పుట్టినరోజు పండుగ

అంశం: బాలవాక్కు బ్రహ్మ వాక్కు

పుట్టినరోజు పండుగ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

“తేజూ నీ పుట్టినరోజు పార్టీ చేకుందామని అన్నావు కదా! ఇంకా రెండ్రోజులే ఉందిగా, నీ ఫ్రెండ్స్ అందరినీ పిలువు. ఉదయాన్నే గుడికి వెళ్ళి వద్దాం, ఆ సాయంత్రం మన ఇంట్లో పార్టీ సరేనా?” అన్నాడు తండ్రి పవన్.

“సరే నాన్నా థాంక్యూ” అంటూ ఆనందంగా లోపలకు వెళ్ళిపోయాడు తేజూ.

“అయ్యో ఇప్పుడు పార్టీలు అవన్నీ ఎందుకండి, మనకొచ్చే అరకొర జీతం నెల ఖర్చులకే సరిపోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ పుట్టినరోజు పార్టీ అంటే బోలెడు ఖర్చు, అదెక్కడి నుంచీ తెస్తారండీ?” ఆవేదనగా అంది భార్య సుమిత్ర.

“ఎలాగోలా ఎక్కడో చోట అప్పు చేసి అయినా ఈసారి వాడి పుట్టినరోజు వేడుకలు చేద్దాం సుమిత్రా. పాపం ఎన్నాళ్ల నుంచో అడుగుతున్నాడు కదా. వాడి మొహంలో ఆ ఆనందం చూశావా? పార్టీ చేద్దాం అనగానే సంతోషంతో పొంగిపోయాడు. తన ఆనందం కోసమైనా ఈసారి మనం కాస్త కష్టపడక తప్పదు” అంటూ ఓదార్పుగా చెప్పాడు భార్యకి.

“అది సరే అండి, కానీ ఇప్పటికే అప్పు చాలా ఉంది. అది తీర్చే వరకూ మళ్ళీ వేరే అప్పులు చెయ్యకూడదని అనుకున్నాం కదా! మరి అంత డబ్బు ఎక్కడినుంచి తీసుకు వస్తారు?” ఆందోళనగా అడిగింది.

“ఆ సంగతి నేను చూసుకుంటాను, కానీ నువ్వు ఆరోజు ఇంట్లో చెయ్యాల్సిన ఏర్పాట్లు గురించీ చూసుకో. డబ్బు గురించీ నువ్వేం ఆలోచించకు!” భార్యని వారించి తను ఆలోచనలో పడ్డాడు.

“ఎలా తీసుకురావాలి అంత డబ్బు? గురవయ్య ని అడిగితే?” “అమ్మో ఇప్పటికే రెండువేలు బాకి ఉన్నాను అతని దగ్గర. ఇప్పుడు నన్ను చూడగానే ఆ డబ్బు కట్టమని అడుగుతాడు.” “పోనీ, రంగ బాబాయ్ ని అడిగితే, మళ్ళీ ఏదొక మాట వేస్తాడు “డబ్బు సంపాదించలేని వాడు ఒట్టి పోయిన గొడ్డుతో సమానం” అంటాడు. మరి ఎవర్ని అడగాలి?” ఇలా పలు రకాలుగా ఆలోచిస్తూ చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, నిద్రలోకి జారుకున్నాడు.

***

మర్నాడు ఆఫీసుకి వెళ్ళి వస్తూ, తను అనుకున్న పని పూర్తి చేశాడు. “ఈసారికి తేజూ పుట్టినరోజు వాడు కోరుకున్నట్లుగా చేయచ్చు ఈ డబ్బుతో” అనుకున్నాడు మనసులో తృప్తిగా.

“తేజూ ఇదుగో నీ కొత్త బట్టలు. పుట్టినరోజు పార్టీకి కావలసినవి అన్నీ సాయంత్రం తెచ్చుకుందాం” అంటూ కొడుక్కి కొత్త బట్టలు చూపించాడు.

“థాంక్స్ నాన్నా, అబ్బా ఎంత బాగున్నాయో కొత్త బట్టలు” అంటూ వాటిని చూస్తూ మురిసిపోయాడు తేజూ.

డబ్బుతో తిరిగి ఇంటికి వచ్చిన భర్తని చూసి, ఆశ్చర్యంగా “ఎక్కడి దండి ఇంత డబ్బు? ఒక్కపూటలో ఎలా సంపాదించారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

“అబ్బాబ్బా ఎప్పుడూ ప్రశ్నలేనా? ఎలాగో తెచ్చాను కదా? ఈసారికి ఇలా కానిచ్చేద్దాం” అన్నాడు భార్యతో.

భోజనాలకు అన్నీ సిద్ధం చేసి, స్నానం చేసి బీరువా తెరిచిన సుమిత్రకి ఏదో వెలితిగా అనిపించింది. పట్టి చూశాక అర్థమయ్యింది, తన హరమ్ కనపడటం లేదని. కంగారుగా ఆ విషయం భర్తకి చెప్పాలని వచ్చింది.

