానీకి తిక్కవచ్చేసింది. నీరసంగా “సుమతీ.. ఏమిటి ఈ లెక్కలు? ఇదివరకు ఇలా అనీవారు కాదే… నాకు పావు కేజీవే ఎక్కువ. ప్రతీ కూరా ఎక్కువగా కొనాలి. ‌లేదా ధర ఎక్కువ పొయ్యాలి. అంతేనా?” అంది.

“అంతే భవానీ… ఇదో కార్పోరేట్ సంత” సుమతి కూడా కసిగా అంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!