“ఏమండీ బీరువాలో పెట్టిన హారం మీరేమైనా చూసారా? కనపడటం లేదండీ” అంటూ కంగారు పడింది.

“సుమిత్రా, ఊరుకో, ఏమీ కాలేదు. ఆ హారాన్ని అమ్మే ఇవన్నీ తెచ్చాను. నీకు చెప్తే కాదంటావేమో అని చెప్పలేదు. ఈసారి మళ్ళీ కొంటాలే. తేజూ అడిగింది చిన్న కోరిక అది కూడా తీర్చకపోతే ఎలా? ప్లీజ్ సుమిత్రా అర్థం చేసుకుంటావు కదూ?” గోముగా అడిగాడు.

“అయ్యో, నా బాధ అది నాకు లేదని కాదండి, ఆ హరమ్ కొనడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు మళ్లీ కొనాలంటే ఇంకెంత కష్టమో అని ఆలోచిస్తున్నాను అంతే.”

అమ్మా నాన్నల సంభాషణ అంతా విన్న తేజూ తండ్రి దగ్గరకి వచ్చి, “నాన్నా! నా పుట్టినరోజు వేడుక కోసం అమ్మకని ఎంతో కష్టపడి కొన్న హారం అమ్మేశారా? అయ్యో సారీ నాన్నా, ఇంత కష్టం అని నాకు తెలీదు. తెలిసి ఉంటే అసలు పుట్టినరోజు పార్టీ చెయ్యమని అడిగేవాడిని కాదు. వద్దు నాన్నా నాకు ఏ పార్టీలు వద్దు. ఇప్పుడే ఇవన్నీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసి, మళ్ళీ అమ్మ హారం అమ్మకి తీసుకురా నాన్నా!” అంటూ పవన్ ని హత్తుకుని ఏడవటం మొదలు పెట్టాడు.

“అయ్యో  తేజూ వినేశావా? అయినా నేను నీకోసం ఆ మాత్రం చెయ్యలేనా చెప్పు. అవన్నీ నువ్వేం ఆలోచించకు. చక్కగా ఫ్రెండ్స్ తో పుట్టినరోజు చేసుకో. ఇవేమీ మనసులో పెట్టుకోకు” అంటూ నచ్చచెప్పాడు పవన్.

“అదేం కాదు నాన్నా. నాకు నా ఫ్రెండ్స్ ని పార్టీ కి పిలవడం కన్నా అమ్మా నాన్నా సంతోషంగా ఉండటం ముఖ్యం. పార్టీ వద్దు, అసలు పుట్టినరోజు వేడుకలే వద్దు” అంటూ ఏడ్వసాగాడు.

“అయ్యో కన్నా అలా ఏడవకు రా. నీ సంతోషం కోసమే కదా మేము ఇదంతా చేస్తున్నది. నువ్వలా ఏడుస్తూ ఉంటే మాకు ఎలా ఉంటుంది చెప్పు. ఏడవకు, నీకు ఎలా కావాలంటే అలా చేద్దాం సరేనా?” అంటూ అనునయించింది తల్లి సుమిత్ర.

“అయితే పుట్టినరోజు పార్టీ వద్దు నాకు. నీ హారం తిరిగి తెచ్చేయమని చెప్పమ్మా నాన్నకి. అన్నాడు తల్లి ఒడిలో చేరుతూ.

“తేజూ ఎలాగూ తెచ్చారు కదా నాన్న. ఈసారికి పార్టీ చేసుకుంటే నీ కోరిక తీరినట్లు కూడా ఉంటుంది. అయినా నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మళ్ళీ వద్దంటే బాగోదు నాన్నా. సరేనా?” అంది మళ్ళీ.

“సరే అమ్మా, అయితే నీ ఇష్టం. నేను పెద్దయ్యాక చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను. అప్పుడు బోలెడు డబ్బులు సంపాదించి, నీకు మంచి నగలు, నీకూ నాన్నకి కొత్త బట్టలు తీసుకుంటాను. అప్పుడు చక్కగా మన దగ్గర బోలెడు డబ్బులు ఉంటాయి. ఇలా అప్పు చెయ్యక్కర్లేదు. నాన్న అప్పులన్నీ తీర్చేద్దామ్. సరేనా?” అంటూ తన భావాలను బయటపెట్టాడు తేజూ.

“చిన్నవాడివైనా ఎంత బాగా చెప్పావు రా. అందుకే అంటారు బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని, నీ మాట నిజం అవ్వాలి, అవుతుంది కూడా. అయితే దానికి నువ్వు బాగా చదువుకోవాలి. సరే అయితే రేపటికి కావాల్సిన సరుకులు కొందాం పద”

“సరే అమ్మా, నేను బాగా చదువుకుంటాను. నాన్నని నిన్నూ బాగా చూసుకుంటాను కూడా” అన్నాడు ఆనందంగా.

*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!